స్థానిక సమరానికి ‘సై’

మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష
 నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి …
ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పూర్తయింది.  వొచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ ముహూర్తం నిర్ణయించినట్టు  సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్‌ విడుదలవుతుంది. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చి, మూడు దశల్లో ఎన్నికలు పూర్తిచేస్తారు. దాంతో ప్రధాన పార్టీలు రెండు నెలల్లో జరిగే స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో 32 జిల్లాలు, 538 మండలాల పరిధిలో 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,67,33,584 ఓటర్లు ఉండగా.. అందులో పురుషు ఓటర్లు 82,04,518 మంది, మహిళా ఓటర్లు 85,28,573 మంది, ట్రాన్స్‌ జెండర్స్‌  ఓటర్లు  493 మంది ఉన్నారు. రాష్ట్రం లోని మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష.  నగారా మోగగానే అవి మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చింది. ఈ ఏడాది జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఊహించని ఫలితాలు సాధించగా..భారత రాష్ట్ర సమితి మాత్రం చావు దెబ్బతిన్నది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం పోరాడుతోంది. తన బలాన్ని తిరిగి కూడగట్టుకునే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కలుగుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన బీఆర్‌ఎస్‌ పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో సత్తాచాటిన గులాబీ పార్టీ.. గ్రావిరీణ ప్రాంతాల్లోనూ తమ బలం తగ్గలేదని నిరూపించుకునేందుకు ఇది గొప్ప అవకాశం. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి భారాన్ని స్థానిక సంస్థల్లో దించుకోవాలన్న వ్యూహంతో ఉంది బీఆర్‌ఎస్‌. ఇక పాలక కాంగ్రెస్‌ స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కలిసొస్తాయన్న ధీమాతో ఉంది. అధికారంలోకి రాగానే స్థానికసంస్థల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌.. వొచ్చే ఎన్నికలను  సవాల్‌గా భావిస్తోంది. ఇవి రేవంత్‌రెడ్డి ఏడాది పాలనకు రెఫరెండం లా మారబోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీకి కూడా స్థానిక సంస్థలు సవాలుగా మారబోతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ బలం ఉందని  నిరూపించుకోవా లంటే స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది.

ఒకరికిద్దరు కేంద్రమంత్రులున్నా పార్టీ రాష్ట్ర సారథిపై నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ మొదలుకావటంతో త్వరగా కొత్త అధ్యక్షుడెవరో తేలిస్తే ఎన్నికలకు సిద్ధం కావొచ్చంటోంది ఆ పార్టీ కేడర్‌. మొత్తానికి తొమ్మిదినెలల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాబోతోంది. గల్లీదాకా పార్టీజెండా ఎగిరే ఎన్నికలు కావటంతో మూడు ప్రధానపార్టీలకూ అత్యంత కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం, ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను  చూస్తున్నారు. దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కులగణన తర్వాత లోకల్‌ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు హావిరీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన పక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ను నియమించగా.. జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తోంది.

ఈ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసి బీఆర్‌ఎస్‌, బీజీపీని క్షేత్ర స్థాయిలో ఖతం చేయాలన్న వ్యూహంతో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ స్కీమ్స్‌ ను అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతు భరోసా సాయం, పెన్షన్లను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వైపు మహిళలకు నెలకు రూ.2500 అందించే స్కీమ్‌ ను సైతం అమలు చేయాలని రేవంత్‌  సర్కార్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిధుల సవిరీకరణ, గైడ్‌ ల్కెన్స్‌ రూపకల్పనపై అధికారులు ఫోకస్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకాల లబ్దిదారుల ఓట్లలో స్థానిక సంస్థలపై కాంగ్రెస్‌ జెండా ఎగర వేయాలన్నది ప్రభుత్వ ప్లాన్‌  గా తెలుస్తోంది.  ఒక దశలో నాలుగు వేల పంచాయతీల చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
-వడ్డె మారన్న    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page