దిల్లీ, నవంబర్ 28 : కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక.. చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు.. ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాలీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 వోట్లతో ఉన్న రాహుల్ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె అధిగమించారు.
ఉభయ సభలు నేటికి వాయిదా
పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. దాంతో ముందుగా ఉభయసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పునఃప్రారంభమైన తర్వాత కూడా ఉభయసభల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో సభలు రెండు రేపటికి వాయిదాపడ్డాయి. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారాలు చేశారు. వాయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా, నాందేడ్ ఎంపీగా రవీంద్ర వసంత్‌రావు చవాన్ ప్రమాణం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టబట్టడంతో రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా పడింది.
మీ పద్ధతి అస్సలు బాగాలేదు
ప్రతిపక్ష నేతలపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆగ్రహం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి మూడు రోజులైంది. మూడు రోజుల నుంచి ఉభయసభలను అమెరికాలో అదానీ సంస్థపై కేసుల అంశం కుదిపేస్తోంది. అదానీ సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో సభలు వాయిదాపడుతూ వొస్తున్నాయి. గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో పెద్దల సభను వాయిదా వేసే ముందు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఛాంబర్ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువని, సభ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని ధన్‌కర్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపై చర్చలు జరగాలని అన్నారు. పార్లమెంటరీ వివాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.