పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌ ఇరవైరెండు మంది బిసిలకు టికెట్లు ఇచ్చింది కాబట్టి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇప్పుడున్న పదిహేను మంది మంత్రుల్లో ఎనిమిదిమంది ఆధిపత్యకులాల వారే. బిసిలకు మూడు మంత్రిపదవులు ఇచ్చారు, అంటే, ఇరవైశాతం. పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం మాత్రం పార్టీపరంగా చెప్పుకోదగ్గది. వివాదాస్పదమైన కులగణన, ఆ తరువాత రాజకీయ రిజర్వేషన్ల తమాషా- పాలనావైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపునకు సాయపడ్డాయి. జాతీయస్థాయి నాయకత్వానికి కూడా అవి ఉపయోగపడడం రేవంత్‌ రెడ్డి అదృష్టం.”

k srinivas sannivesam article

మన రాజకీయాల్లో ఉండే అనేక డొల్లతనాలలో, సంకేతాత్మకత ఒకటి. వాస్తవ ఆచరణ లేని నినాదప్రాయమైన ఆదర్శాలను వల్లెవేసి, తాము ఏదో గొప్ప మార్పు తీసుకువస్తున్నామనే పరవంచనకు, ఆత్మవంచనకు రాజకీయపార్టీలు పాల్పడుతుంటాయి. తమ జీవితాలను మెరుగుపరచే ఆలోచనలు ప్రధానస్రవంతిలో వినిపించడమే మహద్భాగ్యమనుకుంటూ, ప్రజలు తమ ఆమోదాన్ని అమాయకంగా ఆ పార్టీలకు ధారాదత్తం చేస్తుంటాయి. మభ్యపెట్టి మారేడుకాయ చేయడమనే క్రీడలో ముప్పాతిక సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ అందరికంటె ఎక్కువగా ఆరితేరి కనిపిస్తుంది.

తమకు నలభైరెండు శాతం రాజకీయరిజర్వేషన్లను కల్పించే జీవో నెంబర్‌ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం మీద బిసి సంఘాలు, శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. జీవో తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధి మీద, స్టే ఇచ్చిన న్యాయవ్యవస్థ తీరు మీద, సామాజిక న్యాయానికి ఆధిపత్యకులాల నుంచి వస్తున్న వ్యతిరేకత మీద- రకరకాల స్థాయిలలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం రాజ్యాంగపరమైన, చట్టపరమైన సాంకేతికతలూ అని పైకి కనిపిస్తున్నప్పటికీ, అసలు కారణం రాజకీయ సంకల్పం లేకపోవడమే అన్నది స్పష్టం. మేము చేయాలనుకున్నాము, చేయలేకపోతున్నాము, మా చేతులు కట్టివేసి ఉన్నాయి, అని అమాయకపు మొహం పెట్టి సంజాయిషీ ఇస్తున్న రాజకీయనాయకులను నమ్మవలసిన పనిలేదు.

“ఆనాడు మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ, ఈ నాడు బిసిల చాంపియన్‌ గా చెప్పుకుంటున్నది. బిసిలకు అవసరమైన కీలకమైన సంస్కరణను చేపట్టిన జనతాదళ్‌కానీ, బిసి రాజకీయాలకు ప్రతినిధులుగా నిలిచిన పార్టీలు కానీ బలహీనపడడమో, ప్రాంతీయశక్తులుగా మిగిలిపోవడం కానీ జరిగిన నేపథ్యంలో, పాత లోహియావాద రాజకీయాల ప్రభావాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి బిజెపి, కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి. అధికార శూద్రకులాల వైఖరి కారణంగా, వ్యతిరేకత పెంచుకున్న అత్యంత వెనుకబడిన కులాలను తమకు అనుకూలంగా తిప్పుకోవడం, వేర్వేరు బిసికులాల మధ్య ఉన్నఅంతరాలను ఉపయోగించుకోవడం వంటి స్థానిక ఎత్తుగడలతో పాటు, హిందూత్వకు గట్టి పునాదిశ్రేణులుగా బిసిలను మలచుకోవడంలో బిజెపి విజయం సాధించింది. వరుస అపజయాలతో కునారిల్లిపోయి ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి ఈ సందర్భంలో దొరికిన ఒక ఆధారం- బిసిల కులగణన. జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు అన్న నినాదాలు! ఎక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో బిజెపి కూడా వచ్చే జనగణనలో కులాల లెక్కింపును కూడా చేర్చవలసి వచ్చింది.”

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ అంశం మీద కాంగ్రెస్‌పార్టీ అగ్రనాయకుడు పట్టింపుతో మాట్లాడుతున్నారో, ఏ విషయాన్ని బిహార్‌ ఎన్నికల ప్రచారం కోసం ప్రస్తావిస్తూ వచ్చారో, ఆ గొప్ప విషయం, దాని కార్యక్షేత్రంలోనే అభాసుపాలయింది. కులగణన చేసిన రాష్ట్రంగా తెలంగాణను రాహుల్‌ ఎంతో ఘనంగా చెబుతూ వచ్చారు. అగ్రకులానికి చెందినవారయినప్పటికీ, రేవంత్‌ రెడ్డి, తమ శ్రేణుల అధికారాన్ని తగ్గించే పని చేపట్టినందుకు ప్రశంసలు కురిపించారు. కులగణన ఫలితాల ఆధారంగా నిర్ణయానికి వచ్చామని చెబుతున్న తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ల గురించి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, బయట పల్లకిమోత సంగతేమిటో కానీ, ఇంట మాత్రం కులగణనకూ పెద్ద గుర్తింపు రాలేదు. రాజకీయ రిజర్వేషన్లూ అడుగుముందుకు పడలేదు.

తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతికిలపడ్డారు. కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌ ఇరవైరెండు మంది బిసిలకు టికెట్లు ఇచ్చింది కాబట్టి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇప్పుడున్న పదిహేను మంది మంత్రుల్లో ఎనిమిదిమంది ఆధిపత్యకులాల వారే. బిసిలకు మూడు మంత్రిపదవులు ఇచ్చారు, అంటే, ఇరవైశాతం. పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం మాత్రం పార్టీపరంగా చెప్పుకోదగ్గది. వివాదాస్పదమైన కులగణన, ఆ తరువాత రాజకీయ రిజర్వేషన్ల తమాషా- పాలనావైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపునకు సాయపడ్డాయి. జాతీయస్థాయి నాయకత్వానికి కూడా అవి ఉపయోగపడడం రేవంత్‌ రెడ్డి అదృష్టం.

జాతీయోద్యమకాలంలో ఏ సామాజికవర్గాలు ఎట్లా వ్యవహరించాయో, ఆ వైఖరులు స్వతంత్ర భారతంలో ఎటువంటి రాజకీయసమీకరణాలుగా పరిణమించాయో ఆసక్తికరమైన, విస్తారమైన చరిత్ర. 1952 అనంతర రాజకీయచరిత్రలో మాత్రం కాంగ్రెస్‌ ఆధిపత్యకులాలు, దళిత కులాలు, ముస్లిములు అన్న సమీకరణాన్ని కొనసాగించింది. దళితులు, ముస్లిములు పెద్దలతో ఇప్పటిలో పోటీకి వచ్చే వారు కాదు కాబట్టి, వారికి సంక్షేమాలు ఇచ్చి, అగ్రకుల భూస్వామ్య, సంపన్నుల ఆధిక్యాన్ని కొనసాగించవచ్చునన్నది ఆ సమీకరణంలోని సదుపాయం కావచ్చు. వేరు వేరు అస్తిత్వాలుగా ఉన్నశూద్ర కులాల వారు సమీకృతమయ్యే అవకాశం లేదన్న ధీమా కూడా ఆ పార్టీకి ఉండి ఉండవచ్చు. బిసి కులాల ఓట్లు కూడా తగినన్ని పొందుతూ కూడా, వారి అభ్యున్నతికి ప్రత్యేకమైన చర్యలేవీ తీసుకోకుండా, కలేకర్‌ కమీషన్‌ సిఫార్సులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరింపజేసి, పదిహేనుసంవత్సరాల పాటు నిరాఘాటమైన అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్‌ పార్టీకి మొదటి ఎదురుదెబ్బ ఆ సామాజిక శ్రేణుల రాజకీయ వ్యక్తీకరణ నుంచే తగిలింది. తమిళనాడులో ద్రవిడ పార్టీలు అధికారంలోకి రావడం కానీ, 1967లో ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఎదురైన అపజయం శూద్రకులాల పుణ్యమే. అయినా కాంగ్రెస్‌ గుణపాఠం తీసుకోలేదు. జనతాహయాంలో ఏర్పాటయిన మండల్‌ కమిషన్‌ తన నివేదికను 1980లోనే సమర్పించినా ఇందిరాగాంధీ కానీ, రాజీవ్‌ గాంధీ కానీ దాన్ని ఖాతరు చేయలేదు. జనతాదళ్‌ ప్రభుత్వం వచ్చాక వి పి సింగ్‌ హయాంలో నివేదిక అమలుకు నోచుకున్నది. ఆ సందర్భంలో రాజీవ్‌ గాంధీ ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో తెలిసిందే.

“అప్రియమైనప్పటికీ, బిసిల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకోసం ఉద్యమిస్తున్న సంఘాలు తమ వైపు ఉన్న పరిమితులను కూడా సమీక్షించుకోవాలి. రాజ్యాంగం మాటున, న్యాయవ్యవస్థ నిర్ణయాల మాటున దాక్కుంటున్న అన్ని ఆధిపత్య పార్టీల మీద తిరుగులేని రాజకీయ ఒత్తిడి తీసుకురావాలి. అసంఖ్యాక కులాలుగా చీలి ఉన్న బిసిలను ఏకతాటి మీదికి తేగలిగే ఉమ్మడి రాజకీయ నినాదాన్ని రూపొందించుకోవాలి. కొందరు నాయకులు, కొన్ని సంఘాలు తమకు ఆశ్రయమో, ప్రోత్సాహమో ఇస్తున్న పార్టీల ఎజెండాకు లోబడడం, సమష్టి ప్రయోజనాలకు విఘాతమని గుర్తించాలి. బలమైన ప్రజాస్వామిక ఉద్యమాలు మాత్రమే, న్యాయమైన ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయగలవు. అన్ని ప్రధాన పార్టీలూ అగ్రకుల ఆధిపత్య పార్టీలేనని గుర్తింపు కలిగితే, ఆ పార్టీల నాయకులే ఆ ఆధిపత్యాన్ని సంస్కరించగలరని ఆశించడం ఎంతటి అమాయకత్వమో అర్థం అవుతుంది.”

ఆనాడు మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ, ఈ నాడు బిసిల చాంపియన్‌ గా చెప్పుకుంటున్నది. బిసిలకు అవసరమైన కీలకమైన సంస్కరణను చేపట్టిన జనతాదళ్‌కానీ, బిసి రాజకీయాలకు ప్రతినిధులుగా నిలిచిన పార్టీలు కానీ బలహీనపడడమో, ప్రాంతీయశక్తులుగా మిగిలిపోవడం కానీ జరిగిన నేపథ్యంలో, పాత లోహియావాద రాజకీయాల ప్రభావాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి బిజెపి, కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి. అధికార శూద్రకులాల వైఖరి కారణంగా, వ్యతిరేకత పెంచుకున్న అత్యంత వెనుకబడిన కులాలను తమకు అనుకూలంగా తిప్పుకోవడం, వేర్వేరు బిసికులాల మధ్య ఉన్నఅంతరాలను ఉపయోగించుకోవడం వంటి స్థానిక ఎత్తుగడలతో పాటు, హిందూత్వకు గట్టి పునాదిశ్రేణులుగా బిసిలను మలచుకోవడంలో బిజెపి విజయం సాధించింది. వరుస అపజయాలతో కునారిల్లిపోయి ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి ఈ సందర్భంలో దొరికిన ఒక ఆధారం- బిసిల కులగణన. జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు అన్న నినాదాలు! ఎక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో బిజెపి కూడా వచ్చే జనగణనలో కులాల లెక్కింపును కూడా చేర్చవలసి వచ్చింది.

అలనాటి ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో శూద్రఅగ్రకులాల ప్రతినిధులే అధికారంలో ఉండడం ఒక ప్రత్యేక పరిస్థితిని తీసుకువచ్చింది. జాతీయోద్యమకాలంలో కాంగ్రెస్‌ లో నాయకత్వ స్థానంలో ఉన్న బ్రాహ్మణులు, అనంతర కాలంలో వెనుకపట్టు పట్టారు. వారికి, వారి స్థానంలో వచ్చిన రెడ్లకు ఉన్న పోటీ, వైమనస్యం కారణంగా, ఇతర శూద్రకులాలకు రాజకీయంగా కొంత స్థలం దొరికేది. శూద్రభూస్వామ్యశక్తుల ఆధిక్యానికి చెక్‌ పెట్టడానికి, పి.వి.నరసింహారావు భూసంస్కరణల మీద మొగ్గు చూపి, 1972 ఎన్నికలలో బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. పివి ప్రతిపాదనకు ఆ నాడు ఇందిర అంగీకరించడం విశేషం. తానే ప్రధానిగా, ఎఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1994లో కూడా పివి అభ్యర్థుల సామాజిక నిష్పత్తిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అగ్రనాయకుడు రాహుల్‌ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ రాష్ట్రాలలో అంతటి సుముఖత లేకపోవడం విషాదం. తెలంగాణ కులగణన చొరవను సొంతం చేసుకున్నారు కానీ, రాహుల్‌ గాంధీ కర్ణాటకలో మునుపు జరిగిన కులాల లెక్కింపును ప్రస్తావించడం లేదు. ఆ నాటి లెక్కలు కర్ణాటక ఆధిపత్యకులాలకు అసౌకర్యంగా ఉండడంతో, కొత్త కులగణనను సంకల్పించారు. తెలంగాణ కులగణన లెక్కల మీద కూడా అనేక అభ్యంతరాలు వెలువడ్డాయి. కెసిఆర్‌ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల గణాంకాలతో పోల్చి, బిసిల జనాభాలో తేడాలు ఉన్నాయని బిఆర్‌ఎస్‌ విమర్శించింది. అలాగని, తన చేతిలో ఉన్న లెక్కల ఆధారంగా సంస్కరణలకు ఆ పార్టీ కూడా ప్రయత్నించింది లేదు. బిసిల పార్టీగా పేరుతెచ్చుకున్న తెలుగుదేశం హయాంలో కూడా శాసనసభలో ప్రాతినిధ్యం పెద్దగా పెరిగింది లేదు.

ఇంతకాలం బిసిల సమస్యను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తపం ప్రకటించిన రాహుల్‌ గాంధీ ఆ మాటలు మనస్ఫూర్తిగానే అని ఉండవచ్చు. కానీ, ఆయన పార్టీలో పెద్దకులాల పట్టు ఆయన కంటె బలమైనది. నిచ్చెనమెట్ల సామాజిక నిర్మాణంలో మార్పులు తేవడం కాగితాల మీద తెచ్చే సంస్కరణో, ఎన్నికల నినాదాల ద్వారా సాధ్యమయ్యేదో కాదు. అటువంటి సంస్కరణల ప్రతిపాదనలకు వ్యతిరేకత వ్యవస్థాత్మకంగా ఉంటుంది. రాజకీయపార్టీల వారీగా ఉండదు. కాంగ్రెస్‌ లాగా బీసీలకు అధికసీట్లు అన్న నినాదాన్ని బలంగా ముందుకు తేలేదు కాబట్టి, బిఆర్‌ఎస్‌ను గట్టిగా నిలదీయలేము కానీ, ఆ పార్టీ కూడా పెద్దసంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టాలనుకోలేదు. ప్రతిపక్షంగా ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నప్పటికీ, బిసిల సాధికారతను పెంచడానికి ఆ పార్టీలోనూ గట్టి విముఖతే ఉన్నది. ఈ పార్టీలన్నీ నిజంగా తాము చెబుతున్నదాన్నే నమ్ముతున్నట్టయితే, జీవోలు, రాజ్యాంగసవరణలతో నిమిత్తం లేకుండా, బిసిలకు న్యాయమైన అభ్యర్థిత్వాలను ఇవ్వవచ్చు. ఈ విషయంలో సకలపక్షాలూ సమావేశమై తామే బిసిల స్థానాలను గుర్తించి, బిసిలనే అభ్యర్థులుగా పోటీకి పెట్టవచ్చు. అదొక నిబంధనగా మారితే తప్ప, తాము తగినన్ని స్థానాల్లో బిసిలను నిలబెట్టలేమని చెప్పడం అంటే, ఉనికిలో ఉన్న ఆధిపత్య నిర్మాణాన్ని కొనసాగించడమే.

అప్రియమైనప్పటికీ, బిసిల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకోసం ఉద్యమిస్తున్న సంఘాలు తమ వైపు ఉన్న పరిమితులను కూడా సమీక్షించుకోవాలి. రాజ్యాంగం మాటున, న్యాయవ్యవస్థ నిర్ణయాల మాటున దాక్కుంటున్న అన్ని ఆధిపత్య పార్టీల మీద తిరుగులేని రాజకీయ ఒత్తిడి తీసుకురావాలి. అసంఖ్యాక కులాలుగా చీలి ఉన్న బిసిలను ఏకతాటి మీదికి తేగలిగే ఉమ్మడి రాజకీయ నినాదాన్ని రూపొందించుకోవాలి. కొందరు నాయకులు, కొన్ని సంఘాలు తమకు ఆశ్రయమో, ప్రోత్సాహమో ఇస్తున్న పార్టీల ఎజెండాకు లోబడడం, సమష్టి ప్రయోజనాలకు విఘాతమని గుర్తించాలి. బలమైన ప్రజాస్వామిక ఉద్యమాలు మాత్రమే, న్యాయమైన ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయగలవు. అన్ని ప్రధాన పార్టీలూ అగ్రకుల ఆధిపత్య పార్టీలేనని గుర్తింపు కలిగితే, ఆ పార్టీల నాయకులే ఆ ఆధిపత్యాన్ని సంస్కరించగలరని ఆశించడం ఎంతటి అమాయకత్వమో అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *