‌సాయిబాబాకు వినమ్ర జోహార్లు…

మన ప్రియతమ నాయకుడు, శ్రామిక వర్గ ప్రజల ఉత్తమోత్తమ పుత్రుడు, ప్రపంచ ప్రజల ‘‘శ్రమ విముక్తి దృక్పథానికి’’ తన జీవితాన్ని అంకితం చేసిన అమరుడు, దిల్లీ  విశ్వ విద్యాలయ మాజీ ప్రొఫెసర్‌, ‌డా. జి.యన్‌. ‌సాయిబాబా ఆదివారం రాత్రి 8.36 గ.లకు నిమ్స్ ‌హాస్పిటల్‌, ‌హైద్రాబాద్‌లో కన్ను మూసిన సందర్భంగా అమరుని పూర్తి ఉద్యమ చరిత్ర నేను నిర్వచించలేను, కానీ ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రయాణంలో భాగంగా కొన్ని విషయాలు నాకు తెలిసిన, నాతో వున్న అనుభవాలు ఇక్కడ పంచుకుంటూ, మిత్రునికి వినమ్ర జోహార్లు అర్పిస్తూ….

 

ప్రియమైన పీడిత ప్రజలారా!
ప్రజాస్వామిక వాదులారా!

1994 -1995 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌ ‌వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు చేయాలని చేసిన పోరాటం, ఉరిశిక్షల వ్యతిరేక పోరాటం, జైలు సమస్యల పరిష్కార చారిత్రక పోరాటం, నుండి 1997 డిసెంబర్‌ 28,29 ‌వరంగల్‌ ‌లో అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక ప్రజాస్వామిక తెలంగాణ, వరంగల్‌ ‌డిక్లరేషన్‌  ‌సభలోనే  సాయి తో కలిసి పనిచేసే అవకాశం మొదటిసారిగా నాకు వచ్చింది. ఈ సభకు కా. సాయిబాబా, ఆ వేదిక బాధ్యునిగా నెల రోజుల ముందు వరంగల్‌ ‌కు వచ్చారు. ఆ సందర్భగా ఒక మూడు రోజులు సాయిబాబాతో పాటు, అమ్మ నాన, వసంత మరియు మంజీర(అపుడు 6 నెలల పాప) మా ఇంట్లో నే వుండడం గొప్ప ఆనందం తో పాటు మా యిద్దరి పిల్లలు, శైలజకు తీపి గుర్తులుగా మిగిలాయి. నెల రోజుల పాటు కలిసి పని చేశాం.ఆ సభను విజయవంతం చేయడంలో అందరి సమిష్టి కృషిలో భాగంగా సాయిబాబా కృషి కూడ గొప్పది. ఆ సభనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమానికి   ఒక మైలు రాయిగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అప్పటినుండి వివిధ ప్రజా ఉద్యమములో ఇరువురం ప్రయాణం చేస్తున్నా, 2006 సంవత్సరం ఆఖరి మాసాల్లో రాంచిలో నిర్వహించిన అఖిల భారత నిర్వాసిత వ్యతిరేక వేదిక( విస్తాపన్‌ ‌విరోధి ఘటన్‌) ‌లో సమిష్టిగా విజయవంతం

 

అవడంతో పాటు, నాటి సమైక్య ఆంధ్రలో, నేటి  తెలంగాణ లో 9 మండలాల ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేస్తున్న అతి పెద్ద దుర్మార్గ ప్రాజెక్ట్ ‌పోలవరం కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ఉధృతం  చేయడంలో భాగంగా ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే తీర్మానం ప్రకారం, 2007, ఫిబ్రవరి నెలలో వేదిక నాయకుల స్థానిక  ఉద్యమ కారుల, మేధావులతో పెద్ద బృందం( అమరు లు కా.సాయిబాబా, బి.డి.శర్మ, పున్నారావు, రడం శ్రీను, జువ్వాడి లక్ష్మీనారాయణ, డా.గోపీనాథ్‌, అర్వపల్లి విద్యాసాగర్‌( ‌తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్‌, ‌పోలవరంకు వ్యతిరేకంగా  2006, అక్టోబర్‌ 26 ‌న, ఖమ్మంలో తె.ఐ.కా. నాయకత్వంలో జరిగిన చారిత్రాత్మకసభకు బాధ్యులు), చిక్కుడు ప్రభాకర్‌, ‌వై.వి.రావులు) అయిదు రోజుల పాటు 7 మండలాలు గోదావరి నది మీదుగా  పర్యటించి బాధితుల నాయకత్వంలో ఉద్యమం ఉధృతం చేయాలని భద్రాచలం, ఖమ్మం జిల్లా కేంద్రంలో పత్రికా విలేఖరుల సమావేశాలు నిర్వహించి ఆదివాసీ ప్రజలకు అండగా ప్రజలందరూ నిలబడాలని కోరడం జరిగింది. ఆ తరువాత ఆ నివేదికను తెలుగులో నేను రూపొందించగా, ఆ నివేదికను ఇంగ్లీష్‌ ‌లోకి తర్జుమా చేసిన కా. సాయి, వేదిక బులిటెన్‌ ‌లో ప్రచురించారు. అప్పటి నుండి కొంత మేరకు పోలవరం వ్యతిరేక ఉద్యమం ఉధృతమైంది. కానీ ఆ ప్రాజెక్ట్ ‌నిలిచి పోయె దిశగా పోరాటం జరుగలేదు. ఆ తర్వాత క్రమంలో నాటి యు.పి.ఏ. ప్రభుత్వంలో మొదలైన పాశవిక దమన కాండ అయిన గ్రీన్‌ ‌హంట్‌ ‌లో భాగంగా దేశంలో మొట్టమొదటి సారి దుర్మార్గ చట్టమైన ( %ఖ•••%) ను ప్రజా ఉద్యమ చరిత్ర లో 2007, ఏప్రిల్‌ 4 ‌న ఆంధ్రప్రదేశ్‌ ‌లో మా ఇద్దరి ( పి. వి. కొండల్‌ ‌రావు, చిక్కుడు ప్రభాకర్‌)  ‌పైన నమోదు చేయగా,  దానిని దేశ వ్యాప్తంగా ప్రచారంలో కా.సాయి పాత్ర ముఖ్యమైనది.

 

మేము జైలు నుండి విడదలైన తర్వాత, హైద్రాబాద్‌ ‌కు వచ్చి నన్ను పరమార్షించి, నాలో, కుటుంబంలో ధైర్యం నింపి రాజకీయ ఖైదీల విడుదలకు ముందుకు వచ్చే న్యాయవాదులను నిర్మాణంలో కలుపుకు వచ్చే అంశం గురించి చర్చించారు. ఆ తర్వాత అపుడపుడు అయా సభలలో కలిసినా, ఇద్దరం కలిసి కూర్చుని 10 నిమిషాలు మాట్లాడు కున్నది లేదు.ఆ తర్వాత 2015 మే లో వరంగల్‌ ‌లో గ్రీన్‌ ‌హాంట్‌ ‌కు వ్యతిరేకంగా  తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆద్వర్యలో జరిగిన చారిత్రాత్మక సభ ముఖ్య అతిథిగా హాజరైన సాయి ని ప్రత్యక్షంగా కలువడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాలుగా భారత రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా   విధించబడిన జైలు శిక్ష లో అతని ఆరోగ్యం క్షీణించడంతో పాటు కనీసం తన తల్లి అంత్యక్రియల్లో కూడ పాల్గొనకుండా,  రాజ్యం అతన్ని నిర్బంధించింది.

 

బాంబే హైకోర్టు తీర్పు ద్వారా ఇటీవల కాలంలో విడుదలైన సాయి లక్షలాది ప్రజల ఆదర్శ ప్రాయమైన ప్రియతమ నాయకుడు అయ్యారు. రాజ్య నిర్బంధాన్ని ఎదిరించి, శ్రామిక విముక్తి కొరకు పోరాడుతున్న ప్రాపంచిక దృక్పథమే నా దృక్పథం అని  ప్రకటించి మూడున్నర దశాబ్దాల పాటు ఆ దృక్పథాన్ని ఆచరించి , తుది శ్వాస వరకు అన్ని  విషయాలలో బోల్షెవిక్‌ ‌స్పిరిట్‌ ‌తో   పోరాడి నిజాం హాస్పిటల్‌  ‌లో ఆదివారం రాత్రి  8 .36 నిమిషాలకు అసువులు బాసిన ప్రో. సాయిబాబా అమరుడు, అజరామరుడు. ప్రో. సాయిబాబా లేని లోటు తీర్చలేనిది. కానీ ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలనుండి ఎదిగి వచ్చే సాయిబాబా లాంటి ఎందరో ఉద్యమ నాయకులతో భాగస్వామ్యమై ప్రో. సాయిబాబా ఆశయాలను కొనసాగించడమే విప్లవ కుటుంబ సభ్యులు, పీడిత ప్రజల ప్రియతమ నాయకులు,  ప్రో. సాయిబాబాకు మన మిచ్చే ఘనమైన నివాళి
– చిక్కుడు ప్రభాకర్‌, ‌కన్వీనర్‌,
‌తెలంగాణ ప్రజాస్వామిక వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page