విద్యార్థులే హంత‌కులు

– దోపిడీ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య
– బాబు అనే ఒక్క మాటతో వీడిన మిస్టరీ
– సోషల్ మీడియా ఆధారంగా పథక రచన 
– రూ.1.54 లక్షల నగదు, కత్తి, ఐఫోన్, సెల్‌ఫోన్లు, గ్లౌజులు, మాస్కులు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

దేవరకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 19: తీవ్ర సంచలనం సృష్టించిన దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. సుమారు 40 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ దర్యాప్తులో 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. బాబు అనే ఒక్క మాటతో మిస్టరీ ఛేదించారు. ఈనెల 11న‌ హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుండగా చివరిసారిగా బాబు అని పలికారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ ఒక్క మాటనే పోలీసులు కీలక ఆధారంగా తీసుకుని విచారణ ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా బాబు అని రూపారెడ్డి సంబోధించేవారని దర్యాప్తులో గుర్తించారు. దీంతో విచారణ విద్యార్థుల వైపు మళ్లింది. ప్రిన్సిపాల్ మృతికి సంతాపంగా పాఠశాలకు ఆరు రోజుల సెలవులు ప్రకటించడంతో విచారణలో కొంత ఆలస్యం జరిగినా పాఠశాల తిరిగి ప్రారంభమైన తర్వాత విద్యార్థులను సున్నితంగా విచారించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొందరు విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో ఐదుగురిపై అనుమానం వ్యక్తమవగా సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై అనుమానం బలపడింది. బుధ‌వారం ఉదయం సుమారు 11.30 గంటలకు మండల పరిధిలోని పెండ్లిపాకల, దొనియాల ఎక్స్ రోడ్ వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. స్కూల్ లో పదో తరగతి చదువుతున్న మండలంలోని ఫుల్ సింగ్ తండా, పిల్య తండాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి హత్యకు పథకం రచించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిద్ద‌రూ ఒకే హాస్టల్ గదిలో ఉంటూ జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారు. తల్లిదండ్రులకు తెలియకుండా సెల్‌ఫోన్లు వినియోగిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికేవారు. కొద్ది రోజుల క్రితం హాస్టల్‌లో డబ్బులతో పట్టుబడడంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆమెపై కక్ష పెంచుకున్నారు. రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి ఆధారాలు దొరకకుండా ఎలా హత్య చేయాలనే విషయంపై సోషల్ మీడియాలో సమాచారం సేకరించి పథకం రచించారు. హత్యకు వారం రోజుల ముందే రెక్కీ నిర్వహించి ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకువచ్చి కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని ఒకరు బయట నిఘా ఉంచగా మరొకరు వెనుక భాగం నుంచి వంట గది మార్గంగా లోపలికి ప్రవేశించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తర్వాత బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును అపహరించి వెనుక గోడ దూకి పరారయ్యారు. నేరంలో ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేసి బట్టలు మార్చుకుని హుడీని డ్రైనేజీలో పడేసినట్లు విచారణలో వెళ్లడైనట్లు తెలిపారు. రూ.1.54 లక్షల నగదు, హ‌తురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లు  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును విజయవంతంగా ఛేదించిన డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ ఎ.నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్‌ఐ ఎ.రమేష్, చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామ్మూర్తి, గుడిపల్లి ఎస్‌ఐ డి.నరసింహులు, గుర్రంపొడు ఎస్‌ఐ ఎన్.వెంకన్న, సీసీఎస్ ఎస్‌ఐ యు.సురేష్‌తోపాటు పలువురిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ నేరస్థులు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో కూడిన దర్యాప్తు ద్వారా నేరాలను ఛేదించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి చిన్న ఆధారాన్ని విశ్లేషిస్తూ పనిచేసిన పోలీసు బృందాల కృషి అభినందనీయమని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *