అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక

– 16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీ డ్రా
– రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ
– పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు మీడియా, అర్హులైన లబ్దిదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తూ మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున 16 నియోజకవర్గాల్లో సుమారు ఎనిమిది వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600మంది లబ్దిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవడం, లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే రెండు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు. ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి అని మంత్రి స్పష్టం చేశారు.

ఉచితంగా రిజిస్ట్రేషన్

ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్దిదారులకు పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. పదేళ్ల తర్వాత అవసరాన్నిబట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుందని చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవసరం ఏర్పడితే డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. లక్కీ డ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్దిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్ షేర్ భూమి కూడా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో అవసరాన్నిబట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, లిఫ్ట్‌లతోపాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్దిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత 3-4 రోజుల్లోనే టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లబ్దిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.

నాంపల్లిలో 67 ఫ్లాట్లకు డ్రా

నాంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన లక్కీడ్రాలో తొలుత ఎస్సీ విభాగానికి కేటాయించిన 14 శాతం రిజర్వేషన్ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్ములో వేశారు. మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హౌసింగ్ ఎండీ వి.పి.గౌతమ్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్దిదారులతోనే డ్రా తీయించారు. ఎస్సీ విభాగంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృష్ణవేణి ఎంపిక కాగా అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి ఫ్లాట్లను డ్రా ద్వారా పొందారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ ఫ్లాట్లలో మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా మొత్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *