డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) 2009 నుంచి ఉధృతమైన ఉద్యమంలో సకల జనులను ముందుకు నడపడంలోనూ ప్రముఖ పాత్ర పోషించింది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గ్రహించి, యువతీ యువకుల బలిదానాలను గుర్తించి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తమ అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన హామీని 2014లో అమలు చేసింది. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా(బీఆర్‌ఎస్) రూపాంతరం చెందింది. 2014, 2018 రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ప్రస్తుత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పేరుతో పోటీలో నిలిచింది.
నేడే తెలంగాణ ఎన్నికల ఫలితం
రాజకీయక్రీడలో ఉత్కంఠ దృశ్యం
విజయ తీరం చేరేవారికి మోదం
వాడిపోతుంది ఓడినవారి ముఖం
ప్రజామోదం చేస్తుంది పట్టాభిషేకం
జనరంజక పరిపాలనే శ్రేయస్కారం
ప్రతిపక్షం చూపాలి హుందాతనం
రాష్ట్ర సుభిక్షమే కావాలి కొలమానం
-వి. రమేష్ బాబు
కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వ పోకడలు వంటి తీవ్రమైన ఆరోపణల నడుమ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దేశంలో అగ్రభాగాన నిలిచింది. మళ్ళీ ఒకసారి దేశం తెలంగాణా ఎన్నికల ఫలితాల వైపు చూస్తున్నది, హైదరాబాద్ నగరం రాజధానిగా నిజామ్ జమానా నుంచే ధనిక రాష్ట్ర మైన తెలంగాణపై జాతీయ పార్టీల దృష్టి పడిరది. మునుపెన్నడూ లేని విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ బహిరంగ సభ మొదలు హైదరాబాద్ నడి వీధుల్లో రోడ్ షో వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరియు ఇతర ప్రముఖులు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సకల జనులకు అండగా ఉంటామని వోటరు దేవుళ్ళకు ఆపద మొక్కులు మొక్కారు. రాజకీయంగా నష్టం జరిగి..అధికారం కోల్పోయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఈ సారి ‘మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి..’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ‘రైతు డిక్లరేషన్ ‘తో మొదలై హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల రోడ్ షోలతో ఎన్నికల ప్రచారం ముగించారు. అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగారు. నిజామ్ ప్రైవేట్ సైన్యం రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటం మొదలు..మలి దశ ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణా మరోసారి ప్రయోగశాలగా మారింది. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగానా ..అనుకూలంగానా..ప్రజలు నేడు తీర్పు ఇవ్వనున్నారు…!