ఎంతో లోతైన సమాజ అనుశీలనతో తాను రాసిన 21 కథలను నిర్వాణ సంపుటిగా ప్రముఖ కథా రచయిత రామచంద్రమౌళి వెలువరించారు. తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించి రాసిన కథలివి. విస్తరించి ఉన్న సమాజంలో భిన్న మనస్తత్వాలు కలిగిన విభిన్న వ్యక్తుల జీవితాల్లోంచి పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా, అధ్యయనాత్మకంగా సాగిన సుదీర్ఘ అన్వేషణ నిగ్గు తేల్చిన విషయాలను ఈ కథల్లో రచయిత ఆవిష్కరించారు. భిన్న జీవన కోణాలను అతి దగ్గరగా గమనించే వీలును ఈ కథలు కల్పించాయి. స్వభావాలు, ప్రకోపాలు,ఉద్వేగాలు, వైఖరులు, విలక్షణతలు సంచలిత స్థితులు, అనుభూతులను అంచనా కట్టేందుకు ఈ కథలు ప్రయత్నించాయి. సామాజిక ప్రవర్తనను సంస్కారవంతంగా తీర్చుదిద్దుకోవలసిన ఆవశ్యకతను కూడా కథలు వెల్లడించాయి. విలక్షణత కోసం సాగిన రచయిత పరితపన ప్రతి కథలోనూ వ్యక్తమైంది.
తొలి కథ నిర్వాణ కాల నదిలో ఈదుతూ సాగే మనిషికి ఉన్న భౌతిక, భౌతికేతర జీవితాలను స్పర్శిస్తూ సాగింది. వర్తమాన సంక్లిష్ట భౌతిక జీవితంలోనే కనలి పోతున్న ఇప్పటి తరాన్ని ఒక భౌతికాతీత జీవితంలోకి నడిపించుకుపోవాలన్న కథా సూత్రం ఇందులో ఉంది. అర్థం కాని భౌతిక క్రీడగా జీవితం మారకూడదన్న సూచనలను అందించి మనిషిని తనను తాను తరచి తరచి తెలుసుకొమ్మన్నది ఈ కథ. భార్యను కోల్పోయిన డెబ్భై ఆరేండ్ల విశ్రాంత శాస్త్రవేత్త విశ్వనాథం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా, మౌనంగా, నిర్వికారంగా, మనో గంభీరత తో ఈ జీవితం ఏమిటి అన్న అంశంపై సాగించిన మానసిక మధనం నుంచి చివరకు చిలికిన అనంత జ్ఞానం వల్ల ముఖంపై మొలచిన చిన్మయమైన ఒక నవ్వుతో మరణించడంతో ఈ కథ ముగుస్తుంది. యామిని అన్న పాత్ర ఈ కథలో విశ్వనాథం జీవన వ్యధ ప్రత్యక్షంగా విని కంట కన్నీరు ఒలుకుతుంది. యోగిని కథ ముప్పైయేండ్ల తన్మయి శరీరాన్ని మనసును బుద్ధిని ఆత్మతో అనుసంధానపరిచి యోగ నిద్రలో కేంద్రీకృత భావనలను పొంది శక్తి స్వరూపిణిగా మేల్కొనడాన్ని గురించి చెప్పింది. అన్ని ప్రధాన ప్రజా రంగ వ్యవస్థలు కునారి ల్లిపోయి ఆందోళనకరంగా మారిన దేశ పరిస్థితిని తలచుకొని శిథిల హృదయంతో విశృంఖలత్వాలను దుయ్యబట్టి నిలేసిన కథ నీలి. నొప్పిని అనుభూతించగలిగినప్పుడే నువ్వు జీవించి ఉన్నట్టు లెక్క అన్న సందేశాన్ని రచయిత ఈ కథ ద్వారా దేశవాసులకు అందించారు. జారుడుబండ కథ జీవితం ఎంత బాధ మయమో చెబుతుంది. జలపాతంతో పాటు తాను కూడా జారుడు బండ పై నుండి జారిపడినట్టు భయోత్పాతమైన కలగన్న కోమల శేఖర్, డాక్టర్ రాజారావు,జాన్సన్, శైల వంటి పాత్రల మధ్య సాగి ఆసుపత్రి ఐసీయూ వార్డులో ఉండి మనుషుల జీవితాలు ఎవరికి వారివే ఐనా అవి స్వతంత్ర వ్యవస్థలా, సామూహిక సాపేక్షాలా అన్న సందేహంలో పడిపోతుంది.
నిశ్శబ్ద యుద్ధం కథ కరోనా విలయోత్పాత ప్రభావాలను కళ్ళకు కట్టింది. డాక్టర్ వత్సల పాత్రతో కరోనా కర్కశానికి ధైర్యమే మందు, నిశ్శబ్దంగా, నిశ్చలంగా పోరాడటమే ముందడుగు అన్న విషయం తెలుస్తుంది. లౌకికం, అలౌకికం, ఆభౌతికం, భౌతికేతరం,లోకం,లోకేతరం అన్న భిన్న పార్శ్వాల చుట్టూ సాగిన కథ మోహ విమోహం. స్త్రీ,పురుషుల మధ్య సంగతా సంగతమైన సంలీన సంవేదనలను తెలిపిన ఈ కథ జీవితాన్ని నిర్వహణ నైపుణ్యంతో నిర్మించుకొమ్మని సూచించింది. బ్రతికున్న మానవ ప్రపంచం ఏనాడు అనుభవించని అతి భయంకర సందర్భమైన కరోనా మిగిల్చిన పూడ్చలేని విషాదాన్ని శూన్యం కథ తెలిపింది. వస్తువే ఆత్మ, ప్రాణంగా సాగిన ఈ కథ సమూహంలో జీవిస్తూ కరోనా వల్ల అనివార్యమై ఒంటరిగా మిగిలి ప్రేమ లభించని శూన్య క్షణాల్లో దుఃఖాన్నే ఆప్తమిత్రునిగా భావించిన మనిషి దైన్యాన్ని ఎంతో స్పష్టంగా చూపింది. ఆలోచన ఒక అగ్ని మొలక అని,అది దహించడమే కాదు వెలుగునూ ఇస్తుందన్న సందేశంతో కొలిమి కథ సాగింది. ఎందుకో.. ఏమిటో.. తెలియదు అన్న కథలో చిన్మయి పాత్ర ప్రధానమైంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది అనిత్యం అన్న స్థితిని తెలిపి తెగిపోయేవి ఎప్పటికైనా బంధాలేనా అని ఈ కథ ప్రశ్నిస్తుంది. ఆత్మ అగ్ని… అది నిన్ను దహిస్తుంది అన్న కథ అనివార్యమై వచ్చే జీవన మార్పులు, కనిపించని మానవీయ కోణాలను వెల్లడించి పశ్చాత్తాపం ప్రక్షాళనా మార్గం కాదని, గాయపడ్డ ఆత్మ రక్త కన్నీరై జీవితాంతం మనిషిని దహిస్తూనే ఉంటుందని చెప్పింది.
ఒకటే జీవితం కథ మనిషికి ఎన్నో ప్రశ్నలని సంధించి జవాబు నీ వద్ద ఉందా అని నిలేసింది. భ్రాంతిని వీడితేనే జ్ఞానం అనుగ్రహింపబడుతుందన్న వాస్తవాన్ని తామ్రచంద్రునితో ఒక రాత్రి కథ తెలిపింది. సంక్షేమ పథకాలతో భారతదేశంలో సోమరిపోతు పౌరులను తయారు చేయవద్దని చెబుతూ బహుళ విధాల వ్యవస్థ పతనాలకు ప్రతిబింబంగా దీన్ని ఇకనైనా ఆపండి అన్న కథ నిలిచింది. కాటేసిన కర్కశ పరిస్థితులలో నలభైయేండ్లు దాటినా జీవన ప్రకాశమెరుగని ఉజ్వల కథను డాక్టర్ భూషణుడు పాత్రతో చెప్పించి అసలు ఏమిటి ఈ దారుణ సృష్టి అని ప్రశ్నిస్తారు. మనిషికి కూడా జంతువేనా అన్న ప్రశ్నతో జంతువు కథ మొదలై ఎన్నో అనర్థాలను చవిచూశాక మనలో ఏదైనా అజ్ఞాత జంతువు ఉందా అని ఆలోచించి అది క్రూరమైనదైతే తక్షణమే నిర్మూలించి సాత్వికతను పదిలంగా కాపాడమంటారు.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికో వచ్చి ఎక్కడో విగత జీవులుగా ముగిసిపోవడమే జీవితం కదా అన్న అంశాన్ని శంకరనారాయణ ప్రధాన పాత్రగా సాగిన కథ వీళ్ళు ఎవరు వెల్లడించింది. ఆత్మ అగ్ని లాంటిదని అది నిరంతర విచక్షణతో దహిస్తుందని ప్రొఫెసర్ శంకరి పాత్ర నేపథ్యంగా అల్లిన కథ గుహ లోతుగా ఆలోచింపజేస్తుంది. అమావాస్య చంద్రుడై సూర్యుని వెలుగులో వెలవెలబోయిన సైకాలజిస్ట్ డాక్టర్ చంద్రుడు ఉదంతాన్ని క్రీనీడ కథ వివరించింది. అధికాధిక స్థాయిలో పెరిగిపోతున్న వర్తమాన నిరర్థక మానవజాతి దుర్నీతిని ప్రశ్నిస్తూ నైతికతను బాధ్యతగా నిలిపిన కథ పొక్కిలి. చదువు ప్రాధాన్యతను నేలపై వినీలాకాశం కథ చెప్పింది. మృత్యువు, జీవితం అంటే ఏమిటో వివరించిన ఈ సంకలనంలోని చివరి కథ ఏమిటీ? అంటే… ఏమీ లేదు. భాషా పటిమ, వ్యక్తీకరణ, సమర్ధత, నవ్యత, శిల్పీకరణ ప్రతిభ,స్వీయ శైలి, వస్తు విశిష్టత, ప్రాయోగికత, పాత్రల సృష్టి, స్పష్టమైన ప్రయోజనాలతో ఈ కథలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విలక్షణత, విభిన్నతల సమ్మేళనంగా ఈ కథలున్నాయి. రచయిత అనుభవం, అనుభూతి లోంచి అంతరంగ ఉన్నతి పొంది ప్రస్ఫుట నిర్మాణంతో స్మృతి పధంలో చిరకాలం నిలిచేలా రూపొంది పాఠకులకు అందిన కథలివి.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764