ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుపుతున్న ఉచిత ప్రమాద బీమా పథకం ప్రభుత్వరంగ సంస్థలకేగాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకం అనుకోని ప్రమాదంలో కార్మికుడు మృతిచెందినట్లయితే అతని కుటుంబం వీధిన పడకుండా ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ఇటీవల ఓ ప్రమాదంలో రామగుండం-1 ఏరియాకు చెందిన సపోర్టు మెన్ పెండ్రి రంజిత్ కుమార్ మృతిచెందగా రూ.1.20 కోట్ల బీమా సొమ్ము చెక్కును ఉప ముఖ్యమంత్రి ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో శనివారం అతని భార్య లతకు అందజేశారు. మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు ఈ ప్రమాద బీమా మంజూరైంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మృతుని కుటుంబానికి త్వరలో కారుణ్య నియామక పత్రాలు అందచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, రెడ్కో వైస్ ఛైర్మన్, ఎండీ ఆనీలా, ఎస్‌బీఐ డీజీఎం నీలాక్షి సింగ్, రీజనల్ మేనేజర్ సురేష్ కుమార్, కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌డిఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.