– అధికారులను ఆదేశించిన సీఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటి లేని 227 ఆవాసాల్లో 642 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎంజిఎస్‌వై 4వ దశ పనుల మంజూరుకు పంపే ప్రతిపాదనలపై రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ పీఎంజిఎస్‌వైలో భాగంగా ఇప్పటివరకు మూడు దశలలో రాష్ట్రానికి మంజూరైన రహదారులు, వంతెనల నిర్మాణ పనులను పూర్తి చేశామని, ఈ పథకం నాలుగవ దశ కింద రాష్ట్రంలో పక్కా రహదారులు లేని 227 ఆవాసాలల్లో 642.23 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వీటిలో 34 పనులకు సంబంధించి 148 కిలోమీటర్లకు అటవీ శాఖ అనుమతులు పొందాల్సి ఉందని, ఈ మార్గాల్లో వంతెనల నిర్మాణ పనులకు సంబంధించి మరో వారం రోజుల్లో డీపీఆర్‌లను పూర్తి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




