రేవంత్ రెడ్డి పాలన ఒక దగా

– నీరు తెచ్చిన కేసీఆర్‌ను తూల‌నాడ‌టం త‌గునా?
– పోలీసు రాజ్యం అమ‌లు చేస్తున్నారు
– రైతుల‌కు త‌ప్ప‌ని యూరియా తిప్ప‌లు
– ఎవ‌రిని ఉరి తీయాలో ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి
– ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న కోరుకుంటున్నారు
– మాజీ మంత్రి కేటీఆర్

జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6 : రేవంత్ రెడ్డి పాలన ఒక దగా అని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ పచ్చి మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్పంచులు, వార్డ్ మెంబర్ల‌ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నాడు కరవుతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దితే సంతోషపడాల్సిందిపోయి కేసీఆర్ ను ఉరితీయాలి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉరి ఎందుకు తీయాలి.. రైతులకు రైతుబంధు, అక్కాచెల్లెళ్ల కళ్యాణ లక్ష్మి, రైతన్నకు రైతు బీమా పథకాలు ఇచ్చినందుకా అని ప్ర‌శ్నించారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను నడి వేసవిలో కూడా వాగులు వంకలు పొర్లే విధంగా నీరు తెస్తే కేసీఆర్ ను దుయ్యబట్టడం స‌రైన‌దేనా అని ప్రశ్నించారు. ఇది దగా రాజ్యం.. 420 హామీలు అమలు చేయలేదు, ఆరు గ్యారెంటీల జాడే లేదు. ప్రజలు కొట్టుమిట్టాడుతున్న పట్టించుకోలేని నిరంకుశ‌త్వ పాలన అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. అన్యాయమైన కేసులు పెట్టి పోలీసు రాజ్యం అమలు చేయడం తప్ప జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ హయాంలో రైతుకు ఎకరాకు రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తే నేడు ఆ సాయం కూడా అందించకపోవడం బాధాకరమన్నారు. తమ పాలన వచ్చిన తర్వాత ఎకరా ఒక్కంటికి రూ.15,000 అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది అంటూ నిల‌దీశారు. ఈ విషయంలో ఎవరిని ఉరితీయాలో రేవంత్ రెడ్డి ఆలోచిస్తే బాగుంటుందన్నారు. యూరియా దొరకడం లేదు.. రైతులకు లైన్లు తప్పడం లేదు.. రుణమాఫీ అంతంత మాత్రమే .. ఏ రైతు కూడా సంతోషంగా లేరని అన్నారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే అత్యధికంగా గెలవడం ప్రజలకు తమపై ఉన్న మమకారమేనన్నారు.

ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారన్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఎన్నికలు ఒకపక్క తమ అభ్యర్థులు గెలిస్తే తప్పుడు ప్రకటనలు చేస్తూ పబ్బం  గ‌డుపుకోవ‌డం ఇదెక్కడి న్యాయమన్నారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఇచ్చిన అభివృద్ధి నిధులే తప్ప ఇప్పుడు పట్టణాభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక్క పైసా అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు తిరిగి కెసిఆర్ ని ముఖ్యమంత్రి గెలిపిస్తేనే సాధ్యమన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని, ఇచ్చిన హామీల జాడేలేదని విమర్శించారు. కల్లబొల్లి కబుర్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ పాలన ప్రజలకు ఒర‌గ‌బెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాను అభివృద్ధి చేయడంలో తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ జనగామ జిల్లా సాధనలో నాటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులతోపాటు తాను కృషి చేయడం వల్లనే నేడు జనగామ జిల్లాగా ఏర్పడిందన్నారు. కడియం శ్రీహరి బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు  దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తారని సవాలు విసిరారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు అన్ని విధాలుగా బాగున్నారని కొనియాడారు. జనగామ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనే కావాలని కోరుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, ఇటీవల గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జ‌న‌గామ గులాబీమ‌యం

కేటీఆర్ రాకతో జనగామ గులాబీమయంగా మారింది. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల నుండి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు తరలి రావడంతో జనగామ జనంతో కిక్కిరిసింది. పెంబర్తి నుండి మొదలైన ర్యాలీ జనగామ ఆర్టీసీచౌరస్తా నుండి నెహ్రూ పార్కు మీదగా నెల్లుట్ల వరకు సాగింది. పుష్పగుచ్చాలు, బాణసంచాతోపాటు నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో జనం కేటీఆర్ కు రాజనాలు పలికారు. సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా మోటర్ బైక్లు, కార్లతో పురవీధులు కిక్కిరిపోయాయి. అనంతరం కన్వెన్షన్ హాలులో నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డ్ మెంబర్లను శాలువాలతో కేటీఆర్ సన్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page