“ఆన్‌లైన్‌లో ఒక వస్తువు చూసిన వెంటనే అదే వస్తువుకు సంబంధించిన ప్రకటనలు మన ఫోన్‌లో వరుసగా కనిపిస్తుంటాయి. చాలామందికి అప్పుడొక సందేహం వస్తుంది. “నేను ఏం వెతుకుతున్నానో వీళ్లకెలా తెలుసు?” అని. నిజానికి ఇది డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకలా మారిన డేటా సేకరణ ఫలితం. మనం ఏం చూస్తున్నాం, ఏం కొనుగోలు చేస్తున్నాం, దేనిపై ఆసక్తి చూపిస్తున్నాం అనే సమాచారాన్ని కంపెనీలు సేకరిస్తుంటాయి. ఒకవైపు చూస్తే ఇది సౌలభ్యమే. మనకు అవసరమైన వస్తువులు త్వరగా కనిపిస్తాయి. కానీ మరోవైపు ఇదే సమాచారం మన నిర్ణయాలను ప్రభావితం చేసే సాధనంగా మారినప్పుడు ఆందోళన మొదలవుతుంది. ఇక్కడే డార్క్ ప్యాటర్న్ల పాత్ర మొదలవుతుంది..”
డి జయరాం మెంటార్ శ్రీ జైరాం కాంపిటేటివ్ అకాడమీ
డిజిటల్ ప్రపంచంలో ఈ-కామర్స్ మోసాలు మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. వ్యాపార ప్రకటనలు మన మొబైల్ తెర మీదే చిరునవ్వుతో కనిపిస్తున్నాయి. “ఇంకా రెండు వస్తువులు మాత్రమే మిగిలి ఉన్నాయి”, “ఆఫర్ ముగియడానికి ఇంకొన్ని నిమిషాలే”, “ఇప్పుడే కొనండి” వంటి సందేశాలు సాధారణ సమాచారం లాగా కనిపించినా చాలాసార్లు అవి మన నిర్ణయాలను ప్రభావితం చేసే వ్యాపార ఎత్తుగడలే. వినియోగదారుడికి పూర్తి సమాచారం ఇవ్వకుండా వారి ఎంపిక స్వేచ్ఛను ప్రభావితం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసే మోసపూరిత డిజిటల్ రూపకల్పనలనే ‘డార్క్ ప్యాటర్న్లు’ అంటారు. పేరు కొత్తగా ఉన్నా పద్ధతి మాత్రం పాతదే.
వినియోగదారుడి అజాగ్రత్తను లాభంగా మార్చుకోవడమే వీటి అసలు లక్ష్యం. ఒక వస్తువు కొనాలా వద్దా అన్న నిర్ణయం మనదే కావాలి. కానీ మనకు తెలియకుండానే ఆ నిర్ణయాన్ని ఒక దిశగా మళ్లించే ప్రయత్నం చేసినప్పుడు సమస్య మొదలవుతుంది. మొబైల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత మన కొనుగోలు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు దుకాణానికి వెళ్లి కొనాల్సిన వస్తువులు ఇప్పుడు ఇంటి నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ధరలు పోల్చుకోవచ్చు. సమీక్షలు చూడొచ్చు. ఆర్డర్ ఇస్తే సరుకు ఇంటి గుమ్మం ముందు దిగుతుంది. ఈ-కామర్స్ తెచ్చిన సౌలభ్యాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఈ సౌలభ్యం వెనుక వినియోగదారుడికి కనిపించని మరో ప్రపంచం కూడా పెరుగుతోంది. అక్కడ ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్, ప్రతి కొనుగోలు ఒక వ్యాపార అవకాశంగా మారుతోంది. ఇక్కడే వ్యాపార రహస్యం మొదలవుతుంది.
డార్క్ ప్యాటర్న్ల మాయాజాలం:
ఆన్‌లైన్‌లో ఒక వస్తువు చూసిన వెంటనే అదే వస్తువుకు సంబంధించిన ప్రకటనలు మన ఫోన్‌లో వరుసగా కనిపిస్తుంటాయి. చాలామందికి అప్పుడొక సందేహం వస్తుంది. “నేను ఏం వెతుకుతున్నానో వీళ్లకెలా తెలుసు?” అని. నిజానికి ఇది డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకలా మారిన డేటా సేకరణ ఫలితం. మనం ఏం చూస్తున్నాం, ఏం కొనుగోలు చేస్తున్నాం, దేనిపై ఆసక్తి చూపిస్తున్నాం అనే సమాచారాన్ని కంపెనీలు సేకరిస్తుంటాయి. ఒకవైపు చూస్తే ఇది సౌలభ్యమే. మనకు అవసరమైన వస్తువులు త్వరగా కనిపిస్తాయి. కానీ మరోవైపు ఇదే సమాచారం మన నిర్ణయాలను ప్రభావితం చేసే సాధనంగా మారినప్పుడు ఆందోళన మొదలవుతుంది. ఇక్కడే డార్క్ ప్యాటర్న్ల పాత్ర మొదలవుతుంది. వీటి లక్ష్యం సమాచారం ఇవ్వడం కాదు. వినియోగదారుడిని ఒక నిర్దిష్ట నిర్ణయం వైపు నెట్టడం. కొన్నిసార్లు అత్యవసరతను సృష్టించడం ద్వారా, మరికొన్నిసార్లు ఎంపికలను దాచిపెట్టడం ద్వారా, ఇంకొన్నిసార్లు అదనపు ఖర్చులను చివరి దశలో చూపించడం ద్వారా ఇవి పనిచేస్తాయి. మనకు తెలియకుండానే కార్ట్‌లో అదనపు వస్తువులు చేరడం, ఒక సేవకు సభ్యత్వం తీసుకోవడం సులభంగా ఉండి దాన్ని రద్దు చేయడం కష్టంగా మారడం, ఒక ఎంపికను పెద్దగా చూపించి మరో ఎంపికను కనిపించకుండా చేయడం, దాచిపెట్టిన రుసుములను చివరి దశలో చూపించడం, అపరాధ భావన కలిగించే భాషతో నిర్ణయం మార్చే ప్రయత్నం చేయడం వంటి అనేక రూపాల్లో ఇవి కనిపిస్తాయి. బయటకు చూస్తే ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు. కానీ లక్షలాది మంది వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి వీటికి ఉంది.
కోర్టుల కొరడా:
మన దేశంలో ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ 2023లో ఇలాంటి 13 రకాల డార్క్ ప్యాటర్న్లను గుర్తించి నిషేధించింది. 2025 జూన్‌లో అన్ని ఈ-కామర్స్ వేదికలు మూడు నెలల్లోపు స్వీయ తనిఖీలు నిర్వహించి డార్క్ ప్యాటర్న్లను తొలగించాలని ఆదేశించింది. తమ వేదికల్లో అలాంటి పద్ధతులు లేవని స్వీయ ప్రకటనలు ఇవ్వాలని కూడా సూచించింది. ఈ నిర్ణయం వెనుక కారణం కూడా స్పష్టంగానే ఉంది. సమస్య ఒక్కటి రెండు కంపెనీలకే పరిమితం కాలేదు. డిజిటల్ మార్కెట్‌లో తప్పుడు అత్యవసరత సృష్టించడం, దాచిపెట్టిన ఛార్జీలు వసూలు చేయడం, సబ్‌స్క్రిప్షన్ ఉచ్చులు వేయడం, వినియోగదారుడి ఎంపికలను ప్రభావితం చేసే రూపకల్పనలను ఉపయోగించడం పెరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
న్యాయస్థానాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. డిజిటల్ వ్యాపారంలో లాభం కోసం వినియోగదారుడి అజాగ్రత్తను ఉపయోగించుకోవడం సరైన పద్ధతి కాదని పలుమార్లు స్పష్టం చేశాయి. అశ్వని చావ్లా వర్సెస్ ఫ్లిప్‌కార్ట్ కేసులో కొనుగోలు ప్రక్రియలో వినియోగదారుడి స్పష్టమైన అంగీకారం లేకుండా అదనపు సేవలు లేదా చెల్లింపులు చేర్చడాన్ని వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. వెబ్‌సైట్ రూపకల్పన పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోలేమని పేర్కొంది. ఈ తీర్పు చెప్పిన విషయం చాలా సులభం. డిజిటల్ ప్రపంచంలో కనిపించే ప్రతి “ఒప్పుకున్నాను” బటన్ వెనుక నిజమైన అంగీకారం ఉండాలే తప్ప, గందరగోళం లేదా నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అసలు సమస్య కొన్ని రూపాయలు ఎక్కువ వసూలు చేయడంలో లేదు. మన నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో ఉంది. ఒక వస్తువు కొనాలా వద్దా అన్న నిర్ణయం పూర్తిగా మనదే కావాలి. కానీ పూర్తి సమాచారం ఇవ్వకుండా, తొందరపెట్టి, ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తే అది నిజమైన ఎంపిక కాదు. డార్క్ ప్యాటర్న్ల అసలు ప్రమాదం ఇక్కడే ఉంది.
సమీక్ష రూపంలో అబద్ధాలు:
డిజిటల్ ప్రపంచంలో మరో పెద్ద సమస్య నకిలీ సమీక్షలు. ఐదు నక్షత్రాల రేటింగ్‌లు చూసి చాలామంది వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆ సమీక్షల్లో ఎన్ని నిజమైనవి? ఎన్ని డబ్బు ఇచ్చి రాయించినవి? అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు కృత్రిమ మేధ సాయంతో నకిలీ సమీక్షలు, నకిలీ చిత్రాలు, నకిలీ వీడియోలు తయారు చేయడం మరింత సులభమవుతోంది. ఒకప్పుడు మోసాన్ని గుర్తించడం కష్టమైతే, ఇప్పుడు నిజాన్ని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇదే డిజిటల్ యుగంలోని కొత్త సవాలు.
వినియోగదారులు మేల్కొవాలి:
అయితే చట్టాలు వచ్చినంత మాత్రాన సమస్య పూర్తిగా ముగిసిపోదు. సాంకేతికత ఎంత వేగంగా మారుతుందో, మోసపూరిత పద్ధతులు కూడా అంతే వేగంగా కొత్త రూపాల్లో వస్తుంటాయి. కృత్రిమ మేధ, డీప్‌ఫేక్ సాంకేతికతలు ఎంత మంచి అవకాశాలు తెస్తున్నాయో అంతే ప్రమాదాలను కూడా తీసుకొస్తున్నాయి. నియంత్రణ సంస్థలు ఒక సమస్యను పరిష్కరించేలోపే మరో కొత్త పద్ధతి మార్కెట్‌లోకి వస్తోంది. అందుకే ఈ పోరాటం నిరంతర ప్రక్రియగా మారింది. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి ఆఫర్‌ను నమ్మకూడదు. ప్రతి సమీక్షను నిజమని అనుకోవద్దు. కొనుగోలు చేసే ముందు నిబంధనలు చదవాలి. చివరి దశలో ధరలో మార్పులు ఉన్నాయా లేదా గమనించాలి. అనుమానం వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మోసపోయినప్పుడు మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ప్రశ్నించని వినియోగదారుడే మోసగాళ్లకు పెద్ద బలం. జాగ్రత్తగా ఉండే వినియోగదారుడే వారికి పెద్ద అడ్డంకి.
డిజిటల్ ప్రపంచం మన జీవితాలను సులభతరం చేసింది. కానీ అదే సమయంలో కొత్త రకాల మోసాలకు కూడా తలుపులు తెరిచింది. ప్రతి ప్రకటన అబద్ధం కాదు. ప్రతి కంపెనీ మోసగాడు కాదు. కానీ ప్రతి క్లిక్ వెనుక ఒక వ్యాపార ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ప్రభుత్వ నియంత్రణలు, కోర్టుల తీర్పులు మార్కెట్‌ను క్రమశిక్షణలో పెట్టగలవు. కానీ మన తరఫున నిర్ణయం తీసుకోలేవు. ఆ బాధ్యత మనదే. ఎందుకంటే డిజిటల్ యుగంలో జరుగుతున్న అసలు పోరాటం వస్తువుల అమ్మకాల కోసం కాదు. వినియోగదారుడి దృష్టి, నమ్మకం, నిర్ణయంపై ఆధిపత్యం కోసం. తెరపై కనిపించే ప్రతి ఎర వెనుక జేబుపైనే కాదు, మన నిర్ణయ స్వేచ్ఛపైనా చెర వేసే ప్రయత్నం దాగి ఉండొచ్చు. ఆ పోరాటంలో అప్రమత్తత కోల్పోయినవాడు వినియోగదారుడిగా మిగలడు. ఉత్పత్తిగా మారిపోతాడు.