భూమి సంగ‌తి అడిగితే ఎస్బీఐపై పగబట్టారు

– రాయదుర్గం భూమల వేలంపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జూన్ 22: హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు అప్పటి ప్రభుత్వం ఎకరం భూమి చ్చిందని, అయితే రేవంత్ రెడ్డి బ్యాంక్ కు ఇచ్చిన భూమిని అమ్మేసిండని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు మండి పడ్డారు. అంతేగాక ఇప్పుడు ఎస్ బిఐ మీద పగపట్టిండని మండిపడ్డారు. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎస్బీఐకి ఇచ్చిన భూమి ని వేలానికి ఇచ్చిండు.. భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా కోర్టుకు వెళ్లింది. మాకు ఎకరం భూమి ఇచ్చిరు. ఇది కూడా ఉచితంగా ఏం ఇయ్యలేదు. మేము
దాదాపు రూ.20 కోట్లు పెట్టి ఈ భూమి కొనుక్కున్నమని, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది. పైసల్ పెట్టి కొన్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకున్నడు అని హైకోర్టుకు పోయారన్నారు. వాళ్లు పైసలు పెట్టి కొన్నది నిజమే కదా.. ఈ అమ్మకం తప్పు అని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం.. రేవంత్ రెడ్డి ఎస్బీఐ మీద పగపట్టిండు. ఎస్బీఐని నిషేధిస్తాం. ఎస్బీఐలో ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తాం. ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఖాతాలన్ని తీసేస్తా అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుండు.. రేవంత్ రెడ్డి తీరు ఎవరన్నా ప్రశ్నిస్తే పగబడమన్నట్టు ఉంది. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటావా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ఒక బ్యాంక్ అయితే కావాలి కదా.. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే నిషేధిస్తా అంటడు.. రేపు ఎనుముల కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడ్తరు అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి మోసగాడు .. రూ.29.350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీ

రేవంత్‌రెడ్డి మోసగాడు.. అన్నివర్గాలను మోసం చేసిండు.. రైతు భరోసా ఇస్తానని ఎగ్గొంటిండు.. ఇపుడది రూ.29,350 కోట్ల బాకీ అయింది.. అని  హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామాల చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్‌రెడ్డి పాలక పక్షం అవుతుందని ఒప్పుకున్నాడంటూ వంద స్థానాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ తన గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు, పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనిఆయన ప్రశ్నించారు. నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు నేడు పెట్రోల్, డీజిల్, ఎరువుల చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనివ్వననడం విడ్డూరంగా ఉందన్నరు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తామని చెప్పారు. పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు.. ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారన్నారు. ఇపుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కాకపోవడంతో ఒక తరమే దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసాల ప్రభుత్వం వద్దు.. స్కీమ్‌ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆరఎస్ సోషల్ మీడియాపై ఎవడు కేసులు పెట్టిండో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరినీ వదిలిపెట్టం.. రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొచ్చి బొక్కలో వేస్తాం అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అయినా ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా కేసీఆర్ మార్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 75 శాతం పూర్తి చేశామని, మిగిలిన పనులు పూర్తి చెయ్యకుండా రెండున్నరేండ్లగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి 3.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లున్నాయి.. కృష్ణా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి.. ఎసఎల్‌బీసీ టన్నెల్‌ను మూరెడు తొవ్వలేదు.. సిగాచి ఫ్యాక్టరీలో 54 మంది చనిపోతే ఒక్క రూపాయి ఎక్స్‌గ్రేషియో ఇవ్వలేదు అని విమర్శించారు. కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేత ఆరఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *