ధాన్యం కొనుగోళ్లపై స్పెషల్ ఫోకస్
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ
రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు
సన్నాల పేరిట జరిగే గోల్మాల్ కు కట్టడి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లయిస్ ఎండీ డీఎస్ చౌహన్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా.. ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని అన్నారు.