– ధాన్యం కోనే దిక్కుల లేకుండా పోయింది
– బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం
– ఒక్కరు కూడా ఎదిరించి మాట్లాడలేకపోయారు
– బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగం సృష్టించేవారు
– పార్టీ ఆవిర్భావ వేడుకలో అధినేత కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదని విమర్శించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియా గాంధీ ఎన్నోసార్లు చెప్పారని, కానీ తాను రాజీ పడలేదని, అది తన చిత్తశుద్ధి అని కేసీఆర్ అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసీఆర్ మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరుచేసినట్టు అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేశారంటూ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఉన్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం అభ్యంతరం తెలుపకుండా మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మన ఎంపీలు ఉండి ఉంటే తేజస్వి సూర్య మాటలకు రణరంగం చేసేవాళ్లు అని పార్టీ అంతర్గత సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంపై రాజ్యసభలో సీఆర్ పాటిల్ మాట్లాడితే సురేశ్‌రెడ్డి గట్టిగా ఖండించారంటూ అభినందించారు. ఈ 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా.. వాళ్లకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాల్లో నంబర్ వన్, కూలగొట్టడంలో నంబర్ వన్‌గా నిలబట్టే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతకానితనంతో ఉన్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుందని అన్నారు. చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తున్నదన్నారు. సమావేశంలో జీవన్ రెడ్డిని బీఆరఎస్ కార్యవర్గానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రకటించారు.
అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తవి నియమించాలి
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్రస్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు పక్రియను వెంటనే ప్రారంభించాలని, బుక్ మీదనే కాక ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





