భారత్-యూరప్ నైపుణ్య భాగస్వామ్యం బలోపేతం

– నైపుణ్య ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
– కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో భారత్-యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యూరోపియన్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా-ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా టామ్‌కామ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం యూరప్‌లో విస్తృతస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, భారత్‌లో నైపుణ్యాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న యువశక్తి పెద్ద ఎత్తున ఉందని అన్నారు. భారత్ మానవ వనరులను నైపుణ్యంగా తయారు చేసే అవకాశం ఉండగా యూరోపియన్ దేశాలు శిక్షణ పొందిన నిపుణులను ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యువతను గ్లోబల్ కెరీర్లకు సిద్ధం చేసే దిశగా చర్యలు ప్రారంభించిందన్నారు. టామ్‌కామ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలపై మార్గనిర్దేశం చేయడంలో, శిక్షణ అందించడంలో కీలక సంస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. శిక్షణ పొందిన పలువురు యువత ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష సహా విదేశీ భాషల్లో శిక్షణ పొందిన వారికి యూరప్ దేశాల్లో భారీ డిమాండ్ ఉందన్నారు. అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలపై కూడా యువతకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని, సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే విదేశీ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగ విధానాలు మారుతున్నాయన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకున్న యువతకు అంతర్జాతీయ అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇటీవల జర్మనీ పర్యటన సందర్భంగా ఆరోగ్య, తయారీ, సాంకేతిక, సేవా రంగాల్లో నైపుణ్యం గల మానవ వనరులకు భారీ డిమాండ్ ఉన్నట్లు గమనించామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భాషా శిక్షణపై పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తూ యువతకు సురక్షితమైన, వృత్తిపరంగా మార్గనిర్దేశం చేసిన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదర్శ్ కుమార్ మెహ్రా, ఎలఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి, శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ, రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జె.స్నేహాజ, ఐసీడబ్ల్యూఏ జాయింట్ సెక్రటరీ అభిజిత్ చక్రబోర్తి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *