మార్చి 14, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్
అపారమైన జల సంపద సముద్రాల పాలవుతుంటే, చుక్కనీరు కూడా త్రాగడానికి పనికి రాని పరిస్థితుల్లో సముద్రాల్లోకి పోతూ వృథాగా మారుతున్న జలసంపదను సంరక్షించి, మానవాళి ప్రయోజనాల కోసం వినియోగించాలి. ప్రపంచాన్ని నీటి కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. భారతీయ నగరాల్లో వేసవి వస్తే నీటి సంక్షోభం తారా స్థాయికి చేరుతుంది.సాగు నీటి సమస్య మాత్రమే కాకుండా అత్యవసరమైన త్రాగునీరు కూడా భూమిపై మృగ్యమయ్యే పరిస్థితులు దాపురించడం మానవ తప్పిదమే. ఎన్నో నదులు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నదులపై నిర్మించే ఆనకట్టలు పర్యావరణానికి నష్టం చేకూర్చరాదు. నదుల వలన భూతలం సస్యశ్యామలమై విరాజిల్లుతున్నది.నదులు నాగరికతకు,సంస్కృతికి ప్రతీకలు.మానవ నాగరికత నదుల వద్దే పరిఢవిల్లింది.జీవవైవిధ్యానికి,జీవ మనుగడకు నదుల సంరక్షణ అత్యంతావశ్యకం. పారిశ్రామిక వ్యర్ధాలతో, మానవ దుశ్చర్యలతో కలుషితమైపోతున్న నదులను శుభ్రంగా ఉంచడం,త్రాగునీటి సరఫరాకు,సాగునీటికి అనుకూలంగా నదులను సంరక్షించడం కోసం తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగడమే లక్ష్యంగా ప్రతీ ఏటా మార్చి 14 వ తేదీన ‘‘నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ’’ దినోత్సవం జరుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ప్రధాన ఎజెండా గా జరుగుతున్న అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవం నదుల పట్ల మానవ విధ్వంస కార్యకలాపాలను అరికట్టడానికి అవగాహన కల్పిస్తున్నది.నదులు జన జీవనాడులు. నదులను కాలుష్యం నుండి కాపాడడం మనందరి కర్తవ్యం భావించాలి.1997 మార్చి 14 వ తేదీన బ్రెజిల్ లోని కురిటిబా లో మొట్టమొదటి సారి నదుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ కార్యాచరణ సదస్సు జరిగింది.
‘‘మన నదులు- మన భవిత’’ ప్రధానాంశంగా ఈ ఏడాది జరుగుతున్న అంత ర్జాతీయ నదుల కార్యాచరణ వేదిక ప్రజలకు,అంతర్జాతీయ సమాజానికి, ప్రభుత్వాలకు విలువైన సందేశం అందించాలి. ముఖ్యంగా నదుల్లోని నీటిని సంరక్షించి,సాగు నీటికి, త్రాగునీటికి వినియోగించాలి.ఈ సకల చరాచర జగత్తులో జీవకోటి మనుగడకు ప్రాణాధారం ‘నీరు’. నీరు లేనిదే జీవరాశి మనుగడ దుర్లభం.అలాంటి నీటివనరులను తరిగి పోకుండా చూడడమే కాకుండా నేటి కలుషిత వాతావరణంలో మనకందరికీ పరిశుభ్రమైన నీరు విధిగా అందించవలసిన బాధ్యత ప్రపంచ సమాజంపై ఎంతైనా ఉంది. కలుషితాలతో నిండిన నీటి స్థానంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. కలుషిత నీటివల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలను రక్షించవలసిన గురుతరమైన బాధ్యత ప్రపంచ ఆరోగ్యసంస్థపైన, ప్రభుత్వాల పైన ఎంతైనా ఉంది. ఈనాటికీ ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందడం లేదు.ఇక ఇతర అవసరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.కొన్ని దేశాల్లో ఈనాటికీ సరైన త్రాగు నీరు లేదు.
సింగపూర్ లాంటి ధనిక దేశాలు నీటికోసం మలేషియా వంటి దేశాలపై ఆధారపడుతున్నాయి. భవిష్యత్తులో నీటిలభ్యత మరింత జటిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అనేక నదులున్నా, నదీజలాల వినియోగంలో చిత్త శుద్ధి లేక నిరుపయోగంగా మారుతున్నాయి. సముద్రాల్లోకి నదీజలాలు వృథాగా పోతున్నాయి.పెరిగిన జనాభాతో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరుగుతున్న పారిశ్రామీకరణ వలన జల వనరులు,జల మార్గాలు కూడా కాలుష్య భరితంగా మారుతున్నాయి.మానవ జీవితంలో నీరు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.నదుల ప్రాధాన్యత,నదుల పరిరక్షణ వంటి అంశాలపై కెనడాకు చెందిన నదుల పరిరక్షణ ఉద్యమకారుడు, రచయిత,వక్త మార్క్ ఏంజెలో ఆలోచనలు అమూల్యమైనవి. నీటి వనరుల యొక్క విశిష్ఠతను చాటి చెప్పడానికి, నదుల సంరక్షణ కోసం ప్రజల బాధ్యతను గుర్తు చేయడానికి,ప్రజల్లో నీటి వనరుల పట్ల అవగాహన పెంపొందించడానికి కృషి జరగాలి.
నదులు జన జీవన నాడులు. నదులు నాగరికతకు చిహ్నం. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత పరిఢవిల్లినట్లు, అభివృద్ధి జరిగినట్టు తేటతెల్లమవుతున్నది.నదుల గురించి అవగాహన కలిగించడం,నదుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి అనేక చర్యల ద్వారా జనజీవితాలకు,ఇతర జీవరాశులకు మేలు చేయడం కోసం బృహత్తర కార్యచరణతో ముందుకు సాగాలి. ప్రపంచంలో ఎన్నో నదులున్నాయి.నైలు నది, మిసిసిపి, హోయాంగ్ హో, అమెజాన్, కాంగోలు ప్రపంచంలో ప్రఖ్యాత నదులు.ప్రపంచంలో పొడవైన నది నైలునది,రెండవది అమెజాన్. ప్రపంచంలో మూడవ పొడవైన,ఆసియాలో మొదటి పొడవైన నది యాంగ్జీ.ఈజిప్టులో అధికశాతం ప్రజలు నైలునదీ పరివాహక ప్రాంతాల్లో జీవిస్తారు. నైలునదిని ‘‘ఈజిప్టు వరప్రసాదం’’ గా పిలుస్తారు.’’ఫాదర్ ఆఫ్ ఆఫ్రికన్ రివర్స్’’ గా పిలవబడే నైలునది 10 దేశాల గుండా ప్రవహిస్తుంది.చైనా దుఃఖదాయని గా హోయాంగ్ హో నది (ఎల్లోనది) పిలవబడుతున్నది.మిస్సోరి,మిసిసిపి,యూకోన్ నదులు అమెరికాలో పొడవైన నదులు. ఓల్గా, నేవా,ఓబ్ నదులు రష్యాలో ప్రముఖ నదులు.
ప్రపంచంలో ఒక్క నదికూడా లేని దేశం సౌదీ అరేబియా,ఖతార్ లో కూడా నదులు లేవు.భారత దేశం నదులకు పుట్టినిల్లు. 250 మిలియన్ల హెక్టార్ల ఆయకట్టు 10 కి పైగా ప్రధాన నదులకు చెందుతుంది.భారత దేశ నదీ వ్యవస్థ త్రాగునీటికి, సాగునీటికి, విద్యుత్, రవాణాకు అనుకూల మైనది.భారత దేశంలో గంగ, సింధు, గోదావరి, కృష్ణానదులు ప్రసిద్ధి చెందినవి. సింధునది అత్యంత పొడవైన నదిగా పేరొందినా, ఈ నదీ ప్రవాహం ఎక్కువగా పాకిస్తాన్ లో ఉంది. భారత దేశంలో గంగానది ఎక్కువ పరిధిని కలిగి ఉంది.పాక్ జీవనాడి సింధు నది.సింధునది వలన పాకిస్తాన్ సశ్యశ్యామలంగా మనగలుగుతున్నది.పాక్ ప్రజల త్రాగు నీటికి,సాగునీటికి,విద్యుత్ అవసరాలకు సింధునది ఆయువు పట్టు. సంవత్సవం పొడవునా ప్రవహించే నదులను జీవనదులు లేదా శాశ్వత నదులుఅంటారు. గంగ, యమున, తపతి, బ్రహ్మపుత్ర, నర్మద తదితర నదులన్నీ జీవనదులు.ఏ సముద్రం లోను కలవని నదిగా రాజస్థాన్ లోని లూనీ, బనాస్, రోపెన్ నదులు సముద్రంలో కలవని నదులుగా పేరుగాంచాయి. ఈ నదుల లోని నీరు ఇసుకలోనే ఇంకి పోతుంది.
ప్రతీ మనిషికీ త్రాగడానికి, ఇతర అవసరాలకు సరిపడా కనీస నీటిని కూడా మనం అందించ లేకపోతున్నాం. పరిశుభ్రమైన త్రాగునీరు అందిం చకపోవడమే నీటికారక వ్యాధుల విజృంభణకు మూల కారణం.మరో దశాబ్దం నాటికి నీటి అవసరాలు మరింత పెరుగుతాయి.మనకు నదులు, సరస్సుల రూపంలో నీటి వనరుల లభ్యత ఉంది. కాని అనేక రకాల కారణాల వల్ల మనం నీటివనరులను సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నాం. నీరంతా వృథాగా సముద్రం పాలవుతుండడం బాధాకరం. సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే దీనికంతటికీ ముఖ్య కారణం. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడమే కాకుండా సమీప భవిష్యత్తులో అందరికీ పరిశుభ్రమైన మంచినీటిని అందించి ప్రజలను రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా మన అడుగులు ముందుకు పడాలి.
ప్రజల త్రాగునీటి అవసరాలను సాకుగా తీసుకుని కొంతమంది రక్షిత మంచినీటి సరఫరాను పెద్ద వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా పుంఖానుపుంఖాలుగా, పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్న రక్షితనీటి సరఫరా విభాగాలపై ప్రభుత్వాలు కొరడా రaుళిపించాలి.శుద్ధ జలాల సరఫరా ప్రమాణాల ప్రకారం సక్రమంగా జరుగుతుందా లేదా పర్యవేక్షించేందుకు తగిన యంత్రాంగం నెలకొల్పాలి.జీవకోటి మనుగడ నీటిపైనే ఆధారపడి వుంది కనుక ఇలాంటి ప్రాణాధారమైన నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. విషరసాయనాలు, ఇతర కలుషిత పదార్ధాలు నీటిలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మానవాళి మనుగడను పదికాలాల పాటు భద్రంగా కాపాడుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రజల్లో పరిశుభ్రమైన నీటి వినియోగంపై అవగావన కలిగించడానికి శిక్షణా శిబిరాలు నిర్వహించాలి.ప్రజల్లో చైతన్యంకలిగించాలి. నదుల్లో ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి. ప్రపంచ నదుల పరిరక్షణకు పటిష్ఠమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరం. నదీజలాల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలను ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తూసుకోవాలి. నదులను కాలుష్య రహితంగా మార్చాలి.నదుల ప్రాధా న్యతను చాటిచెప్పడానికి ఉద్దేశించిన’’ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్’’ నదుల ప్రాధాన్యత గురించి అవగాహన కలిగించడంలో, నదులను సంరక్షించడంలో భవిష్య తరాలకు మార్గ నిర్ధేశనం చేయాలని ఆశిద్ధాం.
సుంకవల్లి సత్తిరాజు
సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్
9704903463