మాట్లాడుకోండి – మౌనంగా ఉండకండి!

సెక్స్ అనేది శారీరకమే కాదు – మానసిక స్థితి కూడా…..

ఆధునిక జీవన విధానంలో సెక్సు పట్ల సరైన అవగాహన లేని యువత పెరుగుతోంది. ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన లైంగిక విద్యపై అవగాహన ఉండకపోవచ్చు. ప్రస్తుత కాలంలో భార్య, భర్తల మధ్య స్పర్శ, మాటా ముచ్చటకు, శృంగారమునకు నోచుకోని కుటుంబాల సంఖ్య నానాటికి పెరిగిపొతున్నాయి. ఆ మధురానుభూతిని, ప్రేమాను రాగాలను, అప్యాయతను పొందలేక మానసిక సమస్యలతో జీవితాన్ని పాడు చేసుకొంటున్నారు. భయాలు, ఆందోళనలు, కుటుంబ ఒత్తిళ్ళు ఆర్థిక కష్టాలు, లైంగిక విద్య పై అవగాహన లేక కుటుంబ జీవితాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మానసిక లైంగిక రుగ్మతలు (సైకో సెక్సువల్ డిజార్డర్స్): మానసిక స్థితి మరియు లైంగిక ఆరోగ్యం మధ్య సన్నిహిత సంబంధం ఉంది. సైకో సెక్సువల్ డిజార్డర్స్ అనేవి మానసిక, భావోద్వేగ లేదా సామాజిక కారణాల వల్ల లైంగిక సామర్థ్యంలో ఏర్పడే సమస్యలు.

 

1. లైంగిక కోరికలలో లోపాలు (సెక్సువల్ డిజైర్ డిజార్డర్స్)

హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్

హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ అనేది లైంగిక కోరికలు లోపించడం లేదా తగ్గిపోవడం వల్ల వ్యక్తి లేదా దాంపత్య జీవితం పై ప్రతికూలం ప్రభావం ఏర్పడుతుంది. ఇది డిప్రెషన్, ఒత్తిడి, హార్మోనల్ మార్పుల వల్ల మెనోపాజ్, టెస్టోస్టెరాన్ తగ్గడం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల ఏర్పడవచ్చు. హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ వల్ల లైంగిక క్రియలపట్ల ఆసక్తి లేకపోవడం, సంభోగం గురించి ఆలోచించకపోవడం మరియు భాగస్వామితో సన్నిహితత కోల్పోవడం జరుగుతుంది.

 

సెక్సువల్ ఎవర్షన్ డిజార్డర్

సెక్సువల్ ఎవర్షన్ డిజార్డర్ అనేది లైంగిక చర్యల పట్ల తీవ్రమైన భయం, అసహనం లేదా వైరుధ్యం కలిగించే మానసిక రుగ్మత, ఇది శారీరక సంపర్కాన్ని అసాధ్యం చేస్తుంది. ఇది ప్రధానంగా బాల్యంలో అనుభవించిన లైంగిక దాడి వంటి ట్రామా లేదా భాగస్వామి పై నమ్మకం సన్నగిల్లడం వంటి మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. లక్షణాలలో లైంగిక సంపర్కం గురించి ఆలోచించినప్పుడు భయం లేదా అనాసక్తి కలగడం, శారీరక స్పర్శకు ప్రతికూలంగా ప్రతిస్పందించడం, హృదయ స్పందన వేగవంతం కావడం మరియు చెమటలు వస్తాయి.

2. ఉత్తేజన సమస్యలు (ఎరౌజల్ డిజార్డర్)

ఎరెక్టైల్ డిస్ఫంక్షన్

ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పురుషులలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంగం సరిగ్గా కామోద్దీపన చెందకపోవడం లేదా సంభోగం పూర్తిగా జరిగేంత వరకు దాన్ని నిర్వహించలేకపోవడం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు, మధుమేహం, హార్మోన్ లోపాలు, ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, మద్యపానం వల్ల ఏర్పడవచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క లక్షణాలలో అంగంలో తగినంత గట్టిదనం లేకపోవడం, ఎరెక్షన్ కొనసాగించలేకపోవడం మరియు లైంగిక క్రియలపట్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఉంటాయి.

సెక్సువల్ అరౌజల్ డిజార్డర్

 

స్త్రీలలో సెక్సువల్ అరౌజల్ డిజార్డర్ అనేది లైంగిక క్రియల సమయంలో యోనిలో తగినంత రక్తప్రవాహం మరియు తేమ లేకపోవడం వల్ల కలిగే సమస్య. ఇది హార్మోన్ మార్పులు మెనోపాజ్, ప్రసవాంతర మార్పులు, మానసిక కారణాలు ట్రామా, సంబంధ సమస్యలు, ప్రతికూల ఆలోచనలు దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల సంభవిస్తుంది.

3. ఆర్గాజం సమస్యలు

ఆర్గాజం సమస్యలు అనేవి మహిళలు మరియు పురుషుల్లో లైంగిక అనుభవంలో మానసిక, శారీరక, సామాజిక కారకాల వల్ల తలెత్తే అవరోధాలు. ఇందులో ముఖ్యంగా అనార్గాస్మియా (ఆర్గాజం పొందలేకపోవడం) మరియు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ (అతి త్వరగా వీర్యస్కలనం) ప్రధానమైనవిగా గుర్తించబడతాయి.

అనార్గాస్మియా

అనార్గాస్మియా సమస్య డిప్రెషన్, లైంగిక దాడి, హార్మోన్ లోపాలు, నరాల సమస్యలు వంటి కారకాల వల్ల కలుగుతుంది. దీనిలో భాగంగా వ్యక్తి శారీరక ఉత్తేజన ఉన్నప్పటికీ ఆర్గాజం పొందలేకపోతారు, లేదా చాలా సమయం పడుతుంది.

ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్

 

ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది లైంగిక చర్య ప్రారంభించిన వెంటనే వీర్యస్కలనం కావడం వల్ల జరిగే సమస్య. ఇది వ్యక్తి మరియు కపుల్ మధ్య లైంగిక సంతృప్తిని తగ్గిస్తుంది. దీని వెనుక మానసిక ఒత్తిడి, అనుభవం లోపం, లేదా థైరాయిడ్, ప్రోస్టేట్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. లక్షణాల్లో వీర్యస్కలనాన్ని నియంత్రించలేకపోవడం, సంతృప్తి లేకపోవడం ఉంటాయి.

4. లైంగిక సమయంలో నొప్పి (సెక్సువల్ పెయిన్ డిజార్డర్స్)

లైంగిక సమయంలో నొప్పి అనుభవించడం అనేది మహిళలు మరియు పురుషుల్లో కనిపించే సాధారణమైన కానీ మానసిక మరియు శారీరకంగా బాధ కలిగించే సమస్య. ఇందులో ప్రధానంగా డిస్పేర్యూనియా (లైంగిక చర్య సమయంలో నొప్పి) మరియు వజినిస్మస్ (యోని చుట్టూ డ్రై నెస్ నరాల సంకోచం వల్ల ప్రవేశం అసాధ్యం) రెండు ముఖ్యమైన రుగ్మతలు ఉన్నాయి.

డిస్పేర్యూనియా

డిస్పేర్యూనియాలో స్త్రీలు యోని ఇన్ఫెక్షన్లు, హార్మోనల్ లోపాలు, లేదా ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యల వల్ల బాధపడతారు; పురుషులలో ప్రోస్టేట్ సంబంధిత ఇన్ఫెక్షన్లు లేదా ఫిమోసిస్ కారణమవుతాయి. లక్షణాల్లో మంట, కుట్టుడు నొప్పి, రక్తస్రావం, లైంగిక భయం కనిపిస్తాయి.

వజినిస్మస్

వజినిస్మస్ అనేది మానసిక మరియు శారీరక కారకాల వలన యోనిలోకి ఏదైనా ప్రవేశించేటప్పుడు తీవ్ర నొప్పిని కలిగించే స్థితి. ఇది సాధారణంగా లైంగిక దుర్వినియోగం, లైంగికతపై అపోహలు వంటి మానసిక కారణాలతో వస్తుంది. కొన్ని సార్లు శారీరక సమస్యల వల్ల కూడా ఏర్పడుతుంది. వజినిస్మస్ ఉన్నవారు టాంపోన్ వాడకానికి లేదా వైద్య పరీక్షలకు భయపడతారు. ఈ సమస్యలు 90% మందిలో 3-6 నెలల చికిత్సతో పూర్తిగా నయమవుతాయి. సమయానికి నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం.

5. అసాధారణ లైంగిక ప్రవృత్తులు (పారాఫిలిక్ డిజార్డర్స్)

అసాధారణ లైంగిక ప్రవృత్తులు అనేవి సాధారణ లైంగిక ఆకర్షణలకు భిన్నంగా, నిషేధితమైన లేదా హానికరమైన వస్తువులు, చర్యలు లేదా వ్యక్తులపై లైంగిక ఆసక్తిని కలిగిస్తాయి. ఇవి కేవలం ఊహల స్థాయిలో ఉంటే “పారాఫిలియా”గా పరిగణించబడతాయి; అయితే ఆ ఊహలు ప్రవర్తనగా మారి ఇతరులకు హాని కలిగిస్తే లేదా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తే “పారాఫిలిక్ డిజార్డర్”గా గుర్తించబడతాయి. ముఖ్యంగా పీడోఫిలియా, ఎక్సిబిషనిజం, వాయిజరిజం వంటి రుగ్మతలు చట్టవిరుద్ధమై, బాధితులకు తీవ్రమైన మానసిక నష్టాన్ని కలిగించవచ్చు. పీడోఫిలియాలో పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ ఉండటం, ఎక్సిబిషనిజంలో అనుమతి లేకుండా జననేంద్రియాలు చూపించడం, వాయిజరిజంలో రహస్యంగా ఇతరులను గమనించడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఇవన్నీ తీవ్రమైన సైకియాట్రిక్ ఆత్మపరిశీలనను అవసరం చేస్తాయి. ఇతర పారాఫిలిక్ డిజార్డుల్లో ఫెటిషిజం, ఫ్రోట్యూరిజం, సాడిజం/మాసోకిజం ఉన్నాయి. ఫెటిషిజంలో నిర్జీవ వస్తువులపై ఆకర్షణ ఉంటే అది చట్టవిరుద్ధం కాదు కానీ దైనందిన జీవితానికి ఆటంకంగా మారితే చికిత్స అవసరం. ఫ్రోట్యూరిజంలో అనుమతి లేకుండా ఇతరులను తాకడం జరిగితే అది నేరంగా పరిగణించబడుతుంది. సాడిజం లేదా మాసోకిజం అనేవి ఇద్దరి సహమతి మీద జరిగితే సాధారణంగా అనుమతించబడినప్పటికీ, బాధ కలిగించే లేదా ప్రమాదకరంగా మారితే చికిత్స అవసరం. ఈ రుగ్మతలు తరచుగా బాల్యంలో లైంగిక దుర్వినియోగం, భావోద్వేగ అస్థిరతలు, మెదడు రసాయనాల్లో అసమతుల్యతలు వంటి కారణాల వల్ల ఏర్పడవచ్చు. చట్టపరంగా కొన్ని డిజార్డర్లకు కఠినమైన శిక్షలు విధించబడతాయి, కాబట్టి ముందు చూపుతో సైకియాట్రిక్ అసెస్మెంట్ చేయించుకోవడం అత్యవసరం. ప్రతి పారాఫిలియా డిజార్డర్ కాదు. అది వ్యక్తికి లేదా ఇతరులకు హాని కలిగిస్తున్నదా లేదా అనే ఆధారంగా నిర్ణయించాలి.

మానసిక లైంగిక రుగ్మతలు అనేవి సరైన చికిత్సతో పూర్తిగా నయం అయ్యేవి. వైద్యుడు, మానసిక వైద్యుడు లేదా సెక్స్ థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఈ సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. నిపుణుల సహాయం తీసుకోవడం లో మొహమాటం ఉండకూడదు. మానసిక ఆరోగ్యం అనేది లైంగిక ఆరోగ్యానికి బలమైన ఆధారం. ఈ సమస్యలు సాధారణమే అయినా, అవగాహన, సంభాషణ, మరియు సరైన నిపుణుల సహాయంతో మెరుగుదల సాధ్యమే. లైంగిక ఆరోగ్యం కూడా మన ఆరోగ్య ప్రయాణంలో ముఖ్యమైన భాగమే. దీనిని తక్కువగా అంచనా వేయకండి. సరైన మార్గదర్శకంతో ఈ పరిస్థితులు పూర్తిగా నియంత్రించగలుగుతాం. సహాయం కోసం అడగడంలో ఏమీ తప్పులేదు. సోషల్ స్టిగ్మాను వీదండి.

-డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page