– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము
– కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 4: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని 356వ అధికరణలోని క్లాజ్ (2) ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వొచ్చినట్టు తెలిపారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడకడంతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గతేడాది రాజీనామా చేశారు. దీంతో తొలుత 6 నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించి మరోసారి దానిని పొడిగించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 62 ఏళ్ల ఖేమ్‌చంద్ మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మణిపూర్ రాజకీయాల్లో బీజేపీ కీలక నేతగా ఖేమ్‌చంద్ పేరు తెచ్చుకున్నారు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంఫాల్ వెస్ట్‌లోని సింజ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 మార్చి నుంచి 2022 మార్చి వరకూ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వంలో రెండోసారి క్యాబినెట్ మంత్రిగా సింగ్ నియమితులయ్యారు. మున్సిపల్ పాలనా వ్యవహారాలు, హౌసింగ్ డెవలప్‌మెంట్, గ్రాణాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్యా శాఖలను నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే వరకూ ఆ పదవులను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





