అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్న రేవంత్

– మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాbచందర్ రావు మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి దిల్లీకి 71సార్లు వెళ్లారని, 15సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. రేవంత్ మాటలు చెప్పడంలోనే కాదు, అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్‌మెంట్, మెట్రో అంశాలపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఐదుసార్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మÖడుసార్లు కలవడమే కాక హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమయ్యారని, ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇప్పించడం లేదంటూ ఆయనపై ఆరోపణలు చేయడం రాజకీయ నాటకం, బూటకమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని రామచందర్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని, అలాగే 420 హామీలను కూడా గాలికొదిలేసిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థుల చదువులకు దూరమవుతూ భవిష్యత్తు భారంగా మారుతోందన్నారు. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు లేక ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందని, గురుకులాల పరిస్థితి దయనీయంగా మారి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవని, పెన్షన్లు సక్రమంగా అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా అమలు కాలేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర సమస్యలున్నాయని, ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.

మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం

కాంగ్రెస్ పార్టీకి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆసక్తి లేదని, ఆ పార్టీకి కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని రామచందర్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్‌లను ఇప్పటివరకు కేంద్రానికి సమర్పించలేదన్నారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం ముమ్మాటికీ అవాస్తవమని, కేంద్రం మెట్రో ఫేజ్-2కు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ఆలస్యం మాత్రమేనని తేల్చి చెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో ఫేజ్-1ను ప్రధాని మోదీ ప్రారంభించారని, ఫేజ్-2కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది కూడా కేంద్రమేనని చెబుతూ మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం గానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కేంద్రం రూ.13 లక్షల కోట్లకు పైగా సహకారం అందించిందని, కేంద్రం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. అహంకారాన్ని పక్కనపెట్టి తెలిసిన వారి సలహాలు తీసుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

బీజేపీలో చేరిన సినీ, టీవీ రంగాల ప్రముఖులు

సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులవడానికి కారణమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *