– 25న మంత్రి పొంగులేటి శ్రీకారం
– కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి
– ఒకే వేదికపైకి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం
– పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ‘ప్రజా పాలన’ శకం
పాలేరు/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని నిజం చేస్తూ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సరికొత్త సంప్రదాయానికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీకారం చుట్టారు. సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, అధికారులనే ప్రజల వద్దకు తీసుకువచ్చేలా క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. సామాన్యులు తమ సమస్యల కో సం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా అధికారులందరినీ ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయిలో ‘ప్రజా దర్బార్’ రూపొందించారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల విజ్ఞప్తులు, కొత్త రేషన్ కార్డులు, స్థానిక మౌలిక సదుపాయాల వరకు ఏ రకమైన సమస్యకైనా తక్షణ పరిష్కారమే ధ్యేయంగా మంత్రి ఈ వేదికను తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం.
ఇక్కడి నుంచే తొలి అడుగు
ఈ నెల 25న శనివారం మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నరెండు ప్రధాన కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నేలకొండపల్లి మండలం రాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తొలి దర్బార్ జరుగుతుంది. ఈ కేంద్రానికి రాయిగూడెం, అజయ్ తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలతో హాజరుకావచ్చు. మధ్యాహ్నం 3:30 నుండి తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 3:30 గంటల నుండి రాత్రి 7:30 వరకు రెండో వేదిక సిద్ధమైంది. ఈ కేంద్రానికి సుబ్లేడు, లక్ష్మీ దేవిపల్లి తండా, రఘునాధపాలెం, హస్నాబాద్, ఇస్లావత్ తండా, మహమ్మదాపురం, మేకల తండా, మేడిదపల్లి, చంద్రు తండా, జోగులపాడు, పాతర్లపాడు, గోల్ తండా, జల్లెపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తరలిరానున్నారు. “తన నియోజకవర్గంలో ఏ ఒక్క పౌరుడు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకూడదనే ఆకాంక్షతోనే ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టాను” అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ పూర్తి సమాచారంతో క్షేత్రస్థాయికి రావాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




