– పేలుతున్న పరస్పర విమర్శల తూటాలు
– వేడెక్కిన ఎన్నికల ప్రచారం
– అజరుద్దీన్ కు మంత్రి పదవిపై బీఆర్ఎస్ మండిపాటు
– ఎన్టీఆర్ విగ్రహం హామీపై కూడా విమర్శలు
– కేవోట్ల కోసమే రేవంత్ ఫీట్లు అంటూ కేటీఆర్ దాడి
– బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఎదురు దాడి
(మండువ రవీందర్‌రావు)
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక దగ్గర పడుతున్నకొద్ది రాజకీయపార్టీల ప్రచారం జోరందుకుంది. పోటాపోటీగా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గులాబీ, కాషాయ, కాంగ్రెస్ జంఢాలు, బ్యానర్లు, కటౌట్లతో నిండిపోయింది. అధికార కాంగ్రెస్ అభ్యర్ధి పక్షాన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగటంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. శుక్రవారం రహమత్ నగర్, వెంగళరావు నగర్‌లో రేవంత్‌రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్న సందర్భంగా బిఆర్‌ఎస్, బిజెపిపైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బిఆర్‌ఎస్ సెంటిమెంట్‌తో ఓట్లను దండుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సెంటిమెంట్ పేరుతో ఓట్లను అడిగే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదన్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎంఎల్ మాగంటి గోపీనాథ్ అకాలమరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 11న జరిగే ఎన్నికలకుగాను బిఆర్‌ఎస్ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో ఆమె తన దివంగత భర్తను తలుచుకుని కన్నీటిపర్యంతరమవడాన్ని కాంగ్రెస్ ఎద్దేవ చేయడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె కన్నీటిని ఒక డ్రామాగా సాక్షాత్తు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడంపైన బిఆర్‌ఎస్ విరుచుకుపడిరది. అయినా కాంగ్రెస్ ఆ మాటమీద వెనక్కు తగ్గలేదనడానికి శుక్రవారం తమ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయి. మళ్ళీ అదే విషయాన్ని గుర్తుచేస్తూ బిఆర్‌ఎస్ సెంటిమెంట్‌తో ఓట్లుసాధించుకోవాలనుకుంటున్నదంటూ విమర్శించారు. సెంటిమెంట్‌తో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కులేదన్నారు. ఎందుకంటే ఆ ఆనవాయితీని చెరిపేసింది బిఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకున్న పి. జనార్థన్‌రెడ్డి మరణంతో ఏర్పడిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పోటీ అభ్యర్థిని నిలబెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. ఆనాటి విపక్ష పార్టీలు బిజెపి, తెలుగుదేశం పార్టీలు పిజెఆర్ కుటుంబంనుండి ఎవరు నిలబడినా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించినా, బిఆర్‌ఎస్ పోటీకి అభ్యర్థిని నిలబెట్టడంద్వారా అంతకు ముందు రాష్ట్రంలో ఉన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందంటూ విరుచుకు పడ్డారు. అయితే ఈ సెంటిమెంట్లు ఏమాత్రం పనిచేయవని, ప్రజలు అభివృద్ధికే పెద్దపీఠ వేస్తారన్నది కంటోన్మెంటు ఉప ఎన్నికలో రుజువైందన్న సిఎం రేవంత్‌రెడ్డి, నియోజకవర్గ ప్రజలు సెంటిమెంట్ జోలికి పోకుండా అభివృద్ధికే పట్టంకట్టాలని పిలుపిచ్చారు. కంటోన్మెంట్‌లో తమ అభ్యర్ధి గణేష్ గెలిచినతర్వాత గతంలో ఎన్నడూలేని విధంగా నియోజకవర్గంలో నాలుగువేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన జరిగిన అభివృద్ధి శూన్యమంటూ, బిల్లా రంగా(కెటిఆర్, హరీష్‌రావులను పరోక్షంగా)ల మాటలు నమ్మితే అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. మాగంటి గోపీనాథ్ ఏనాడూ స్థానిక సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకపోవడాన్ని, నాటి సిఎం కెసిఆర్ లేదా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నడైనా మీ సమస్యలను అడిగి తెలుసుకున్నారా అని ఆయన ప్రజలను ప్రశ్నిస్తూనే, ఓట్లు అడగడానికి వచ్చే బిఆర్‌ఎస్ నేతలను సలాక్‌పెట్టి కాల్చాలని మహిళామనులకు చెప్పారు.
దీనిపై అదే రీతిలో బిఆర్‌ఎస్‌కు స్పందిస్తున్నది. బిఆర్‌ఎస్ తన ప్రభుత్వకాలంలో ఏంచేసిందన్న విషయంలో చర్చకు రావాలని మాజీ మంత్రి , సనత్‌నగర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ఘాటుగా స్పందించారు. పదేండ్లకింద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో కెసిఆర్ పాలనను పోల్చిచూస్తే అభివృద్ధి ఏమేరకు జరిగిందో తెలుస్తుందన్నారు. మంత్రులు తిరుగకపోతేనే అభివృద్ధి సాధ్యపడిరదా అని ఆయన ప్రశ్నించారు. అంతెందుకు 23 నెలలకాలంలో హైదరాబాద్‌లో ఎన్నిచోట్ల తిరిగింది రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆయన సవాల్‌విసిరారు. అన్నిటికన్నా ముఖ్యంగా సిఎం అబద్దాలు చెప్పడం మానివేయాలని ఆయన హితవు చెప్పారు. నిజంగానే కంటోన్మెంట్‌లో ఉప ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగేవేల కోట్ల అభివృద్ధి జరిగితే ఎక్కడ జరిగిందో చూపించాలని, నిజంగానే జరిగినట్లైతే తాను శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తానని శ్రీనివాసయాదవ్, రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఓట్లకోసం కాంగ్రెస్‌పార్టీ ఎంతకైనా దిగజారుతున్నదంటూ ఆయన విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు అధికంగా ఉండటంలో ఎన్నికల ముందు అజారుద్దీన్‌ను మంత్రివర్గంలో తీసుకోవడాన్ని ఆయన ఎత్తిచూపుతున్నారు. నిజంగానే ముస్లిం మైనార్టీలపట్ల చిత్తశుద్ది ఉంటే 23 నెలల కాలంలో లేనిది ఇప్పుడే ఎందుకు తీసుకున్నట్లన్నది ఆయన ప్రశ్న. అలాగే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు ఎన్‌టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతాననడాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో అనేక నియోజకవర్గాలుండగా ఇక్కడే ఆమాట ఎందుకన్నట్లు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాగా ఇక్కడ కారుకు, బుల్డోజర్‌కు మద్య జరుగుతున్న ఎన్నికలని, ఏమరుపాటుతో గతంలో మాదిరిగా వచ్చిన అవకావాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రాష్ట్రంలోని నాలుగు కోట్లమంది నష్టపోతారని నియోజకవర్గంలోని నాలుగు లక్షల మంది ఓటర్లను మాజీమంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ది అంతా ఇప్పుటికే దిగజారిపోయిందని, ప్రజలు మెలుకువతో గట్టి తీర్పుఇచ్చి కాంగ్రెస్ డిపాజిట్ జప్తుచేయాలని, కాని పక్షంలో చాయ్ దుకాణంనుంచి పెద్ద వ్యాపారులవరకు రౌడీ మామూళ్ళ బారిన పడుతారని హెచ్చరించడంతో నియోజకవర్గంలో రాజకీయం వేడందుకుంది.





