అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి

– ‘బ్రిక్స్‌’ దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలి
– భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా
– ప్రారంభమైన ఏసీడబ్ల్యూజీ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : సుస్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధికి అవినీతి ప్రధాన ఆటంకంగా ఉందని ‘బ్రిక్స’ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్(ఏసీడబ్ల్యూజీ) సమావేశం అభిప్రాయపడింది. పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి, అక్రమ ఆస్తుల రికవరీలో ‘బ్రిక్స’ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించింది. రెండు రోజులు నిర్వహించే ఈ సమావేశాలు హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభం కాగా భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి అనే సవాలుకు ఏ దేశమూ మినహాయింపు కాదని, ఏ దేశమూ దీన్ని ఒంటరిగా ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. అక్రమ ఆర్థిక మళ్లింపులను నివారించి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సమష్టిగా, సమన్వయంతో కూడిన, నిరంతర అంతర్జాతీయ సహకారానికి ఆమె పిలుపునిచ్చారు. సమగ్రత, జవాబుదారీతనం, అంతర్జాతీయ సహకారం, ఆవిష్కరణల బలోపేతం అత్యంత ముఖ్యమైనవిగా మారిన ఈ సమయంలో బ్రిక్స్ ఏసీడబ్ల్యూజీ రెండో సమావేశం జరుగుతోందని రచనా షా తెలిపారు. సీమాంతర అవినీతిని ఎదుర్కోవడంపై తన ఉమ్మడి బాధ్యతను బ్రిక్స్ ఆచరణాత్మక సహకారంగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చాలన్నారు. నేరాల నుంచి లబ్ధి పొందే వారికి ఏ దేశమూ ఆశ్రయంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు సహకరించడం, దొంగిలించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నేరస్తులు, అక్రమ నిధులు సరిహద్దులు దాటి తరలిపోవడానికి అవకాశం కల్పిస్తున్న లోపాల తొలగింపులో బలమైన సహకారానికి ఆమె పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణలతో పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు సహకరించేందుకు ఏర్పాటు చేసిన అనధికారిక సహకార బ్రిక్స్ భాండాగారం విషయంలో సాధించిన పురోగతిని స్వాగతించారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితుల విషయంలో, వారి అప్పగింతకు మద్దతు ఇచ్చేందుకు, బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్‌పై జరుగుతున్న చర్చలను, బ్రిక్స్ అసెట్ రికవరీ నిపుణుల నెట్‌వర్క్ కార్యకలాపాలు ప్రారంభించటాన్ని కూడా స్వాగతించారు. సమాచార మార్పిడి కోసం రూపొందించిన ప్రామాణిక టెంప్లేట్, స్థానిక నోడల్ పాయింట్లు, నిపుణుల డైరెక్టరీతో కలిసి చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య వేగవంతమైన, మరింత ప్రత్యక్షమైన, అత్యంత ప్రభావవంతమైన సహకారాన్ని సులభతరం చేస్తాయన్నారు. నివారణాత్మక అప్రమత్తత, సాంకేతికత ఆధారిత పరిపాలనకు పెద్దపీట వేస్తూ అవినీతి ముప్పును ఎదుర్కొనే పరిష్కారంలో సాంకేతికతే కీలకమని కార్యదర్శి అన్నారు. డిజిటల్ గుర్తింపు, ఎలక్ట్రానిక్ సేవలందించే విధానం, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక కొనుగోలు వ్యవస్థలు వృథాను తగ్గించగలవని, అధికారుల విచక్షణాధికారాలకు కళ్లెం వేయగలవని, ప్రజా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయగలవని పేర్కొన్నారు. దేశ జాతీయ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ అయిన గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్(జీఈఎం), ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలను సాంకేతికత ఆధారిత సంస్కరణలకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. పన్నుల విధింపు, ఇతర ప్రభుత్వ ప్రక్రియల్లో ముఖ రహిత, కాగిత రహిత విధానాలు, సాంకేతికతతో కూడిన నిఘా, డేటా ఆధారిత పర్యవేక్షణ, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను కూడా ఆమె ప్రస్తావించారు.

నైతిక పరిపాలనపై సమాంతర కార్యక్రమం

విస్తరించదగిన విజిలెన్స్ పద్ధతులు, సాంకేతికత ఆధారిత పరిష్కారాలు, నివారణాత్మక పర్యవేక్షణా విధానాలపై సభ్యులు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తుందని రచనా షా తెలిపారు. అవినీతికి పాల్పడి పరారైన నేరస్థుల అన్వేషణ, నేరస్థుల అప్పగింతకు మద్దతు ఇచ్చే అనధికారిక సహకారంపై బ్రిక్స్ రిపాజిటరీ, బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్, బ్రిక్స్ అసెట్ రికవరీ నిపుణుల నెట్‌వర్క్ రెండో సెషన్‌లో చర్చలు జరగనున్నాయి. ‘నవకల్పనలు, సాంకేతికత ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాలన’పై ఒక సమాంతర కార్యక్రమం, ‘ఆర్థిక సాంకేతికత(ఫిన్‌టెక్), వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏలు) నుంచి ఎదురవుతున్న అభివృద్ధి చెందుతున్న ముప్పులు, అవినీతి ద్వారా వచ్చిన సొమ్మును దాచడంలో, లాండరింగ్ చేయడంలో వాటి దుర్వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక సెషన్ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రారంభోత్సవంలో బ్రిక్స్ ఏసీడబ్ల్యూజీ చైర్మన్ జె.అశోక్ కుమార్ ప్రతినిధి బృందాలకు స్వాగతం పలికారు. వారి నిరంతర భాగస్వామ్యానికి, నిర్మాణాత్మక సహకారానికి, పరస్పర సహకార స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని నెలల్లో సాధించిన పురోగతి, నిరంతర చర్చల విలువ అవినీతి నిరోధక సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం బలోపేతానికి ఆచరణాత్మక సాధనాలు, విధానాలను అభివృద్ధి చేయడంపై ఏసీడబ్ల్యూజీ దృష్టి సారించిందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *