– కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా కోసం పోరాటం
– ఎత్తిపోతల పథకాలతో హుజుర్‌నగర్, కోదాడలు సస్యశ్యామలం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: కృష్ణా, గోదావరి జలాశయాలలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పోరాటం చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం జానపహాడ్, బెట్టే తండా ఎత్తిపోతల పధకాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంప్రదింపులతో కేటాయింపులు జరగకుంటే న్యాయపరంగా పోరాడి న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. ఇది రైతుపక్షపాత ప్రభుత్వమని, వారి ఉన్నతి కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలకులు చేసిన పాపానికి ప్రభుత్వం సంవత్సరానికి రూ.16 వేల వడ్డీలు చెల్లించాల్సి వస్తున్నదని మంతి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆయకట్టు, జనాభా ఆధారంగా నీటి కేటాయింపుల కోసం పోరాడుతున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38 వేల కోట్ల వ్యయంతో తుమ్మడిహట్టి వద్ద డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ చేవెళ్ల-ప్రాణహిత పేరుతో ప్రాజెక్టును నిర్మిస్తే కమిషన్ల కక్కుర్తితో బి.ఆర్.ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును అదే తుమ్మడిహట్టి వద్ద నిర్మిస్తే రూ.62 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలి ఉండేవని ఆయన తెలిపారు. ఆ డబ్బులతో ఎస్.ఎల్.బి.సి, పాలమూరు రంగారెడ్డి, భీమా ,నెట్టెంపాడు, కోయిలసాగర్, దేవాదుల,సీతారామ, గౌరెల్లి వంటి ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖామంత్రిగా తాను గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ రావడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా ఖరీఫ్, రబీ సీజన్‌లను కలిపి రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిరచామన్నారు. ఇది యావత్ భారత దేశంలోనే ఆల్ టైం రికార్డ్‌గా ఆయన అభివర్ణించారు.
కాంట్రాక్టర్‌పై గరం…గరం
జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పధకం పనులు వేగవంతంగా జరగడం లేదంటూమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఏజెన్సీ నిర్వహకుల పై మండిపడ్డారు. స్వయంగా తాను మూడుసార్లు తనిఖీలు నిర్వహించినా పనులు ముందుకు సాగడం లేదంటూ తీవ్రంగా మందలించారు. డిజైన్‌లో మార్పులు అవసరం అయితే సి.డి.ఓ (సర్క్యూలర్ డీజైన్ ఆపరేషన్ ) ద్వారా చేసుకోవచ్చని ఆయన సూచించారు.