రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు

– ఎనిమిది నెల‌లకు మించి శాఖాధిప‌తులను వుంచ‌డంలేదు
– త‌ర‌చుగా అధికార్ల మార్పుతో విద్యుత్‌ శాఖ అవినీత‌మ‌యం
– యువ క‌లెక్ట‌ర్ల‌లో దెబ్బతింటున్న నైతిక స్థ‌యిర్యం
– రిటైర్డ్ అధికారులను పొడిగించొద్దు
– ఇంజినీరింగ్ శాఖ‌లో వీరివ‌ల్ల‌నే య‌ధేచ్ఛ‌గా అవినీతి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: ఐఎఎస్, ఐపిఎస్ లను పూటపూటకు మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. చూస్తుంటే రేవంత్‌కు  పాలన రావడం లేదన్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ద‌న్నారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పనిచేయడం లేదు. విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారు.  ఈ బదిలీలతో విద్యుత్ శాఖ  అవినీతి మ‌య‌మైంద‌న్నారు. సింగరేణిలో, జిహెచ్ఎంసిలో ,విద్యాశాఖలో కూడా నలుగురు చొప్పున అధికార్లు మారారు. ఆరోగ్య శ్రీలో ఎనిమిదిమంది మారారు. పంచాయతీరాజ్ శాఖలో నలుగురు మారారు. మున్సిపల్ శాఖలో ఐదుగురిని మార్చారు. ఐటీ శాఖలో ముగ్గురు, మైనింగ్ శాఖలో ఆరుగురు మారారు. నేషనల్ హెల్త్ మిషన్ లో ముగ్గురిని మార్చారు. ఇట్లా మారిస్తే పాలన ఎలా నడుస్తుంద‌ని ప్ర‌శ్నించారు. 140మంది ఐఏఎస్ లను బదిలీ చేశారు. 20 మంది కలెక్టర్లను మార్చారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందన్నారు. కలెక్టర్ కు జిల్లాపై అవగాహన రావడానికే ఆరు నెలలు పడుతుంది. ఆరు నెలల లోపే మార్చిన కలెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కలెక్టర్లను ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థయిర్యం దెబ్బతింటోంద‌న్నారు. సీఎం, మంత్రులకు నచ్చితే మంచి పోస్టింగ్లు.. లేకపోతే బదిలీలు.. ఇదీ ప్ర‌భుత్వం తీరని విమ‌ర్శించారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడగింపు సాధారణం అయిపోయింద‌న్నారు. డజన్ మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పొడగింపు ఇచ్చారు. వందల మంది ఇంజినీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారు. బీఆర్ఎస్ హయంలో అధికారుల పదవీ కాలం పొడగింపు పై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. మ‌రిప్పుడు వాళ్ళు చేస్తున్నదేమిటని ప్ర‌శ్నించారు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారు. వీటన్నిటి వివరాలు త్వరలో బయటపెడతాన‌న్నారు. ఇంజినీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోంద‌న్నారు. తరచూ బదిలీ వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. కలెక్టర్లకు కనీసం రేండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయి .కేసీఆర్ హయాంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేయించారు .ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదు. తమ అక్రమాలకు అధికారులు సహకరించనందుకే  సీఎం వారిని బదిలీ చేస్తున్నారు. బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ బదిలీలు ,ఎక్స్టెన్షన్ పద్ధతి మంచిది కాదని పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిగా ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నామ‌న్నారు. విమర్శలుగా కాకుండా నిర్మాణాత్మక సూచనలు గా స్వీకరించాలని కోరుతున్నామ‌న్నారు. అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడ్నుంచి బదిలీ చేశారు. ఐటీ కార్యదర్శిగా సీ ఎస్ ఎలా పని చేయగలుతారు ? సీ ఎస్ కు బోలెడన్నీ భాధ్య‌తలు ఉంటాయి. అదనంగా ఐ టీ కార్యదర్శిగా ఎలా భాద్యతలు నిర్వర్తిస్తారు ? 20 శాతం జీవోలు ఆన్ లైన్ లో ఉంచుతున్నారు ..80 శాతం జీఓలు ఆఫ్ లైన్లో ఉంచుతున్నారు. మా ఎర్రోళ్ల శ్రీనివాస్ హై కోర్టుకు వెళితే నాలుగు వారాల్లో జీవోలు ఆన్ లైన్లో పెట్టాలని  కోర్టు ఆదేశించినా జీవోలు ఆన్ లైన్ లో పెట్టడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ జీవోలపై ఏం మాట్లాడింది ? ఇపుడేం చేస్తున్నారు. వరంగల్ ఎంజిఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైంద‌ని ఎద్దేవా చేశారు. తాము నిర్మించిన‌ మార్చురీ లను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదు. ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్ల కు ఓ నీతి ? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓ నీతా ? అంతా జోక్ అయిపోయింద‌న్నారు. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టుపట్టించారు. అసెంబ్లీ అసెంబ్లీలా లేదు హౌజ్ కమిటీలు వేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదు. చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉంది .. అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేద‌న్నారు.

రేవంత్ మేన‌ల్లుడి అక్ర‌మ మైనింగ్‌

రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్ కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్ లో పెట్టారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలి. లెటర్ లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోంది. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారు. అక్కడ రెడీమిక్స్ కు పర్మిషన్ లేదు. పటాన్ చెరు ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారు. దాదాపు 8 నుంచి 9 పర్మిషన్లు తీసుకోవాలి. ఓ ఆర్ ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉంది. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్ లో మైనింగ్ దందా నడుపుతున్నద‌ని ఆరోపించారు. రేపు నిజనిర్ధారణ కోసం బిఆర్ఎస్ బృందం వెళ్తుంది. ఖమ్మంలో ఇళ్ళు కూలగొట్టి జాగా ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేగలుగుతున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి. రేపటివరకు వేచి చూద్దామ‌న్నారు. నేను మంత్రిగా వున్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చాను. జర్నలిస్టులకు పెట్టిన 16 కోట్ల బడ్జెట్ కు ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పాలసీని వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారు. పాలసీ బాగుంటే ఎందుకు మాయం అయింది. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదు. ఎడ్యుకేషన్ కమీషన్ రిపోర్టుపై బిఆర్ఎస్ మొదట మాట్లాడింది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సఫలం అవుతోంది. మా ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం వివిధ అంశాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింద‌ని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *