– డాక్టరు వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. బంద్‌పై ప్రజల స్పందన బీసీ సమాజం ఆవేదనను ప్రతిబిస్తోందన్నారు. చట్టబద్ధమైన విధానాలు పూర్తి చేసి హైకోర్టుకు తగిన వివరణ ఇవ్వాల్సిన సమయంలోనూ, తగిన నివేదికలు, ఆధారాలను సమర్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. న్యాయవ్యవస్థను తప్పుపట్టడం సముచితం కాదన్నారు. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు కాటం నర్సింహయాదవ్, బీసీ అధ్యయన వేదిక అధ్యక్షుడు ఎం.మారుతీ ప్రసాద్‌తో కలిసి ఖైరతాబాద్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ వకుళాభరణం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ సమాజం పట్ల అన్ని రాజకీయ శక్తులు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం రహస్య అజెండాతో అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లను కాపాడటంలో ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకోవాలని సూచించారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఇతరులపై నెపం వేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ ప్రజలు అలాంటి ఆటలను సహించరని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నగర ఇన్‌చార్జి టి.సి.శ్రవణ్ కుమార్, రుక్మిణి, రేణుక, మోహన్ గౌడ్, రమేష్, ఎన్.శ్రీనివాస్, కె.రఘు తదితరులతోపాటు భారీ ఎత్తున తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు వకుళాభరణం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





