మహానగరం మ‌ధ్య‌న‌ పేదోడికి ఇల్లు ఉండొద్దా?

– పదేళ్లు చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విష ప్రచారమా?
– ఇండ్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
– ఇండ్ల కోసం ‘మీ సేవ వాట్సాప’, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని చూసి బీఆర్‌ఎస్ నాయకత్వం తీవ్ర అసహనానికి గురవుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే వారి సొంతింటి కలను నెరవేర్చడానికి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వీటి కోసం స్ధానికంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, మీసేవ వాట్సాప్ నెంబరు 8096958096, వెబ్‌సైట్ (ఎవవsవఙa.tవశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ) ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో గురువారం సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో వారు చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాలతో రాజకీయ లబ్దిపొందాలని బీఆర్ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు. నగరంలోనే పుట్టి పెరిగి అక్కడే జీవిస్తున్న నిరుపేద కుటుంబాలకు నగర నడిబొడ్డులో సొంతింటిని సమకూర్చాల్సిన బాధ్యతను గ‌త‌ ప్రభుత్వం విస్మరించి వారిని నగరానికి దూరంగా నెట్టివేసిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువులు, వైద్య సౌకర్యాలకు 30-40 కి.మీ దూరంలో కనీస వసతులు కల్పించకుండా అరకొరగా ఇళ్లను నిర్మించి అదే పేదల సంక్షేమమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజా ప్రభుత్వం పేదోడు కూడా హైదరాబాద్ నడిబొడ్డులో గౌరవంగా జీవించాలనే భావనతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తూ పేదలకు శాశ్వత భరోసా కల్పించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే దానిపైనా విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములలో పేదలకు ఇళ్లు నిర్మించకూడదా.. ప్రభుత్వ భూములు కొద్దిమంది కోసం మాత్రమేనా.. పేదల కోసం వినియోగిస్తే ఎందుకింత కడుపుమంట అని ప్రశ్నించారు. పేదోడిపై తుపాకి పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. బీఆరఎస్ విష ప్రచారాలను, కపట నాటకాలను మహానగర ప్రజలు గమనించాలని, పేదల సంక్షేమాన్ని అడ్డుకునే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

గతంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇందిరమ్మ టవర్స్‌గా మార్చి విక్రయిస్తారన్న ప్రచారం అవాస్తవమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారమే ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, లబ్దిదారుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఇది అమ్మకం కాదు.. ప్రభుత్వ ఆర్థిక సహకారం. లబ్దిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే. ఫ్లాట్ల మార్కెట్ విలువ తొలి విడతలో ప్రారంభించనున్న 16 నియోజకవర్గాల్లో రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉందన్నారు. ఎసఆర్‌వో(బేసిక్) విలువ రూ.14.6 లక్షల నుంచి రూ.28.4 లక్షల వరకు ఉందని చెప్పారు. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీ, భూమి విలువ, నిర్మాణ వ్యయాన్ని కలిపి పేదలకు అత్యంత తక్కువ ధరలో గృహాలను అందించే అవకాశం కల్పిస్తోందన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇళ్లలో యాజమాన్య హక్కులకు సంబంధించి ఎస్సీలకు 14, ఎస్టీలకు 5, బీసీలకు 16, దివ్యాంగులకు 5, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తున్నామని వివరించారు. ఇందులోనూ 30 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని, మిగతా 50 శాతం జనరల్ కేటగిరీలో కేటాయిస్తామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలపై బీఆరఎస్‌కు, ఆ పార్టీలోని దొరలకు ఏ మాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా విష ప్రచారాన్ని మానుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఈ విష ప్రచారాన్ని కొనసాగిస్తే జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పట్టిన గతే రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *