- వ్యర్థం నుంచి అర్థం వచ్చేలా సిద్ధిపేట ఆలోచన
- స్వచ్ఛ సర్వేక్షణ్-21లో ప్రజలు భాగస్వామ్యం కావాలి
- సిద్ధిపేట దేశంలో అగ్రభాగంలో నిలపాలి
- కొత్త వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- 14, 28వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
వ్యర్థం నుంచి అర్థం వచ్చేలా సిద్ధిపేట మునిసిపాలిటీ ఆలోచన చేస్తున్నదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-21లో ప్రజలు భాగస్వామ్యులై సిద్ధిపేట మునిసిపాలిటీని దేశంలోనే అగ్రభాగంలో నిలపాలన్నారు. దేశ వ్యాప్తంగా అన్నీ మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా పట్టణ ప్రజలంతా విధిగా ఫీడ్ బ్యాక్ ఇచ్చి, దేశంలోనే సిద్ధిపేట మునిసిపాలిటీని ఆదర్శంగా చాటి చెప్పాలని పట్టణ ప్రజలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్ధిపేట మునిసిపాలిటీ పరిధిలోని 14వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలోని హరిప్రియనగర్లో సిసి రోడ్ల పునరుద్ధరణ, సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం 28వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. వ్యర్థం నుంచి అర్థం వచ్చేలా సిద్ధిపేట మునిసిపాలిటీ ఆలోచన చేస్తున్నదని, తడి చెత్త నుంచి గ్యాస్, పొడి చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుక తయారీ చేస్తున్నట్లు వివరిస్తూ… ఇండ్లు శుభ్రంగా ఉన్నట్లే.. గల్లీ, పట్టణం శుభ్రంగా పెట్టుకుందామని ప్రజలను మంత్రి కోరారు. రూ.30 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణాలు చేసుకుంటున్నామని తెలిపారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, యూజీడీతో మోరీలు ఎండిపోయి, కేవలం వర్షపు నీరు మాత్రమే మోరీల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని, యూజీడీ నిర్మాణ పక్రియలో భాగంగా రోడ్లు చెడిపోతాయని, ఆలస్యమైనా పదేళ్ల కాలం శాశ్వతంగా సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీతారాంనగర్, లెక్చరర్ కాలనీల్లో రూ.20 లక్షలతో సిసి రోడ్లకు వారం, 10 రోజుల్లో వేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. సిద్ధిపేటను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే వరంగల్-సిద్ధిపేట-మెదక్ జాతీయ రహదారి చేయబోతున్నట్లు తెలిపారు.
స్వచ్ఛ సిద్ధిపేట కావాలని, తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా ఇచ్చి శుభ్రమైన శుద్దిపేటగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ ధర కంటే తక్కువ ధరకే స్టీల్ బ్యాంకు పెట్టి ప్లాస్టిక్ రహిత సిద్ధిపేట కోసం ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పారదర్శకంగా చేపట్టాలన్నారు. సిఎం కేసీఆర్ మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేశారని, మరో ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. సిద్ధిపేట పట్టణ ప్రజలు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత యాప్‌లో గ్రీవెన్స్‌లో వెళ్లి మీ ఫిర్యాదులు ఇవ్వాలని, పట్టణానికి చెందిన ప్రతి పౌరుడు దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం మునిసిపాలిటీ పట్టణాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ వోటింగ్‌లో పాల్గొని సిద్ధిపేట పట్టణ పేరును ఇనుమడింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్ దూది శ్రీకాంత్‌రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.