- పాలమూరు-రంగారెడ్డిపై నిర్లక్ష్యం
– జిల్లా ప్రజలు రేంవత్‌ను క్షమించరు
– ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు
– ‘జాగృతి జనంబాట’లో కవిత డిమాండ్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను సందర్శించి కవిత మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని.. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని క్షమించరని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన కవిత ప్రజలతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణానది అని కొనియాడారు. తెలంగాణ సిద్దించిన తర్వాత అలాంటి కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగిందని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేల్ళైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగూ ముందుకుపడలేదని విమర్శించారు. ఉదండాపూర్, కరివెనలో ఒక త్టటెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్లపూర్- ఏదుల టన్నెల్ పనులను చేయటం లేదన్నారు. ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదని.. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. తక్షణమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలనికవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఉదండాపూర్ నిర్వాసిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని, పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందేనని అన్నారు. తప్పు బీఆర్‌ఎస్ చేసిందా? కాంగ్రెస్ చేసిందా? అని కాదని, ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. జనంబాటలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని చెప్పారు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారని ఆనాటి రోజులను గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సమస్యలను అధిగమించామని చెప్పారు. కృష్ణా నీళ్లను వినియోగించుకోవాలని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారని తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. రేవంత్ రెడ్డి గెలిచి రెండేళ్లు అయ్యిందని చెప్పారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వటానికి ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





