“రెండేళ్ల పాలన ముగియగానే అసమ్మతి రాగాలు మొదలు కావడం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే పరిస్థితి సీనియర్లనుంచి ఎదురైంది. ఈ అసమ్మతిని కట్టడి చేయడం, పార్టీ అధిష్టానానికి కూడా తన విలువను తెలియజెప్పడానికి జూబ్లీ ఎన్నికను ఆయన ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఈ గెలుపుతో మరో మూడేళ్లపాటు తన ఆధిపత్యానికి ఎటువంటి ధోకా లేకుండా చేసుకోగలిగారు. ఇంతటి సమర్థతను గతంలో వైఎస్ఆర్‌లో మాత్రమే రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ ఎన్నికలో విజయం ద్వారా పార్టీలో రేవంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు తెలంగాణలో పార్టీకి తాను మాత్రమే దిక్కన్న సంగతిని హైకమాండ్ కు తెలియజెప్పారు… గెలిచింది ఒక్క ఉప ఎన్నికలో మాత్రమే, కానీ రేవంత్ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నారనే చెప్పాలి.. ”
తిరుగులేని నాయకుడిగా రేవంత్‌రెడ్డి!
జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం వల్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇమేజ్ పెరగడమే కాదు, రాష్ట్ర పార్టీపై మరింత పట్టు సాధించిపెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రేవంత్ పీఠానికి ముప్పు తప్పదన్న ప్రచారం కూడా బాగా జరిగింది. ఈ నేపథ్యంలో 25వేలకు పైగా వోట్ల మెజారిటీతో పార్టీ అభ్యర్థి అనీల్ యాదవ్ గెలుపు ఇప్పుడు రేవంత్ ఖాతాలో చేరుతుంది. అవసానదశలో ఉన్న పార్టీని ఏకంగా అధికారపీఠాన్ని ఎక్కించిన ఘనత ఒక ఎత్తయితే, అధికారంలోకి వొచ్చిన రెండేళ్ల తర్వతా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆయన పాలనాతీరుకు ఒక రెఫరెండంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆరుహామీల అమలు పూర్తిగా జరపలేక చతికిలపడినతీరు, పార్టీలో అసమ్మతి, సీనియర్ల అలకలు, బీఆర్ ఎస్ నుంచి విమర్శల దాడులు, పార్టీ హైకమాండ్ నుంచి తప్పని సరిలో అందుతున్న అంతంతమాత్రపు సహకారం వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ జూబ్లీ ఎన్నికలో గెలుపు ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా చేసిందనే చెప్పాలి. ఎన్నిక ఒక్క స్థానానికే అయినా రేవంత్‌కు ఇది చావో రేవో అన్నరీతిగా మారింది.
అందుకనే ఆయన ఈ ఎన్నికల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ అభ్యర్థి సునీతకు, మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ప్రజలనుంచి సానుభూతి వోట్లు పడకుండా చేయడం, బీఆర్ ఎస్ మైనారిటీ వోట్లను చీల్చడం, ఈ ప్రాంతంలో ఉన్న సినీ కళాకారులు, కమ్మ సామాజిక వర్గం వారిని అనుకూలంగా మలచుకోవడం, అన్నింటికీ మించి బీసీ అభ్యర్థిగా అనీల్ యాదవ్‌ను నిలబెట్టడం తన వ్యూహంలో భాగంగా ఆయన డివిజన్లలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు డివిజన్లలో ప్రచారం చేయడమేంటనే విమర్శలను ఖాతరు చేయలేదు. మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించడమే కాకుండా, ఫలితాల సాధనలో వారిని బాధ్యులుగా చేయడం మరోముఖ్యాంశం.
ముఖ్యంగా తాను కూడా ప్రచారంలో పాల్గొనడం ద్వారా, మంత్రులు తూతూ మంత్రంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మమ అనిపించడానికి వీల్లేకుండా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటమి పాలైతే సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు సంక్షేమ పథకాలు దూరమవుతాయని ఎప్పటికప్పుడు ప్రచారంలో వివరిస్తూ, కేటీఆర్, హరీష్‌రావులనుంచి ప్రభుత్వ పనితీరుపై ఎదురవుతున్న పదునైన విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కో గలిగారు. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య ప్రస్థావనను ముందుకు తెచ్చి సునీతకు ప్రజలనుంచి వొచ్చే సానుభూతిని అడ్డుకోగలిగారు. అంతేకాదు సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవితనే ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టిన చరిత్ర కేటీఆర్, హరీష్‌లదంటూ ప్రచారం చేశారు. ఇక్కడ గుర్తించాల్సిన మరో అంశమేమంటే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై రేవంత్, కేటీఆర్ ల మధ్య విభేదాలున్నాయంటూ, బీజేపీ నేతలు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ చేసిన విమర్శలను ప్రజలు పట్టించుకోకపోవడం.
ఈ నియోజకవర్గంలో సినీ కళాకారులు, కమ్మసామాజిక వర్గంవారు అధికం. టిక్కెట్లు పెంచుకోవడానికి ఓకే అంటూనే అదనపు ఆదాయంలో 20శాతం ప్రభుత్వానికి చెల్లించాలని షరతు పెట్టారు. సినీ కళాకారులకు రూ.10కోట్లు ఇస్తామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పుతానని హామీ ఇవ్వడంతోపాటు, చంద్రబాబు శిష్యుడిగా కమ్మసామాజిక వర్గంలో ఉన్న అభిమానాన్ని వోట్లరూపంలోకి మలచుకో గలిగారు. చివరి నిముషంలో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం ద్వారా బీఆర్ ఎస్ కు మైనారిటీ వర్గాల్లో ఉన్న బలాన్ని తగ్గించగలిగారనే చెప్పాలి.
అనీల్ యాదవ్ ఎంపికలో కూడా ఎంతో చాణక్యం ప్రదర్శించారు. మిగిలిన రెండు పార్టీలు ఓసీ అభ్యర్థులను నిలబెట్టగా తాను బీసీలకు అనుకూలమన్న సంకేతాన్ని ఈ ఎంపిక ద్వారా ప్రజలకు తెలియజెప్పగలిగారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం మంచి ఊపుమీద నడుస్తోంది. అనీల్ యాదవ్‌కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో మజ్లిస్ తరపున పోటీచేశారు. తర్వాత మజ్లిస్ నుంచి బయటకు వొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీచేసినా పెద్దసంఖ్యలో వోట్లను సంపాదించుకోగలిగారు. ఇప్పుడు మజ్లిస్ మద్దతు, కాంగ్రెస్ అండ, తన సొంత బలం వెరసి ఆయన ఎన్నిక నల్లేరుమీద నడక అయిందనే చెప్పాలి. కాబట్టి అనీల్ యాదవ్ ను ఎంపిక చేయడం రేవంత్‌కు కలిసొచ్చింది. అన్నింటికీ మించి ఈ నియోజకవర్గంలో గతంలో తిరుగులేని నాయకుడిగా మంచి పేరున్న పి. జనార్థనరెడ్డి పేరును అత్యంత చాకచక్యంతో ఉపయోగించుకోగలిగారు. పీజేఆర్‌ను కేసీఆర్ ఏవిధంగా దెబ్బతీసింది ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు. ఆయన కుటుంబానికి కేసీఆర్ వల్ల అన్యాయం జరిగిందన్న అంశాన్ని కూడా నియోజకవర్గ ప్రజల మెదళ్లలో గట్టిగా నాటగలిగారు.
రెండేళ్ల పాలన ముగియగానే అసమ్మతి రాగాలు మొదలు కావడం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే పరిస్థితి సీనియర్లనుంచి ఎదురైంది. ఈ అసమ్మతిని కట్టడి చేయడం, పార్టీ అధిష్టానానికి కూడా తన విలువను తెలియజెప్పడానికి జూబ్లీ ఎన్నికను ఆయన ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఈ గెలుపుతో మరో మూడేళ్లపాటు తన ఆధిపత్యానికి ఎటువంటి ధోకా లేకుండా చేసుకోగలిగారు. ఇంతటి సమర్థతను గతంలో వైఎస్ఆర్‌లో మాత్రమే రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ ఎన్నికలో విజయం ద్వారా పార్టీలో రేవంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు తెలంగాణలో పార్టీకి తాను మాత్రమే దిక్కన్న సంగతిని హైకమాండ్ కు తెలియజెప్పారు. ఇక పార్టీలో సీనియర్లు తోక జాడించకుండా అడ్డుకోగలిగారు.
బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్న త్రిశంకు స్వర్గం లాంటి పరిస్థితి నుంచి విముక్తి కలగవొచ్చు. రేవంత్ మరింత బలంగా మారిన నేపథ్యంలో స్పీకర్ విచారణ ఫలితం పార్టీకి అనుకూలంగా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్, హరీష్‌లు గతంలో మాదిరిగా బలంగా విమర్శించడం సాధ్యం కాదు. అంతేకాదు మేమే గెలుస్తామన్న స్థాయినుంచి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమే అన్న స్థాయికి బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్‌ను దించగలిగారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గెలిచింది ఒక్క ఉప ఎన్నికలో మాత్రమే, కానీ రేవంత్ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నారనే చెప్పాలి.
-ప్రజాతంత్ర





