“హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, వేగ పరిమితులు పాటించడం ఇవన్నీ చట్టాల భయంతో కాక, మన మనస్సుతో చేయాల్సినవి. ప్రభుత్వం పరంగా రహదారులపై స్పీడ్ గన్స్, సీసీ కెమెరాలు, డ్రంక్ డ్రైవ్ తనిఖీలు మరింత కఠినతరం కావాలి. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్సు జారీ విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా డ్రైవింగ్ ఒక బాధ్యతగా మిగలాలి. మౌలిక సదుపాయాల పరంగా రహదారి రూపకల్పనలో భద్రతే ప్రాధాన్యంగా ఉండాలి. మలుపుల వద్ద సైన్‌బోర్డులు, రాత్రివేళల్లో కనిపించే తెలుపు చారలు, సరైన వెలుతురు ఇవన్నీ ప్రాణాలను రక్షించే చిన్న కానీ కీలక చర్యలు.”
భారతదేశం సుమారు 63.31 లక్షల కిలోమీటర్ల రహదారి వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్. ఈ విస్తారమైన మార్గాలపై ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణిస్తారు. కానీ ఇదే రోడ్లు వేలాది ప్రాణాలను మింగుతున్నాయి.
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం, 2023లో దేశంలో 4,64,029 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 1,73,826 మంది మరణించగా, 4,47,969 మంది గాయపడ్డారు. 2022తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య, మరణాల సంఖ్య రెండూ పెరిగాయి. అంటే సగటున ప్రతి గంటకు ఇరవై మందికి పైగా రోడ్లపై చనిపోతున్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రమాదాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవన్నీ పరిశ్రమల విస్తరణ, పట్టణీకరణ వేగంగా సాగుతున్న రాష్ట్రాలే. అంటే అభివృద్ధి ఉన్న చోట భద్రత వెనుకబడుతోంది.
ద్విచక్ర వాహనాల వల్లే దాదాపు 46 శాతం మరణాలు సంభవించాయి. పాదచారుల మరణాలు 16 శాతం దాకా ఉన్నాయి. జాతీయ రహదారులపైనే 35 శాతం మరణాలు, రాష్ట్ర రహదారుల్లో 23 శాతం మరణాలు నమోదు కావడం భయంకరమైన వాస్తవం. అత్యధిక ప్రమాదాలు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య చోటుచేసుకుంటున్నాయి. అంటే కాంతి తగ్గుదల, వాహన రద్దీ, అలసట అన్నీ కలిసిన సమయం అదే.
ప్రమాదాల వెనుక నిర్లక్ష్యం:
ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం. మొత్తం మరణాల్లో 58 శాతం కేసులు అదే కారణంతో నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ వాడకం, సిగ్నల్ జంపింగ్ ఉన్నాయి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, మైనర్లు వాహనాలు నడపడం వంటి వ్యక్తిగత నిర్లక్ష్యాలూ ప్రాణాల్ని మింగుతున్నాయి. రోడ్డు గుంతలు, వెలుతురు లేకపోవడం, మలుపుల వద్ద సైన్ బోర్డులు లేకపోవడం ఇవన్నీ మౌలిక సదుపాయాల లోపాలే అయినా దాని మూల్యం ప్రాణం.
సంఖ్యల వెనుక బాధ:
రోడ్డు ప్రమాదం అనేది కేవలం ఒక సంఘటన కాదు. అది ఒక కుటుంబం కూలిపోయిన కథ. ఆ కుటుంబం ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే, ఆ నష్టం సంఖ్యలతో కొలవలేము. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల వలన భారతదేశం ప్రతి సంవత్సరం తన స్థూల దేశీయోత్పత్తిలో 3 శాతం వరకు నష్టం చవిచూస్తోంది. అంటే ఇది కేవలం భద్రతా సమస్య కాదు, ఆర్థిక నష్టం కూడా.
భద్రత చట్టాల్లో కాదు – చైతన్యంలో ఉండాలి:
రోడ్డు భద్రత అంటే కేవలం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత కాదు. అది ప్రతి పౌరుడి సంస్కారం కావాలి.హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, వేగ పరిమితులు పాటించడం ఇవన్నీ చట్టాల భయంతో కాక, మన మనస్సుతో చేయాల్సినవి. ప్రభుత్వం పరంగా రహదారులపై స్పీడ్ గన్స్, సీసీ కెమెరాలు, డ్రంక్ డ్రైవ్ తనిఖీలు మరింత కఠినతరం కావాలి. మైనర్ల డ్రైవింగ్‌పై తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్సు జారీ విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా డ్రైవింగ్ ఒక బాధ్యతగా మిగలాలి.మౌలిక సదుపాయాల పరంగా రహదారి రూపకల్పనలో భద్రతే ప్రాధాన్యంగా ఉండాలి. మలుపుల వద్ద సైన్‌బోర్డులు, రాత్రివేళల్లో కనిపించే తెలుపు చారలు, సరైన వెలుతురు ఇవన్నీ ప్రాణాలను రక్షించే చిన్న కానీ కీలక చర్యలు.
అభివృద్ధి దారి భద్రతతోనే:
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రహదారులు, వాహనాలు, పరిశ్రమలు పెరుగుతున్నాయి. కానీ అదే వేగంతో రోడ్లపై ప్రాణాలు పోతున్నాయి. ప్రతి డ్రైవర్, ప్రతి పాదచారి తన బాధ్యత గుర్తిస్తేనే మార్పు మొదలవుతుంది. రోడ్లపై భద్రత లేకుండా అభివృద్ధి గమ్యం చేరదు. రోడ్లను కాంక్రీట్‌తో కాక, చైతన్యంతో బలపరచాలి. ఎందుకంటే, రోడ్డు మీద రక్తం చిందిస్తే, దేశం ముందుకు కదలదు.

8247045230





