ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా
హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత దిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి..ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తోపాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే కీలక నేతలు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు.
మరోవైపు సినీ, పారిశ్రామిక రంగాల పలువురు ప్రముఖులు సైతం విచ్చేశారు. 27 ఏళ్ల తర్వాత దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరిన రేఖా గుప్తా.. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆమె రామ్‌లీలా మైదానానికి చేరుకొని, అందరినీ పలకరించారు. ఈ కార్యక్రమానికి సాధువులు, పలువురు ప్రముఖులు హాజరు కావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కొత్త సీఎంకు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించనున్నారు.
18వ మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు..
హరియాణాలోని జులానాలో 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా.. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకొని కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీశ్‌గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
అనంతరం దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఫ్‌ు మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవిని చేపట్టిన 18వ అతివగా రేఖా గుప్తా నిలిచారు.





