‘స్మార్టు’ పథకానికి మరోసారి గడువు పొడిగింపు

– ఫలించిన ఎంపీ డాక్టర్‌ కావ్య కృషి

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: గ్రేటర్‌ వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పథకం గడువు పొడిగింపులో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య కృషి ఫలించింది. మరోసారి గడువు పొడిగించాలంటూ జులై 31వ తేదిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమె కేంద్రాన్ని కోరారు. ఈమేరకు పనులు పూర్తిచేయడానికి కొత్తగా డిసెంబర్‌ 31 వరకు కేంద్రం సమయం ఇచ్చింది. గతంలో సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కావ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో మార్చి 2025 వరకు కేంద్రం గడువు పొడిగించింది. ఇప్పటికే పలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, పబ్లిక్‌ సౌకర్యాల భవనాలు, సరస్సుల అభివృద్ధి వంటి పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తికావడానికి మరికొంత సమయం అవసరమని ఎంపీ కడియం కావ్య జూలై 31న పార్లమెంట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు విన్నవించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం పెద్ద వడ్డేపల్లి చెరువు సుందరీకరణ నిలిచిపోయింది. ఈ పనుల్లో గ్రీనరీ, లైటింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, పాత్‌ వే, వాకింగ్‌ ట్రాక్‌, స్వాగత తోరణాల ఏర్పాటు ఉన్నాయి. హనుమకొండలోని పద్మాక్షిగుట్ట, ఎన్జీవోస్‌ కాలనీలలో సెంట్రల్‌ లైటింగ్‌, గ్రీనరీ పనులు, అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తి చేయాల్సి ఉంది. వరంగల్‌లోని పోతన రోడ్డు, పాపయ్యపేటలలో నిలిచిపోయిన స్టోర్మ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ కీలకమైన ప్రాజెక్టులో సుమారు రూ.12 కోట్ల విలువైన గ్రీనరీ పనులు, పోతన రోడ్డులో స్వాగత తోరణం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉందని ఎంపీ తెలిపారు. కరీమాబాద్‌ దసరా రోడ్డు, రంగశాయిపేట-ఉర్సు, కరీమాబాద్‌లలో స్మార్ట్‌ రోడ్ల కింద పాత్‌ వేలు, లైటింగ్‌, గ్రీనరీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షలు నిర్వహించి వేగవంతం చేయాలని ఎంపీ కావ్య సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page