– రెండు లక్షల మందితో బహిరంగ సభ
– రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకానిలో రెండు లక్షల మందితో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్ రోడ్స్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించి, సభ ఏర్పాట్లు, జన సమీకరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదేనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన మన ప్రాంతం నుంచే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఇళ్లలోకి ఒకే క్లిక్‌తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులందరూ తరలివస్తున్నట్లు వెల్లడించారు. మన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే ఇలాంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలన్నదే మన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సభకు మైక్రో ప్లానింగ్
సభకు వచ్చే రైతులు, ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ శ్రేణులు పక్కాగా ‘మైక్రో ప్లానింగ్’ చేసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లో వంద మంది జనాభాకు ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించి, ఎంతమంది వస్తున్నారనే ఖచ్చితమైన జాబితాను పేరు, ఫోన్ నెంబర్‌తో సహా సిద్ధం చేయాలన్నారు. సభను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆరు ప్రత్యేక కమిటీలను (మండల ఆర్గనైజింగ్, వాహనాల పర్యవేక్షణ, ప్రచార, మీడియా, మంచినీటి సదుపాయాలు, వాలంటీర్ల కమిటీలు) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, డీసీసీ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ నాయకులతో కూడిన ‘మండల ఆర్గనైజింగ్ కమిటీలను’ తక్షణమే ఏర్పాటు చేసుకొని, ప్రచార సామగ్రిని, వాహనాలను సమన్వయం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ వలంటీర్లే గేట్ల వద్ద బాధ్యత
పోలీస్ వ్యవస్థపైనే పూర్తిగా భారం వేయకుండా, మన ముఖ్య నాయకులను గుర్తించి గౌరవంగా వేదికపైకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ వలంటీర్లే గేట్ల వద్ద బాధ్యత తీసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెప్పాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా చింతకానిలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వైరా నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తరలిస్తామని తెలిపారు. 30న నిర్వహించే ఈ సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన బహిరంగ సభల రికార్డులను తిరగరాసే విధంగా చింతకాని సభ చరిత్రాత్మకంగా ఉండే విధంగా మనందరం కష్టపడి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువ్వాళ దుర్గాప్రసాద్, నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులు, ఏరియా బూత్ ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభ స్థలాల పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యే భారీ బహిరంగ సభ స్థల ఎంపిక కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో కలిసి చింతకాని మండలం లచ్చగూడెం, జగనాధపురం క్రాస్ రోడ్డులో స్థలాలను పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రూట్లల్లో వాహనాలు వచ్చే విధంగా స్థల ఎంపిక కోసం ప్రత్యేక పరిశీలన చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సహా పలువురు అధికారులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





