మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో మహా మేధావి, అపరచాణక్యుడు అయిన పీవీ ఏ పదవి చేపట్టినా అది ప్రజల పక్షంగానే ఉండేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజల మనిషిగానే పనిచేశారన్నారు. కవి, రచయిత, అనువాదకుడు, కథకుడు, పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారన్నారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి అని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి సేవలను కాంగ్రెస్ విస్మరించినా మోదీ సర్కారు ఆయనను భారత రత్న పురస్కారంతో గౌరవించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.