మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిమాండ్
వరంగల్, ప్రజాతంత్ర, జూన్19: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. వరంగల్ లోని పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మురళి, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కొండా మురళి విూడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని హావిూ ఇచ్చారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్షగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో త్వరలోనే కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేస్తారని తెలిపారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. తమ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఉన్నారని మురళి పేర్కొన్నారు.