డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని వారు విజ్ఞప్తి చేశారు. 2008లో వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జ్యోతిబాపూలే జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించారని, ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చి ప్రజాపాలన అందించడం శుభ పరిణామం అని తెలిపారు.
మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు కేటాయించాలని, హైదరాబాద్ లో మాలి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని కోరారు. గత అనేక సంవత్సరాలుగా మాలి కులస్తులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీకి సావిత్రి పూలే బాయి తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయాలని, ట్యాంక్ బండ్ పై పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.
సావిత్రి పూలే బాయి జన్మదిన జనవరి 3ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయమని అన్నారు. మాలి కులస్తుల జాతీయ అధ్యక్షుడు విలాస రావు పాటిల్, సావిత్రిబాయి పూలే వంశీయులు డాక్టర్ దిలీప్ గణపతి పాటిల్ బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు.