అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన
న్యూధిల్లీి, జూన్ 26: ‘ఆగ్జియోమ్ మిషన్ 4’లో భాగంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లాకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల క్రితం రాకేశ్‌శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు చేస్తున్న ప్రయాణం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని, 14 రోజుల ఈ ప్రయాణం విజయవంతమై అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ‘ఆగ్జియోమ్ మిషన్ 4’లో భారత్ ప్రాతినిధ్యం వహించడం అంతరిక్ష రంగంలో భారతదేశం ఎదుగుతున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమేనంటూ గత పదేళ్లుగా అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా చేస్తున్న ప్రయోగాలు విజయవంతమవుతున్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించేలా ఈ ప్రయోగం నిలవనుందన్నారు. శుభాన్షు శుక్లాతోపాటు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న హంగేరీ, పోలండ్, అమెరికా దేశ వ్యోమగాములకు కూడా కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.