రూర‌ల్‌ డిజిటల్‌ కనెక్టివిటీలో తెలంగాణ రోల్‌ మోడల్‌

– ‘టీ-ఫైబర్‌’ గ్రామాల పైలట్‌ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
– మంత్రి శ్రీధర్‌బాబుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య అభినందన

న్యూదిల్లీ, అక్టోబర్‌ 8 : గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ కనెక్టివిటీని అందించడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌ మోడల్‌గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియా కితాబు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-ఫైబర్‌ గ్రామాల పైలట్‌ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన అధ్యక్షతన దిల్లీలో బుధవారం నిర్వహించిన స్టేట్‌ గవర్నమెంట్‌ ఐటీ మినిస్టర్స్‌ అండ్‌ ఐటీ సెక్రటరీస్‌ రౌండ్‌ టేబుల్‌ సదస్సులో వినూత్న విధానాలతో డిజిటల్‌ సమ్మిళత్వానికి తెలంగాణ బాటలు వేస్తున్నదంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును ప్రత్యేకంగా అభినందించారు. ‘లాస్ట్‌-మైల్‌ ఫైబర్‌ కనెక్టివిటీ’ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందని కొనియాడారు. టీ-ఫైబర్‌ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలని కోరారు.

సమ్మిళిత వృద్ధికి డిజిటల్‌ సమానత్వమే పునాది:  శ్రీధర్‌బాబు

‘డిజిటల్‌ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్‌ అంతరాన్ని తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం. అందుకనుగుణంగా పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వినూత్న విధానాలతో ముందుకెళ్తున్నాం. భావితరాల కోసం పటిష్ఠమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం’ అని కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. డిజిటల్‌ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే తమ లక్ష్యమని, టీ-ఫైబర్‌ ద్వారా ప్రతి ఇంటికీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్‌ కనెక్టివిటీని అందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ ఇండియా, భారత్‌ నెట్‌ లక్ష్యాలకనుగుణంగా ఫైబర్‌-టు-ది-హోమ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ-గవర్నెన్స్‌, విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ వ్యవస్థాపకత తదితర సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేరుస్తున్నామని చెప్పారు. భారత్‌ నెట్‌ అమలులో వేగం పెంచాలని, రైట్‌ ఆఫ్‌ వే సవాళ్లను పరిష్కరించాలని, దేశ, రాష్ట్రాల డిజిటల్‌ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్‌ భద్రత ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. సమావేశంలో టీ-ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page