– ప్రమాదంపై అధికార్లతో సమీక్ష
– మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్‌కు పరామర్శ
– గాయపడిన మెడికోలకు ధైర్యం చెప్పిన ప్రధాని
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. శుక్రవారం అహమ్మదాబాద్ చేరుకున్న ఆయన ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. విమానం కుప్పకూలిన ఆనవాళ్లను మోదీ నిశితంగా పరిశీలించారు. అనంతరం మోదీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్‌ను ప్రధాని పరామర్శించారు. ఆతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.
అనంతరం మాట్లాడుతూ ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలననంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లో చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో 169 మంది భారత పౌరులు కాగా.. 53 మంది బ్రిటన్‌వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు.ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపాణీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇక, ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలిన సంగతి తెలిసిందే. దీంతో అందులోని 24 మంది మృత్యువాత పడ్డారు.