అవే ప్రగల్భాలు, అవే అబద్ధాలు!

“ఉమ్మడి రాష్ట్రం రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లోకీ, ఆర్థిక వ్యవస్థలోకీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భారీ అంకెల ప్రగల్భాల పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు రాష్ట్ర రాజకీయార్థిక వ్యవస్థను నడపడంలో భాగంగా, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు వండి వార్చే నోరు తిరగని అంకెలనూ, పదబంధాలనూ రాష్ట్రంలో చిలుకపలుకుల్లా పలికి, అమాయకులను భ్రమల్లో ముంచడం ఈ వ్యూహంలో ప్రధానాంశం. దావోస్ సదస్సు దగ్గరి నుంచి హైదారాబాద్ గ్లోబల్ సమ్మిట్ దాకా ఇదే తంతు. ప్రపంచ బ్యాంకు రాసిపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రిస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్, మెకన్సీ రాసిపెట్టిన విజన్ 2020 అప్పటి ఈ భారీ ప్రగల్భాల పత్రాలు. వాటిలో ప్రకటించిన అంకెలలో పది శాతం కూడా నిజం కాలేదు. ఆ ప్రగల్భాలనే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, రాష్ట్ర విభజన తర్వాత కె చంద్రశేఖర రావు (ఆయన కన్నా ఎక్కువగా కె టి రామారావు), కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే దారిలో ముందుకు సాగదలచుకున్నట్టున్నాడు.”

telanganardham venugopalమింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె. ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ. తెలంగాణ స్థితి సామెతలా మారిపోతున్నట్టున్నది. పత్రికలు చదివే, ఛానళ్లు చూసే తెలంగాణ ప్రజలు ఈ మంగళ బుధవారాలు తాము తెలంగాణలోనే ఉన్నామా, మరెక్కడయినా అభూతకల్పనల ఇంద్ర లోకంలో ఉన్నామా అని తమను తాము గిల్లుకుని చూసుకుని ఉంటారు. తమ కళ్ల ముందర కనబడుతున్న, తాము నిత్యం అనుభవిస్తున్న దారిద్ర్యం, అక్రమాలు, నిరుద్యోగం, ఆకలి, కనీస బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేని ప్రభుత్వం– అన్నిటికన్నీ చూమంతర్ అని మంత్రం వేస్తే మాయమైపోయినట్టు, హఠాత్తుగా కృష్ణా గోదావరులలో మాత్రమే కాదు, మూసీలో కూడా పాలూ తేనే ప్రవహిస్తున్నట్టు పగటి కలలు కని ఉంటారు.

తెలంగాణ రైజింగ్ అట. రెండు రోజుల్లో దేశదేశాల దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి, ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగువందల తొంబై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ మీద కుమ్మరించారట. ఫ్యూచర్ సిటీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో ఎడాపెడా డజన్ల కొద్దీ పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాల మీద సంతకాలు చేశాయట. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అనే పేరుతో, విజన్ 2020 వంటి పాత చింతకాయ పచ్చడి లాంటి అబద్ధాల పత్రమే మళ్లీ ఇప్పుడు కూడా మూడు భాషల్లో పది కీలక వ్యూహాలతో ఆవిష్కరించారట.

2024 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యం పెట్టుకున్నారట. అంటే ఇవాళ ఉన్న మారకం రేటు ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2,69,86,547 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందుతుందన్నమాట. (డాలర్ తో రూపాయి మారకం రేటు పడిపోతే ఇది మరింత ఎక్కువ కావలసి వస్తుంది!!) ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. రానున్న 22 సంవత్సరాలలో ఇది పదిహేను రేట్లు ఎక్కువగా మారుతుందన్నమాట. అత్యంత సులభమైన అంకగణిత పెరుగుదల రేటు ప్రకారం చూసినా ఇది ఏడాదికి 20 శాతం పెరుగుదల. ఇప్పటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు పది శాతం దాటలేదు. ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ కూడా 20 శాతం అభివృద్ధి రేటు చూడలేదు!

తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే పేరుతో తయారైన ఈ డాక్యుమెంటులో ఆనవాయితీ ప్రకారం యువతకు, మహిళలకు, రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాసుకున్నారు. (అదే రోజు పత్రికలో యువత, మహిళా, రైతుల హత్యలు, ఆత్మహత్యలు వార్తలు కూడా ఉన్నాయి!) తెలంగాణ ను క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ) జోన్లుగా విభజిస్తున్నామని వాగాడంబరాలు పలికారు. తెలంగాణాను ఇతర రాష్ట్రాలతో కాదు, ఏకంగా చైనా, జపాన్ లతో పోటీ పడేలా చేస్తామన్నారు.

“నిన్న గ్లోబల్ సమ్మిట్ లో ఒక ఇథనాల్ ప్లాంట్ ప్రస్తావన ఉంది. ఇథనాల్ పరిశ్రమ వల్ల జరిగే జల, వాయు కాలుష్యం సంగతి పక్కన పెట్టి చూసినా, ఆ కంపెనీ 10000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందనీ, 35,000 ఉద్యోగాలు కల్పిస్తుందనీ పత్రికలు రాశాయి. కనీసమైన ఇంటర్నెట్ పరిశోధన చేస్తే ఇథనాల్ పరిశ్రమలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పది నుంచి పన్నెండు వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం ఆసాధ్యం అని తెలుస్తున్నది. అలాగే 2025 జూలైలో, అంటే నాలుగు నెలల కింద పది లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన ఒక కంపెనీ, నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, 9,000 ఉద్యోగాలతో ఒక బయోగ్యాస్ ప్లాంట్ స్థాపిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ఇటువంటి గ్యాస్ కంపెనీలు, గ్యాస్ ఉద్యోగాలు ఎన్నో?..”

హైదరాబాద్ లో 2047 లో ఎలక్ట్రిక్ బస్సులు సాధారణ అసహనం ఏమీ లేకుండా బస్ స్టాపులలోకీ, బైటికీ జారిపోతుంటాయట. మెట్రో రైళ్లు మీ మనసులో ఉన్న పాత చిత్రపటాలను తుడిచిపారేస్తాయట. ఔటర్ రింగ్ రోడ్డుకూ రీజినల్ రింగ్ రోడ్డుకూ మధ్య ఉన్న ప్రదేశం పరిశ్రమను కాల్పనికంగా మార్చేస్తుందట. కార్ఖానాలు గర్జించే బదులు కూనిరాగాలు తీస్తుంటాయట. ఇక మూడో రంగమైన రేర్ లో గ్రామాలు ఎటువంటి సంకోచం లేకుండా తమ అస్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటాయట. పొలం చుట్టుకొలతను రాస్తూ డ్రోన్ ఆకాశం మీద ఎగురుతుంటుందట. కోల్డ్ స్టోరేజి యూనిట్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తుందట. ఒక రైతు తన డాష్ బోర్డ్ మీద తన ఉత్పత్తుల ధరలను పర్యవేక్షిస్తుంటాడట.

విజన్ 2020 అని గురువు చంద్రబాబు నాయుడు అమ్మడానికి ప్రయత్నించిన కలలు ఎంతమందికి గుర్తున్నాయో తెలియదు. ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గురువును మించిన శిష్యుడు అవే కలలను అంతే నిష్పూచీగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే ఆ కలలు అలా ఉంచి, ఇప్పటికిప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో ప్రచారం చేసిన అంకెలే చూద్దాం. ఇటువంటి ప్రకటనల్లో ఎన్ని నిజం అవుతాయో ఒక్క పత్రిక అయినా, ఒక్క ఛానల్ అయినా ఒక ఏడాది తర్వాతనో, రెండేళ్ల తర్వాతనో, ఐదేళ్ల తర్వాతనో తవ్వితీసి వార్తలు రాస్తే చూడాలని నాకు ఇరవై అయిదేళ్లకు పైగా కుతూహలంగా ఉన్నది.

ఈ ప్రకటనల్లో అత్యధిక భాగం వాస్తవ పెట్టుబడులు కావు. అవి వాస్తవ పెట్టుబడులు అవునో కాదో పరిశీలించి రాయాలనే సోయి కూడా లేని విలేఖరులదీ, పత్రికలదీ, ఛానళ్లదీ రాజ్యం. ఇటువంటి అంకెలను సాధారణంగా పెట్టుబడి అనడానికి వీలు లేదు. అర్థ శాస్త్ర, వ్యాపార శాస్త్ర పరిభాషలో వాటిని ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ – ఆసక్తి ప్రకటన – అంటారు. వేరు వేరు ప్రదేశాలలో తమ పెట్టుబడులు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ అమ్మకపు అవకాశాలుంటాయి, ఎక్కువ ముడి సరుకులు దొరుకుతాయి అని పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ప్రపంచమంతా వెతుకుతుంటారు. ఆ వెతుకులాటలో భాగంగా అనేక మార్కెట్లలో తమకు ఆసక్తి ఉందని ప్రకటిస్తారు. వారి ముందర స్థానిక మార్కెట్ యజమానులు, ప్రభుత్వాలు తమదగ్గరికి వస్తే ఏమేమి ఇస్తామో ఏకరువు పెడుతుంటారు. తాము పెట్టేదానికి, వచ్చేదానికీ మధ్య తారతమ్య పరిశీలన చేసుకుని అంతిమంగా ఎక్కడ పెట్టుబడి పెట్టడం తమకు లాభసాటో లెక్క వేసుకుని అక్కడ అంతిమంగా వాలుతారు.

ఈ ఆసక్తి ప్రకటన చేశాక సుదీర్ఘకాలం సంప్రదింపులు జరుగుతాయి. స్థానిక ప్రభుత్వం ఎంత భూమి ఇస్తుంది, ఎటువంటి విద్యుత్, నీరు, రవాణా సదుపాయాలు కల్పిస్తుంది, ఎంత పన్ను రాయితీ ఇస్తుంది, ఇటువంటి ఎన్నో ప్రశ్నల మీద ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. మరి మరొక రాష్ట్రం వారు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు గదా అని గీచి గీచి బేరాలాడుతుంది. ఈ బేరసారాలు ఎలా ఉన్నా, ఒక కంపెనీ ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసుకోవడానికి ఆ ప్రాంతంలోని ముడి సరుకులు, మానవ వనరుల లభ్యత, తాము ఇతర ప్రాంతాల నుంచి బదిలీ చేసే ఉద్యోగుల, కొత్తగా నియమించుకునే ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలు, తాము ఇక్కడ స్థాపించే పరిశ్రమ ఉత్పత్తులకు ఉండగల స్థానిక మార్కెట్, ఇతర చోట్ల మార్కెట్ ఉంటే రవాణా సౌకర్యాలు వంటి అనేక అంశాలు చర్చలోకి వస్తాయి. ఈ మధ్యలో నిర్ణయాధికారం ఉండే అధికారవర్గానికి, రాజకీయ నాయకత్వానికి ఎంత ముడుపులు చెల్లించాలనే రహస్య చర్చలు కూడా జరుగుతాయి.

మొత్తానికి ఇటువంటి భారీ సదస్సుల్లో పది కంపెనీలు ముందుకొస్తే రెండో మూడో, పదివేల కోట్ల రూపాయలు ప్రకటిస్తే వెయ్యో రెండువేలో కోట్ల పెట్టుబడులు మాత్రమే నిజమవుతాయి. ఇక ప్రజలను ఆకర్షించడానికి ప్రతి కంపెనీ వెయ్యి ఉద్యోగాల నుంచి పదివేల ఉద్యోగాల దాకా ప్రకటించేట్టు ప్రభుత్వాలు పథకాలు రచిస్తాయి. చివరికి ఆ కంపెనీ నిజంగా స్థాపించబడినా ప్రకటించిన ఉద్యోగాలలో పదో వంతు కూడా నిజంగా రావు. ఆ ఉద్యోగాలు కూడా స్థానికులకు దక్కవు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఆ కంపెనీ ఉత్పత్తి కూడా ప్రారంభించినా, అప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి ప్రయోజనమూ చేకూరదు. పైగా రాష్ట్ర ప్రజలకు చెందిన భూమి ఆ కంపెనీకి అవసరమైనదానికన్న ఎక్కువ దక్కుతుంది. అది రియల్ ఎస్టేట్ గా మారుతుంది. ఆ కంపెనీకి ఉచితంగానో, చౌకగానో అందే కరెంటుకూ నీటికీ రవాణా సౌకర్యాలకూ రాష్ట్ర ప్రజల పన్ను ధనం కైంకర్యం అయిపోతుంది. లేదా డోనాల్డ్ ట్రంప్ వంటి జాత్యహంకారి, అక్రమ వ్యాపారి పేరు హైదారాబాద్ నగరంలో ఒక వీథి పేరుగా మిగిలిపోతుంది.

నిజానికి ప్రజానుకూల రాజకీయాలు, ప్రజానుకూల పత్రికా రంగం ఉంటే ఒక సంవత్సరం ఇటువంటి భారీ సదస్సులో చేసిన ప్రకటనల్లోని వాస్తవం ఏమిటి అనే ధృవీకరణ జరపాలి. అసలు ఆ కంపెనీ ఉందా? ఎప్పుడు స్థాపించారు? ఏయే ఉత్పత్తిలో, వ్యాపారంలో ఆ కంపెనీ ఉంది? ఇక్కడ ఆ కంపెనీ ప్రకటిస్తున్న పెట్టుబడికీ, ఆ కంపెనీ ఆర్థిక స్థితికీ ఏమైనా సంబంధం ఉందా? వారు చెపుతున్న పెట్టుబడికీ ఉద్యోగాల కల్పనకూ సంబంధం ఉందా? వంటి ఎన్నో ప్రశ్నల మీద పరిశోధనాత్మక కథనాలు రాయవచ్చు.

ఉదాహరణకు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో ఒక ఇథనాల్ ప్లాంట్ ప్రస్తావన ఉంది. ఇథనాల్ పరిశ్రమ వల్ల జరిగే జల, వాయు కాలుష్యం సంగతి పక్కన పెట్టి చూసినా, ఆ కంపెనీ 10000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందనీ, 35,000 ఉద్యోగాలు కల్పిస్తుందనీ పత్రికలు రాశాయి. కనీసమైన ఇంటర్నెట్ పరిశోధన చేస్తే ఇథనాల్ పరిశ్రమలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పది నుంచి పన్నెండు వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం ఆసాధ్యం అని తెలుస్తున్నది. అలాగే 2025 జూలైలో, అంటే నాలుగు నెలల కింద పది లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన ఒక కంపెనీ, నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, 9,000 ఉద్యోగాలతో ఒక బయోగ్యాస్ ప్లాంట్ స్థాపిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ఇటువంటి గ్యాస్ కంపెనీలు, గ్యాస్ ఉద్యోగాలు ఎన్నో? పెట్టుబడుల సునామీ, అంచనాలకు మించి రెండింతల పెట్టుబడుల వెల్లువ, రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు అని పారవశ్యంలో మునిగి తేలే పత్రికలు ఒక్కసారి కనీసమైన పరిశోధన చేస్తే ఈ ప్రగల్భాలలో ఎన్ని వాస్తవాలో, ఎన్ని అవాస్తవాలో బైటపడుతుంది.

ఉమ్మడి రాష్ట్రం రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లోకీ, ఆర్థిక వ్యవస్థలోకీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భారీ అంకెల ప్రగల్భాల పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు రాష్ట్ర రాజకీయార్థిక వ్యవస్థను నడపడంలో భాగంగా, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు వండి వార్చే నోరు తిరగని అంకెలనూ, పదబంధాలనూ రాష్ట్రంలో చిలుకపలుకుల్లా పలికి, అమాయకులను భ్రమల్లో ముంచడం ఈ వ్యూహంలో ప్రధానాంశం. దావోస్ సదస్సు దగ్గరి నుంచి హైదారాబాద్ గ్లోబల్ సమ్మిట్ దాకా ఇదే తంతు. ప్రపంచ బ్యాంకు రాసిపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రిస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్, మెకన్సీ రాసిపెట్టిన విజన్ 2020 అప్పటి ఈ భారీ ప్రగల్భాల పత్రాలు. వాటిలో ప్రకటించిన అంకెలలో పది శాతం కూడా నిజం కాలేదు. ఆ ప్రగల్భాలనే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, రాష్ట్ర విభజన తర్వాత కె చంద్రశేఖర రావు (ఆయన కన్నా ఎక్కువగా కె టి రామారావు), కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే దారిలో ముందుకు సాగదలచుకున్నట్టున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page