– సింగరేణి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు
– మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ నేతలు కొప్పుల, సుమన్
హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 9: బీజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్ మీట్‌లో వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించాం.. సింగరేణిలో కారుణ్య నియామకాలు, జీవో 76 కింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేసీఆర్ కృషి ఉందన్నారు. గనుల వేలానికి సంబంధించిన ఎంఎంటీఆర్ బిల్లును తాను ఎంపీగా వ్యతిరేకించానని, ఆ చట్టానికి వ్యతిరేకంగా లోక్‌సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసిందని గుర్తు చేశారు. వేలం పాట పెడితే సింగరేణి నష్టపోతుందని ఆనాడే రాజ్యసభలో తమ పార్టీ తరపున కేశవరావు మాట్లాడిండు.. సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని సిరుల గనిగా ఉంచగా కాంగ్రెస్ వచ్చిన తరువాత కుంభకోణాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తో టెండర్ లో కుంభకోణం చేశారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు రూ.1600 కోట్ల కుంభకోణం జరిగిందని సుమన్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సింగరేణిలో రూ16 వేల కోట్ల కుంభ కోణాలు జరిగాయన్నారు. తమ నాయకుడు హరీష్ రావు బొగ్గు నిల్వ చూసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత సింగరేణిలో డీజిల్ కుంభకోణానికి తెరలేపారని, పంపకాలలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంచాయితీ రావడంతో నైని బొగ్గు బ్లాక్ టెండర్ ను రద్దు చేశారని వ్యాఖ్యానించారు. బడే భాయ్, చోటే భాయ్ మధ్యలో మిడిల్ భాయ్ కిషన్ రెడ్డి.. అందరూ కలిసి సింగరేణిని ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద కేంద్ర బృందాన్ని పంపారు.. మరి సింగరేణిలో కుంభకోణాలపై కేంద్ర బృందం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారన్నారు. హరీష్ రావు సింగరేణి కుంభకోణం ఆధారాలతో బయటపెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ అవినీతి కిషన్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదన్నారు. అన్ని ఓపెన్ కాస్ట్ గనులను సింగరేణికే అప్పగించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓపెన్ కాస్ట్ బ్లాక్ లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





