హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని అత్యుత్తమంగా సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. ఇది కేవలం లక్ష్య సాధన కాదని, రాష్ట్ర భవిష్యత్ జల సంరక్షణకు బలమైన పునాది వేయడమేనని పేర్కొన్నారు. సచివాలయం నుంచి స్పెషల్ సీఎస్ దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మిలతో కలిసి మంత్రి సీతక్క జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, సీఈవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీ జీ రాం జీ అమలు, జలసిరి పనులు, జీపీఎస్ఏపీ రూపకల్పనపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 7వ తేదీ నుంచి జిల్లాల వారీగా స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానన్నారు. ప్రతి జిల్లాలో పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, వీబీ జీ రాంజీ పరిధిలో ఉన్న 318 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా గుర్తించి వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామసభలే అభివృద్ధి కార్యాచరణకు కేంద్ర బిందువుగా ఉండాలని అన్నారు. తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంటు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలస్థాయిలో పనుల అమలు, పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కోసం మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీఓ, ఏపీఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ కమిటీ ప్రతి పనిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీబీ జీ రాం జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత వేగవంతంగా అమలు చేయాలని, జలసిరి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీతక్క ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణగా గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు ఫార్మ్ పాండ్, ప్రతి ఊరికి ఊట కుంట, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుని పనులను వేగంగా ప్రారంభించాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే ఈ కార్యక్రమం భవిష్యత్ నీటి భద్రతకు కీలకమన్నారు. గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జీపీ-ఎస్ఏపీను రూపొందించాలని మంత్రి సూచించారు.
త్వరలో హ్యామ్ రహదారుల పనులు
పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అందుకోసమే అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, ఈఎన్సీ జోగారెడ్డి, సీఈలతో కలిపి గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హ్యామ్ మోడల్‌లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అందులో మొదటి విడత కింద 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.మొదటి విడుతలో 90 శాతం పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల ఆదునీకరణ పనులకే ప్రధాన్యమిస్తున్నామని వెల్లడించారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బిటి, సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నందున మార్గదర్శకాలను అత్యంత సమగ్రంగా రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్బీఐ అనుమతుల వచ్చే వారంలోగా పూర్తి స్థాయిలో రానున్నాయని, ఆగస్టు 15 నాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రిమెంట్లు కాగానే కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించాలని, టెండర్లు దక్కించుకోవడంలో చూపిన ఉత్సాహం పనులు పూర్తి చేయడంలోనూ చూపాలని స్పష్టం చేశారు. పనులను సొంత బాధ్యతగా స్వీకరించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. గతంలో సింగిల్ రోడ్డు ఉన్న చోట కూడా ఇప్పుడు భారీ వాహనాలు వెళ్లేలా నాణ్యతతో రోడ్లను నిర్మించాలని తెలిపారు. పనుల్లో ఆలస్యం లేకుండా భూసమీకరణ, చెట్ల తొలగింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలన్నారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని, అటవీ భూములు ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు