– ఆర్డినెన్స్ లకు గవర్నర్లు ఆమోదం తెలపాలి
– 50 శాతం అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదు
– అది అభిప్రాయం మాత్రమే
– జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు కీలక అడుగు అని, ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు.. సమానత్వం, ఆత్మగౌరవం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్సులకు గవర్నర్లు ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరమన్నారు. రిజర్వేషన్లు 50% దాటొద్దు అనేది సుప్రీం కోర్టు తీర్పు కాదని, 1931 బీసీ సెన్సస్, 1961 సెన్సస్, 1979 మండల్ కమిషన్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని అప్పటి పరిస్థితుల్లో కోర్టు ఆ అభిప్రాయం వ్యక్తం చేసిందని చెప్పారు. రిజర్వేషన్లు సవరించుకోవచ్చని మండల్ కమిషన్ రిపోర్టులోనే ఉందన్నారు. రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ సర్వే వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. బీసీలు ఐక్యంగా పోరాడి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించాలన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుండి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, మనుస్మృతి పేరుతో అణగారిన వర్గాలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలకు దూరం చేస్తున్నదని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టం చేసి పంపితే దాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదని, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యుఎస్ కింద రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% దాటొద్దు అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజల్లో ఐక్యత లేకుండా చేసేందుకు బీజేపీ–ఆర్ఎస్సెస్ కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ ప్రజలు సమాజంలో సమానత్వం కోరుకుంటారని, 42% బీసీ రిజర్వేషన్ల కోసం అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు 50% దాటొద్దు అనేది కోర్టు శిలాశాసనం కాదు అని స్పష్టం చేశారు. సామాజిక అసమానతలను నిర్మూలించడంలో రిజర్వేషన్లు కీలక సాధనమని, టీజేఎస్ పార్టీ ఏర్పడినదే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అని పేర్కొన్నారు. పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించారని విమర్శించారు. ఈనెలలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, జనవరిలో ఢిల్లీలో దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సదస్సులో టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి.. రాబోయే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలి.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ రీతిలో ఐక్య ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర పాలకులతో చర్చించాలి.. జిల్లా కేంద్రాల్లో రిజర్వేషన్ల అంశంపై సదస్సులు నిర్వహించాలి.. డిసెంబర్ లో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపట్టాలి.. అనేవి తీర్మానాల సారాంశం. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్ రావు, పల్లె వినయ్ కుమార్, నిజ్జన రమేష్, కాంతి మోహన్ రెడ్డి, యం.నర్సయ్య, లక్ష్మి, జశ్వంత్ కుమార్,అరుణ్ కుమార్, అంజనేయులు, ఇస్మాయిల్, రాజేంద్ర ప్రసాద్, షేక్ జావిద్,శ్రీనివాస్ ఆకుల,గట్ల రమాశంకర్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





