పంట అమ్ముకోవ‌డానికి రైతులు యుద్ధం చేయాలా? బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు సూటి ప్ర‌శ్న‌

 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం.
ధాన్యం కొనుగోలు క‌ష్ట‌మే…త‌ర‌లింపు జాప్యమే
వ‌డ‌దెబ్బ‌కు రైతులు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం
ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు
అందాల రాశుల చుట్టూ తిర‌గ‌డం త‌ప్ప చేసేదేం లేదు
ముఖ్య‌మంత్రిపై హ‌రీష్‌రావు సెటైర్లు

దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.  మ‌రోప‌క్క రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు. కానీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కి ఇవేవి పట్టడం లేదు .అందాల పోటీల్లో బిజీ గా ఉన్నారు. ధాన్యపు రాశుల చుట్టూ తిరగాల్సిన వారు అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆయ‌న మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.  సన్న వడ్లకు చెల్లించాల్సిన బోన‌స్ ఊసేలేదు. యాసంగి పంట‌కు .512 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది. కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో  నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంత‌వ‌ర‌కు కొనుగోలు చేయ‌లేదు. స‌మ‌స్య‌లు ఇట్లా వున్న‌ప్ప‌టికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల నిర్వ‌హ‌ణ‌లో బిజీగా వుండ‌టం విచిత్రం. వీటిపై రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ లను, ప్రభుత్వాధికారులు కూడా ఈ పోటీల నిర్వ‌హ‌ణ‌లోనే త‌ల‌మున‌క‌లుగా వున్నారు. ఈ పోటీల‌కోసం ఇంత‌టి స‌మ‌యాన్ని వెచ్చిస్తున్న ముఖ్య‌మంత్రికి రైతుల క‌ష్టం తీర్చ‌డానికి తీరిక వుండ‌క‌పో వ‌డం దురదృష్ట‌క‌రం. ప‌రిస్థితి చూస్తుంటే ఈ ప్ర‌భుత్వానికి  రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్న‌ద‌న్నారు.

ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నద‌ని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న‌ద‌న్నారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేద‌ని గుర్తుచేశారు. కొన్న వడ్లకు రూ.4 వేల కోట్లు బకాయి పడింద‌న్నారు.  48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్బాలు ప‌లికారు, మ‌రి ఇప్పుడేమంటార‌ని ప్ర‌శ్నించారు.
పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు ఇచ్చే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి రైతులు దైన్యంగా ఎదురుచూస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు ర‌వాణా కాలేద‌న్నారు. పెట్టుబడి సహాయం అందించడంలో విప‌రీతంగా జ‌ప్యం జ‌రుగుతోంద‌న్నారు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిర్రు. యాసంగి రైతుబంధు మూడెకరాలకు మించి వేయలేదు. పెట్టుబడి సాయం కోసం రూ.18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని సంవత్సరమంతా మెల్లగా ఇస్తామని  భట్టి గారంటున్నారు. ఇంకెప్పు డు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సహాయం ఇంకా వెయ్యలేదు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చే రూ.10వేల కంటే ఎక్కువ మొత్తం రూ.15,000 ఇస్తామ‌న్నారు. అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారు.కానీ ఇప్పుడేమో ఓడ దాటాక బోడ మల్లన్న అన్న విధంగా వ్యవహరిస్తున్నార‌న్నారు. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో ఇంత జాప్య‌మా అంటూ ప్ర‌శ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.
ఇన్ని తిప్ప‌లు ప‌డి  ధాన్యాన్నిఅమ్ముకుంటే దాన్ని తరలించడంలో ఇంత జాప్యం చేయ‌డం అర్థం లేద‌న్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా వెంట‌నే వేయ‌డంలేద‌న్నారు.
గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం, ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం,కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యం…ఇన్నిర‌కాల వైఫ‌ల్యాల‌తో ప్ర‌భుత్వ పాల‌న న‌డుస్తున్న‌దంటూ విమ‌ర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page