– స్లాట్‌తో పెరిగిన రిజిస్ట్రేషన్లు
– రిజిస్ట్రేషన్ సేవల్లో ఎఐతో వాట్సప్ చాట్‌బాట్
– అన్నివివరాలు చాట్‌బాట్ ద్వారా అందుబాటులో
– ఈవిధానంతో సమయం ఆదా
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1: రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఎఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు సులువుగా మరింత సమర్ధవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా, ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేశామన్నారు. తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని, 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, మనోభీష్టం మేరకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తున్నదన్నారు.
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ ( ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ -ఎఐ) అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ – మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నూతన ప్రక్రియ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయని అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబాటు వంటి సమాచారం లభిస్తుందన్నారు. గిప్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఎఐ చాట్‌బాట్ – మేధ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అక్రమాలకు చెక్ పెట్టేలా లే అవుట్‌లలో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా, రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు బిల్డర్ లేదా డెవలపర్ దగ్గర వివరాలు ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలో తీసుకువస్తామని లిపారు. ఈ మ్యాడుల్ లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయి.
స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో పని భారం అధికంగా ఉన్న పఠాన్‌చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, ఇబ్రహీం పట్నం , సూర్యాపేట, జడ్చర్ల ,మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమించామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి లంచ్ సమయాన్ని మినహాయించి సాయింత్రం 5 గంటల వరకూ స్లాట్ బుక్ చేసుకోవచ్చునని ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్‌లు బుక్ అవుతాయన్నారు.స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపధ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్లాట్ బుకింగ్‌తోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్-ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మక అమలు చేస్తున్నామని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.