అనారోగ్యానికి అడ్డుకట్ట… ఆరోగ్య రక్షణలో దిక్సూచిగా యోగా

“జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మార్చి 13తో మొదలవుతోంది. ఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన, శాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణం. దైనందిన యోగ సాధనను ఆరంభించేలా, లేదా గతంలో మానేసిన యోగ సాధనను తిరిగి మొదలుపెట్టేలా.. ఈ వంద రోజులూ మనకు స్ఫూర్తినివ్వాలి. కుటుంబ సభ్యులూ, మిత్రులూ, మన ఇరుగూపొరుగూ ఒక జీవన విధానంగా యోగాను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇదే సరైన తరుణం.”

-ప్రతాపరావు జాదవ్

సంప్రదాయ ఆరోగ్య పద్ధతిగానే కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానంగా కూడా గత దశాబ్ద కాలంగా యోగా విస్తృత గుర్తింపును పొందుతోంది. శాస్త్రీయంగానూ దీనికి రుజువులున్నాయి. దేశ సాంస్కృతిక వారసత్వంగానే కాదు.. ప్రజారోగ్య రంగంలో శక్తిమంతమైన సాధనంగా యోగాను అవగతం చేసుకోవడానికి వైజ్ఞానిక పరిశోధనలు, డిజిటల్ ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారం వంటివన్నీ విశేషంగా దోహదం చేస్తున్నాయి. సంప్రదాయ వైద్యం (యోగా) కోసం డబ్ల్యూహెచ్‌వో అనుబంధ కేంద్రంగా మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై) ఎంపికవగా.. మరోసారి 2025 – 2029 కాలానికి దీన్ని పునరుద్ధరించారు.  యోగా పరిశోధనలో భారత అగ్రగణ్యతను ఇది స్పష్టం చేస్తోంది.  అసాంక్రమిక వ్యాధుల  నివారణ  కోసం  శాస్త్రీయ ఆధారాలతో కూడిన యోగా పద్ధతులను ప్రోత్సహించడంలో సంస్థ ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. ఆయుష్ మంత్రిత్వ శాఖ, దిల్లీ  ఎయిమ్స్, లేడీ హార్డింజ్ వైద్య కళాశాల, కేంద్ర యునానీ ఔషధ పరిశోధన మండలి, దిల్లీలోని న్యూక్లియర్ ఔషధ – అనుబంధ విజ్ఞాన  శాస్త్రాల సంస్థ ఈ కృషిలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ సంస్థలన్నింటి సహకారంతో మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి సంబంధిత రుగ్మతల్లాంటి అసాంక్రామిక వ్యాధుల నివారణ కోసం యోగా ఆధారిత విధానాలపై ఈ కేంద్రం సాంకేతిక మార్గదర్శకాలను రూపొందించడంతోపాటు పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నాయి. యోగాకు శాస్త్రీయ ప్రాతిపదికలను మరింత బలోపేతం చేయడమే కాకుండా  ముందుస్తు  ఆరోగ్య  సంరక్షణ దిశగా శాస్త్రీయ  ఆధారాలున్న,  తక్కువ వ్యయంతో, విస్తృతంగా అమలు చేయదగిన సాధనంగా యోగా సమర్థతను ఇది చాటుతోంది. సంస్థాగతంగా యోగా శాస్త్రీయ ప్రాతిపదికలను ఎండీఎన్ఐవై మరింత బలోపేతం చేస్తోంది. శరీర ధర్మశాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, బయోమెకానిక్స్, మనో విజ్ఞాన శాస్త్ర పరిశోధన ప్రయోగశాలల ద్వారా.. యోగా వల్ల కలిగే మనో–  శారీరక, జీవ రసాయన మార్పులనూ, వృద్ధాప్య ప్రక్రియలో యోగా పాత్రనూ, జీవనశైలి సంబంధిత రుగ్మతలపై యోగా ప్రభావాన్నీ ఈ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో సంప్రదాయ విజ్ఞానాన్ని అనుసంధానించడంలో భారత్ అంకితభావానికి ఇది నిదర్శనం.

వైజ్ఞానిక ఆధారాలున్న పద్ధతులను నేరుగా ప్రజల దైనందిన జీవితాల్లోకి తీసుకెళ్తూ.. డిజిటల్ వేదికలు యోగా పరిధిని మరింత విస్తృతపరిచాయి. యోగా ప్రామాణికతనూ, చికిత్సా విలువలనూ కాపాడుతూనే, విస్తృతంగా దాన్ని ప్రజలకు ఎలా చేరువ చేయవచ్చో ఎమ్–యోగా మొబైల్ అప్లికేషన్, వై బ్రేక్ ప్రొటోకాల్  వంటి కార్యక్రమాలు  నిరూపిస్తున్నాయి.   ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో రూపొందించిన ‘ఎమ్–యోగా’ను ఇప్పటికే 1.1 లక్షల మందికి  పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.   అందుబాటులో ఉండే డిజిటల్ ఆరోగ్య సాధనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోంది. అదేవిధంగా ‘వై–  బ్రేక్’ కార్యక్రమం రోజూ  పనివేళల్లో  5 నుంచి 10 నిమిషాల యోగా విరామ సమయంగా కేటాయించేలా ప్రోత్సహిస్తోంది.  ఇప్పటికే 33 లక్షలకు పైగా ప్రభుత్వాధికారులు ఇందులో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమాల ద్వారా వెలువడుతున్న పరిశోధన ఫలితాలు, ప్రజల భాగస్వామ్య గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా వై–బ్రేక్ పద్ధతులను పాటించడం వల్ల కొన్ని వారాల్లోనే మానసిక ఒత్తిడి 40 శాతం వరకు తగ్గుతున్నట్టు వెల్లడైంది. మానసికంగా చురుగ్గా ఉండడం, భావోద్వేగ స్థిరత్వం, నిర్ణయాత్మక సామర్థ్యం మెరుగుపడడంతోపాటు.. కార్టిసాల్ స్థాయి వంటి శారీరక సూచీల్లోనూ సానుకూల మార్పులు వస్తున్నట్టు అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. మెడ, భుజం, నడుము నొప్పి తగ్గడం, ప్రాణాయామం ద్వారా శ్వాస సామర్థ్యం మెరుగుపడడం, మొత్తంగా జీవశక్తి పెరగడం వంటి శారీరక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. స్క్రీన్లను చూస్తూ గంటల కొద్దీ ఒకేచోట కూర్చుని ఉండే నేటి పని వాతావరణాల్లో ఇవి అత్యంత ఆశాజనకమైన ఫలితాలనే చెప్పాలి. ‘వై–బ్రేక్’ కార్యక్రమం  వల్ల గైర్హాజరీ  తగ్గడంతోపాటు  ఉద్యోగుల నైతిక స్థైర్యం పెంపొందుతోంది. అలాగే పని – జీవనం మధ్య  ఆరోగ్యకరమైన  సమతౌల్యం మెరుగుపడుతోంది.  వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు  సంస్థాగత  శ్రేయస్సునూ పెంపొందించడంలో యోగా సమర్థతకు ఇది నిదర్శనం.

మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, కేంద్ర యోగా – ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ ప్రాకృతిక చికిత్సల సదస్సు – 2026’ సందర్భంగా.. శాస్త్రీయ ధ్రువీకరణల ప్రాధాన్యాన్ని కూడా నిపుణులు ప్రముఖంగా ప్రస్తావించారు. కచ్చితమైన పరిశోధనలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, పటిష్టమైన డిజిటల్ భాగస్వామ్యం ద్వారా.. ఆధునిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలతో యోగాను ఏకీకృతం చేయాలనీ, తద్వారా స్పష్టమైన ఫలితాలను సాధించగలమనీ నిపుణులు స్పష్టం చేశారు.

ప్రపంచం యోగాను చూస్తున్న తీరు గణనీయంగా మారుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యోగా ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్య సాధనం మాత్రమే కాదు.. ప్రజారోగ్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల మార్గం కూడా. విజ్ఞానంతోనూ, సాంకేతికతతోనూ సంప్రదాయాన్ని మేళవించడం ద్వారా.. ప్రపంచ యోగా క్రాంతికి ఇది చోదక శక్తిగా నిలుస్తోంది. తద్వారా అంతర్జాతీయంగా ఆరోగ్య రంగంలో ముందంజలో నిలిచేలా భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తోంది.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మార్చి 13తో మొదలవుతోంది. ఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన, శాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణం. దైనందిన యోగ సాధనను ఆరంభించేలా, లేదా గతంలో మానేసిన యోగ సాధనను తిరిగి మొదలుపెట్టేలా.. ఈ వంద రోజులూ మనకు స్ఫూర్తినివ్వాలి. కుటుంబ సభ్యులూ, మిత్రులూ, మన ఇరుగూపొరుగూ ఒక జీవన విధానంగా యోగాను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇదే సరైన తరుణం.

యోగాను మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. సామాజిక సంక్షేమాన్నీ, సంస్థాగత సామర్థ్యాన్నీ, సామాజిక సామరస్యాన్నీ పెంపొందించిన వాళ్లమవుతాం. నేడు పరిశోధనలు, సాంకేతికత, అంతర్జాతీయ సహకారం ద్వారా భారత్ నిశ్చయాత్మకంగా మరో అడుగు ముందుకేస్తోంది. కాలాతీతమైన యోగ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా ధ్రువీకరించి.. ఆరోగ్యానికీ, సమతౌల్యానికీ, శ్రేయస్సుకూ ఒక సుస్థిరమైన సార్వజనీన మార్గంగా నిలుపుతోంది.

 (రచయిత కేంద్ర ఆయుష్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *