సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలను మరో లగచర్లగా చేయొద్దని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు వొద్దని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం దెబ్బతీస్తోందని, నర్సాపుర్ చెరువు కలుషితం అవుతోంది. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెబుతుంటే పట్టించుకోవడం లేదు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపాము.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తోంది.రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మాదిరిగ వ్యవహరిస్తున్నాడు. వందల మందిని పోలీసు స్టేషన్లలో పెడుతున్నాడు. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదు. గుమ్మడిదల రైతులు అందరికీ ఆదర్శం.బంగారం లాంటి పంటలు పండిస్తారు. తక్షణమే డంపింగ్ యార్డు రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వొచ్చాక లగచర్ల భూములను గుంజుకున్నాడు. . న్యాల్కల్ లో పచ్చటి పొలాలు గుంజుకునే రయత్నం చేశాడు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారు.
రుణ మాఫీ, రైతు బంధు, మహాలక్ష్మి, ఇలా అన్నీ మోసమే గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇక్కడి ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోవాలన్నారు. చేతిలో అధికారం ఉందని బలవంతంగా పని చేయడం సరికాదన్నారు. రెండు సార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని హరీష్ రావు హెచ్చరించారు.