హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ సాధనలో దివంగత బిజెపి నేత సుష్మా స్వరాజ్ పాత్ర చిరస్మరణీయమని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎంపి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు చనిపోతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని, యాదిరెడ్డి దిల్లీలో పార్లమెంట్ పక్కకే చెట్టుకు ఉరేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, దిల్లీలో ఉన్న పెద్దలకు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, తల్లుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా అంటూ ఉత్తరం రాశారు.
ఇది చూసిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. గంబీర స్వరంతో పార్లమెంట్ లో మాట్లాడారు. తెలంగాణ బిడ్డల్లారా మీకు బీజేపీ అండగా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చి.. కుటుంబాలను ఓదార్చిన నాయకురాలు సుస్మాస్వరాజ్. ఆమె ఉద్యమసమయంలో తెలంగాణలో అనేక సభల్లో పాల్గొన్నారు. సిరిసిల్లతో పాటు అనేక మీటింగులకు వారితో కలిసి ప్రయాణం చేసి సభల్లో పాల్గొన్న చరిత్ర ఇప్పటికీ నా మదిలో ఉంది.
మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామని చెప్పిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. ఆనాడు బిఆర్‌ఎస్ ఉన్న ఎంపీలు రెండే.. అయినప్పటికీ మేము మీకు అండగా ఉన్నామని చెప్పారు. బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఆమెను ఎన్నటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు. ఆమె తెలంగాణ చిన్నమ్మ. సుస్మా స్వరాజ్ కి జోహార్లు అర్పిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు.