“గోపీనాథ్ మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించడం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు లింక్ పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి, ఆమె ఓదార్పును కూడా రాజకీయ దృక్కోణంలోనే చూడడంపట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు.”

ప్రజల సానుభూతితో వోట్లు దండుకోవడానికే బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్ళు పెట్టుకుంటున్నదా అంటే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లో అవుననే సమాధానం వస్తున్నది. పైగా ఎన్నికల ప్రచార వేదికల్లో తప్పనిసరిగా కన్నీళ్ళు పెట్టుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమెకు సూచిస్తున్నట్లు మంత్రి చేసిన కామెంట్ పలువురిని విస్మయపరుస్తున్నది. ఒకపక్క ఆమెపై సానుభూతిని ప్రకటిస్తూనే మరో పక్క దాన్ని డ్రామాగా అభివర్ణించడం ఆయనకే చెల్లిందన్న విమర్శలు వస్తున్నాయి. దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మూడుసార్లు వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఆనారోగ్య కారణంగా జూన్ ఎనిమిదిన ఆకస్మాత్తుగా మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అనేక తర్జనభర్జనల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేసింది.
శాసన సభ్యులెవరైనా అకస్మాత్తుగా మృతి చెందినప్పుడు, సంబంధిత నియోజకవర్గ రాజకీయ పరిస్థితులనుబట్టి వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి సిట్టింగ్ పార్టీ టికట్ ఇవ్వడమన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ వస్తున్నదే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికిందరాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్‌ఏ సాయన్న మరణించినప్పుడు ఆయన పెద్ద కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్ టికట్ ఇచ్చింది. ఆమెకూడా యాక్సిడెంట్‌లో మృతిచెందటంతో ఆమె చెల్లెలు నివేదితకు బీఆర్‌ఎస్ టికట్ ఇచ్చింది. అయితే ఆ స్థానాన్ని బీఆర్‌ఎస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆలాగే గతంలో దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్య సుజాతకు అవకాశమిచ్చారు. ఇతర పార్టీల్లో కూడా ఇలాంటి సంప్రదాయం కొనసాగింది.
2016లో పాలేరు శాసన సభ్యుడు రామిరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో ఆయన భార్య సుజాతకు టికట్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ఆంజయ్య మరణంతో ఆయన భార్య మణెమ్మకు, మాగంటి సుబ్బిరామిరెడ్ది మృతితో ఆయన భార్య పార్వతమ్మకు, ఎలిమినేటి మాధవరెడ్డి మరణంతో ఆయన భార్య ఉమా మాధవరెడ్డికి, సీఎం పదవిలో కొనసాగుతూ మృతి చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య వైఎస్ విజయమ్మకు ఇలాగే అవకాశాలు లభించాయి. అయితే వీరిలో కొందరు ఆయా ఎన్నికల్లో గెలిచినా, మరికొందరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇప్పుడు మాగంటి సునీతకు కూడా బీఆర్‌ఎస్‌పార్టీకి ఆ కుటుంబం చేసిన సేవలకు గుర్తింపుగా టికట్ కేటాయించారు. మాగంటి గోపీనాథ్ మొదట్లో టిడిపి ఎంఎల్‌ఏగా ఆ తర్వాత వరుసగా బీఆర్‌ఎస్ ఎంఎల్‌ఏగా ఆ ప్రాంత ప్రజల నోట్లో నాలుకలా వ్యవహరించారన్న పేరుంది. అర్థరాత్రి అన్నా మాకు ఈ కష్టం వచ్చిందని చెబితే చాలు, ఏమాత్రం వెనుకాడకుండా వచ్చి, తమ సమస్యను పరిష్కరించేవాడని నియోజకవర్గ ప్రజలు నేటికీ చెప్పుకుంటున్నారు. ఆయన మరణాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామంటూ వారు ఆవేదన చెందుతున్నారు. గోపీనాథ్ కుటుంబానికి స్థానిక ప్రజల్లో మంచిపేరుండడంతో పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ ఆయన భార్యకు టికట్ ఇవ్వడంద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్లు అవుతుందన్నది బీఆర్‌ఎస్ భావన. ఏనాడూ పబ్లిక్ మీటింగ్‌ల్లో పాల్గొనని సునీత తన భర్త చనిపోయి నాలుగు నెలలు కూడా కాకముందే, దుఃఖాన్ని దిగమింగుకొని ఎన్నికల రణక్షేత్రంలో పాల్గొనాల్సి వచ్చింది.
నియోజకవర్గ ప్రజల ముందు మాట్లాడే క్రమంలో ప్రజలనుండి వస్తున్న రెస్పాన్స్ చూసి, ఆమె భావోద్వేగానికి గురైంది. మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఒకపక్క దుఃఖం తన్నుకు వస్తున్న క్రమంలో అతికష్టంగా రెండు మాటలతో తన ప్రసంగాన్ని ముగించింది. గోపన్న అంటేనే జనం.. జనం అంటేనే గోపన్న అన్నవిధంగా ఇంతకాలం కొనసాగిన విధానాన్ని తాను కూడా కొనసాగిస్తానని, ఆయన ఆశయాలను నెరవేరుస్తాన్నారు. మీ ఆడబిడ్డననుకొని తనను ఆదరించమని ఈ సందర్భంగా వేడుకుంది. అయితే ఈ రెండు ముక్కలు మాట్లాడేప్పుడు ఆగని ఆమె కన్నీరును కూతురు అక్షర, కుమారుడు తుడిచి ఓదార్చే ప్రయత్నం చేశారు.
గోపీనాథ్ మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించడం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు లింక్ పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి, ఆమె ఓదార్పును కూడా రాజకీయ దృక్కోణంలోనే చూడడంపట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా సినిమా చూసినట్లుందంటున్న మంత్రి పొన్నం మాటలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా విరుచుకు పడుతున్నది. వెంటనే ఆమెకు మంత్రి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.





